Friday, May 31, 2024
Friday, May 31, 2024

ఆలోచించవలసిన తరుణం

మాటల మాంత్రికుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పదేళ్ల కాలంలో తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి కొత్త అసత్య ప్రచారాన్ని గుదిగుచ్చుతున్నారు. 2014లో అధికారంలోకి రావడానికి అనేక బూటక వాగ్దానాలతో జనాన్ని మురిపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్న హామీ చివరకు కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించడానికే పరిమితమైంది. కనీసం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలలో కూడా భర్తీ జరగలేదు. నిరుద్యోగుల సంఖ్య మోదీ హయాంలో పెరిగినంతగా గత 75 ఏళ్ల కాలంలో ఎన్నడూ పెరగలేదు. పెరుగుతున్న నిరుద్యోగ సేనకు సంబంధించి ప్రభుత్వ విభాగాలే బయట పెట్టిన గణాంకాలను ప్రజలకు తెలియకుండా చాప కిందకు తోసేశారు. మోదీ ప్రధానమంత్రి కాక ముందు ఆయన మీద 2002 నాటి గుజరాత్‌ మారణకాండ పాపభారం ఉండేది. అందుకని 2013లో మోదీయే ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రకటించిన తరవాత అభివృద్ధి పల్లవి ఎత్తుకున్నారు. ఈ వాగ్దానాలన్నింటినీ జనం నమ్మారు. 2014లో 31శాతం మంది బీజేపీకి ఓటు వేస్తే అది 2019 నాటికి 37 శాతానికి పెరిగింది. ఈ సారి ఎన్నికల క్రమం మొదలు కాక ముందు నుంచే మోదీని ఓటమి భయం పీడిస్తోంది. విరామం లేకుండా ఆయన కొనసాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ను భయంకరులుగా చిత్రించడంతోపాటు వివిధ అంశాలపై అసత్య ప్రచార డోసు పెంచారు. ఇంతకు ముందు రాహుల్‌ గాంధీని ఎందుకు పనికిరానివాడిగా చిత్రించి అపహాస్యం చేసిన మోదీ ఇప్పుడు రాహుల్‌ గాంధీనే తన ప్రధాన ప్రత్యర్థి అని అంగీకరించక తప్పని స్థితిలో పడిపోయారు. అన్నింటికీ రాహుల్‌ గాంధీనే బాధ్యుడిని చేసి మాట్లాడుతున్నారు. అనేక ప్రతిపక్షాలు కలిసి ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన ఏర్పాటు చేయడంతో మోదీలో భయం అపరిమితంగా పెరిగిపోయింది. అందుకే ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా అతి పెద్ద ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మీద దాడి ముమ్మరం చేశారు. మూడోసారి అధికారం సంపాదించడానికి ఆయన కొత్త ఎత్తు ఎత్తారు. కాంగ్రెస్‌ కు 60 ఏళ్లు అధికారం ఇచ్చారు, నాకు 60 నెలలు ఇవ్వండి చాలు అని చెప్పిన మోదీ ఆ అరవై నెలల్లోనూ సాధించింది ఏమీలేదు. తొలి విడత అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద నోట్ల రద్దు విధానాన్ని చెప్పా పెట్టకుండా అమలుచేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారు. ఈ దెబ్బతో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, ఎం.ఎస్‌.ఎం.ఇ.లు కుదేలైపోయాయి. రెండో దశ అధికారంలోకి రావడానికి యుద్ధ భయం కల్పించారు. బాలాకోట్‌, పుల్వామా సంఘటనల గురించి భారీ ఎత్తున ప్రచారం చేసి మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించారు. అయినా బీజేపీ పాలనవల్ల జనానికి ఒరిగిందేమీ లేదు. ఆయన వంది మాగదులు మోదీ ‘‘అపూర్వమైన’’ విజయాలు సాధించారని ఊదరగొడ్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ అయోమయ స్థితి నుంచి జనం దృష్టి మళ్లించడానికి కొత్త అబద్ధ ప్రచారానికి తెరలేపారు. మోదీ పాలనలో మరింతమంది ఇంటర్నెట్‌ సదుపాయాన్ని వినియోగించుకో గలుగుతున్నారని, 420 మిలియన్ల మంది కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచారని, 110 మిలియన్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు వచ్చాయని, 220 మిలియన్ల మందికి బీమా సదుపాయం అందిందని, రహదారుల నిర్మాణం అనూహ్యంగా పెరిగిందని, కరోనాను నిరోధించడానికి మనం తయారుచేసిన టీకా మందును ఇతర దేశాలకు ఎగుమతి చేయడంవల్ల మన కీర్తి పెరిగిందని, అన్నింటికన్నా మించి 80 కోట్ల మందికి ఉచితంగా అయిదు కిలోల ధాన్యం అందిస్తున్నారని మోదీ భక్తులు ప్రచారం చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ ఎంత ఉదారంగా చూద్దామనుకున్నా అర్థ సత్యాలే. ఇవేవీ జనం బాధలను నివారించలేక పోయాయి.
మోదీ చెప్పుకుంటున్న విజయాలేవీ ప్రజా సంక్షేమానికి దోహదం చేసినవి కావు. మోదీ హయాంలో ప్రజాస్వామ్యం మంటగలిసింది. ఉన్న స్వేచ్ఛ కాస్తా మాయమై పోయింది. పత్రికా స్వేచ్ఛతో పాటు అనేక స్వేచ్ఛల విషయంలో దేశ పరిస్థితి విపరీతంగా దిగజారింది. అసలు వ్యవస్థే అస్తవ్యస్తం అయిపోయింది. స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్య వ్యవస్థలను మోదీ తన గుప్పెట్లో పెట్టుకుని ప్రత్యర్థులను వేధించడానికి వినియోగించడం ఒక ఎత్తయితే అసలు పాలనా వ్యవస్థనే కుళ్లబొడిచి ఏకఛత్రాధిపత్యానికి మొత్తం వ్యవస్థనే నెట్టేశారు. అనేక అంశాలలో మోదీనే అంతిమ నిర్ణేత. పార్లమెంటుకు ఉమ్మడిగా బాధ్యత వహించిన మంత్రివర్గ పాలన ఎందుకూ కొరగాకుండా పోయింది. మంత్రులు కనీసం ఉత్సవ విగ్రహాలుగానైనా మిగలలేదు. పరిపాలనా వ్యవస్థ దగ్గరకు వస్తే రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమే లేకుండా పోయింది. మోదీ సర్వాంతర్యామి అయిపోయారు. చివరకు న్యాయవ్యవస్థ కూడా చాలా సందర్భాలలో ప్రభుత్వ అనుకూల తీర్పులు ఇచ్చేస్థాయికి దిగజారి పోయింది. వివక్షా పూరిత విధానాలవల్ల మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల స్వేచ్ఛను హరించడానికే దారితీశాయి. ముస్లింలను పనిగట్టుకుని పరాయివారిగా చిత్రించే పద్ధతి అమలులోకి వచ్చింది. అధికారవర్గాలు ముస్లింల విషయంలో వివక్ష ప్రదర్శించే ధోరణి అపరిమితంగా పెరిగిపోయింది. పోలీసు వ్యవస్థ, కడకు న్యాయస్థానాలు కూడా ప్రభు భక్తిని ప్రదర్శించక తప్పని స్థితికి చేరుకున్నాయి. జాతీయతావాదులుగా చెలామణి అయ్యే మూకలకు అల్పసంఖ్యాక వర్గాల వారిని బెదరగొట్టడానికి కొత్తబలం సమకూరింది. మైనారిటీలను బలాదూరుగా వేధించే ధోరణి పెరిగిపోయింది. అన్నార్తుల సంఖ్య విషయంలో మనం ఘోరంగా దిగజారి పోయాం. ఆకలి విషయంలో మొత్తం 121 దేశాల స్థితిని పరిశీలిస్తే మనం 107వ స్థానంలో మిగిలిపోయాం. ఈ విషయంలో మన పరిస్థితి పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ కన్నా హీనంగా ఉంది. దళితులు ఆర్థికంగా గత పదేళ్ల కాలంలో చితికి పోయారు. రిజర్వేషన్ల విధానం వల్ల దళితుల్లో అయిదు శాతం మందికే మేలు కలిగింది. మిగతా వారు హేయమైన పనులుచేసి పొట్ట పోసుకోవలసి వస్తోంది. విద్యావిధానం కునారిల్లి పోతోంది. శాస్త్ర పరిశోధనల స్థానాన్ని మతం మీద ఆధారపడ్డ విజ్ఞానికి పెద్ద పీట వేస్తున్నారు. విజ్ఞానానికి సంబంధించి మోదీ ఎన్ని అశాస్త్రీయ, అసత్య ప్రచారాలు చేశారో లెక్కే లేదు. అయినా గత పదేెళ్ల ఏలుబడిలో సాధించింది ఉదాహరణ ప్రాయమైంది మాత్రమేనని, మరోసారి అవకాశంఇస్తే తమ సత్తా ఏమిటో ప్రదర్శిస్తామని మోదీ అంటున్నారు. అందుకే బీజేపీకి అపూర్వమైన మెజారిటీ కట్టబెట్టాలని కోరుతున్నారు. మూడోసారి మోదీ అధికారంలోకివస్తే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితి మరింత భయానకంగా మారడం ఖాయం. మళ్లీ మోదీకి అవకాశంఇస్తే రాజ్యాంగం రూపురేఖలే మారిపోతాయి. మళ్లీ ఈ దేశంలో ఎన్నికలు జరుగుతాయన్న ఆశ కూడా అంతరిస్తుంది. ఇది ప్రజలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు వేయవలసిన తరుణం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img