Monday, April 22, 2024
Monday, April 22, 2024

గుప్త విరాళాలకు చెల్లు చీటీ

రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో దాపరికం లేకుండా చేస్తామన్న ఉద్దేశంతో 2017లో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఎట్టకేలకు గురువారం తేల్చేసింది. ఈ బాండ్లు ప్రవేశ పెట్టిన కొద్ది రోజులకే వీటిని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు జయా ఠాకూర్‌, సీపీఐ(ఎం), స్వచ్ఛంద సంస్థ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ విచారణ జరుగుతున్న సమయంలోనే గత జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎదురు బెదురు లేకుండా మరోసారి ఎన్నికల బాండ్లు జారీ చేసింది. రాజకీయ పార్టీలకు అందే విరాళాలలో దాపరికం ఉండకూడదన్న మిషతో ప్రవేశ పెట్టిన ఈ బాండ్లలో ఉన్నదే దాపరికం. భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ) అమ్మే ఈ బాండ్లను ఎంత మొత్తానికి ఎవరు కొన్నారన్న విషయం తెలియకుండా ఉండడం ఈ బాండ్లలో ఉన్న వికృత వ్యవహారం. ఎంత మొత్తానికి బాండ్లు కొనాలి అన్న విషయంలోనూ పరిమితి లేదు. ఈ వివరాలు తెలిసేది ఆ బాండ్లు విక్రయించిన ఎస్‌బీఐకి మాత్రమే. ఆ బ్యాంకుకు తెలిసిందంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తెలుసుకోవడం పెద్ద పనికాదు. ఈ అంశాన్ని విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు గత సంవత్సరం చివరలో మూడు రోజులపాటు వాదోపవాదాలు విని నవంబర్‌ రెండున తీర్పు వాయిదా వేసింది. విచారణ చేపట్టడానికే అపరిమితమైన జాప్యం చేసిన సుప్రీంకోర్టు గురువారం ఇవి చెల్లవని, రద్దు చేయాలని ప్రకటించినందుకు ఆనందించవలసిందే. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, బీఆర్‌ గవాయి, జేబీ పార్దీవాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన అయిదుగురు న్యాయమూర్తుల బెంచి ఈ తీర్పు చెప్పింది. తీర్పు ఏకగ్రీవమే అయినా ఇందులో రెండు భిన్న దారులు కనిపిస్తాయి. నిర్ధారణ మాత్రం ఒక్కటే. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని 19 (1) ఎ అధికరణకు, సమాచార హక్కుకు కూడా విరుద్ధమని న్యాయమూర్తులు తెలియజేశారు. బాండ్లకు వ్యతిరేకంగా ప్రధానంగా కొన్ని అంశాల మీద కోర్టు అభిప్రాయం వెల్లడిరచింది. బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకం, సమాచార హక్కుకు వ్యతిరేకమైనవి మాత్రమే కాదని ఇందులో ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం ఉండొచ్చునని న్యాయమూర్తులు నిర్ధారించారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలన్నీ ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడానికే కాకపోయినా కొన్ని విరాళాలు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడానికే ఇచ్చినవీ కావొచ్చు అని కోర్టు భావించింది. విద్యార్థులు, రోజు కూలీలు కూడా తాము అభిమానించే పార్టీకి తృణమో పణమో విరాళంగా ఇవ్వొచ్చు. ఈ బాండ్లను జారీ చేసిన ఎస్‌బీఐ ఈ పనిని తక్షణం ఆపేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ విరాళాలు ఏయే పార్టీలకు అందాయో ఎస్‌బీఐ. ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని కూడా ఉత్తర్వు చేశారు. నల్లధనాన్ని అదుపు చేయడానికి ఈ బాండ్ల పథకం ప్రవేశ పెట్టామన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వ్యాపార సంస్థలు ఇచ్చే విరాళాలు కేవలం వ్యాపార లావాదేవీలు అయి ఉండొచ్చునన్న తీవ్ర వ్యాఖ్య కూడా చేసింది. కంపెనీల చట్టంలోని 182 వసెక్షన్‌ను సవరించి వాటిని కూడా వ్యక్తుల కింద జమకట్టడం ఏకపక్షమైన నిర్ణయం అని కూడా న్యాయమూర్తులు అన్నారు. నల్ల ధనాన్ని అరికట్టడానికి బాండ్లు ఒక్కటే మార్గం కాదు. ఇంకా అనేక మార్గాలు ఉంటాయని న్యాయమూర్తులు గుర్తు చేశారు. ఏమైతేనేం నగదు బదులు బాండ్ల రూపంలో విరాళాలు అందజేయడంవల్ల దాపరికం ఉండదన్న ప్రభుత్వ వాదన ఈ తీర్పుతో తుత్తినియలు అయి పోయింది.
ఈ గుప్త విరాళాలు బీజేపీ ఖజానాలోకే అత్యధికంగా చేరడం చూస్తే వీటిని ప్రవేశ పెట్టడంలో మర్మం ఏమిటో అర్థమై పోతుంది. 2017-18 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో బాండ్ల రూపంలో రూ.12,008 కోట్లు సమకూరితే అందులో బీజేపీకి సమకూరిన మొత్తం రూ.6,564 కోట్లు. అంటే 55 శాతం విరాళాలు బీజేపీకే అందాయి. కాంగ్రెస్‌కు కేవలం రూ.1,135 కోట్లు అందాయి. అంటే 9.5 శాతం మాత్రమే. ప్రాంతీయ పార్టీలకు దండిగానే బాండ్ల రూపంలో విరాళాలు ముట్టాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ. 1.096 కోట్లు దక్కాయి. కేసీఆర్‌ నాయకత్వంలోని భారతీయ రాష్ట్ర సమితికి 2022-23లో అన్ని ప్రాంతీయ పార్టీలకన్నా ఎక్కువగా రూ.529 కోట్లు అందాయి. 2021-22లో తృణమూల్‌కు రూ.528 కోట్లు, డీఎంకేకు రూ.306 కోట్లు, బిజూ జనతాదళ్‌కు 291 కోట్లు, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌కు రూ.60 కోట్లు అందాయి. ఇవన్నీ ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే అందాయంటే ఈ విరాళాలలో ఏదో మతలబు ఉన్నట్టే. బాండ్లు మొదలైనప్పటి నుంచి దాదాపుగా ఇదే ధోరణి కొనసాగింది. ప్రభుత్వం ఏదైనా వ్యాపారస్థులకు అనుకూలమైన విధానాలే రూపొందిస్తున్నదని, వారి అండదండలతోనే పాలన కొనసాగుతుండడం కాదనలేని సత్యం. 2022-23లో జారీ చేసిన బాండ్లలో 90శాతం బీజేపీ ఖజానాకే తరలిపోయాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణ పత్రంలో పేర్కొంది. 2022-23లో బాండ్ల ద్వారా రూ. 850.438 కోట్లు వసూలు అయితే అందులో బీజేపీది రూ. 719.858 కోట్లతో అతి పెద్ద వాటా. ఈ బాండ్లు ప్రవేశ పెట్టిన దగ్గరి నుంచే దాపరికంలేని హక్కులుండాలని పోరాడే సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వీటిని ప్రవేశ పెట్టినప్పుడు రిజర్వు బ్యాంకు అభ్యంతరాలను మోదీ ప్రభుత్వం పట్టించుకోనే లేదు. వీటి గురించి ఏ చర్చకూ అవకాశం ఇవ్వకుండా మోదీ సర్కారు ఈ గుప్త విరాళాల పద్ధతి అమలు చేసింది. బాండ్లకు వ్యతిరేకంగా ఏ ఆందోళన వ్యక్తం అయిందో సుప్రీంకోర్టు తీర్పు వాటన్నింటినీ ధ్రువపరిచింది. భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చిన వ్యాపార సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు కడకు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తమ చేతికి ఎముక లేనట్టుగా బీజేపీ ఖజానా నింపేశాయి. ఎన్నికల్లో డబ్బు వెదజల్లడం రాను రాను విపరీతంగా పెరిగిపోతోంది. 2014 ఎన్నికలలో పెట్టిన ఖర్చు కన్నా 2019 ఎన్నికల ఖర్చు రెట్టింపు అయింది. ఎన్నికల సమయంలో డబ్బు సంచులు గుమ్మరించడం పరిపాటి అయింది. ఇంకా నగదు రూపంలోకి మారని బాండ్లను వెనక్కు ఇచ్చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం విచారణలో జరిగిన జాప్యానికి పరిహారం అనుకోవాల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img