Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

విజ్ఞతే మహోజ్జ్వల భవితకు పునాది

ఓటు వేయడమంటే జాతి భవితవ్య నిర్మాణంలో పాలుపంచుకోడమే. ఓటరు చూపుడువేలిపై మెరిసే సిరాచుక్కే ఆధునిక వజ్రాయుధం. ప్రజాస్వా మ్యానికి పట్టంకట్టే జనాదేశ చిహ్నమే వయోజన ఓటు హక్కు. పద్దెనిమిదో లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ శాసన సభలకు జరగనున్న మొత్తం ఏడు అంచెల సార్వత్రిక ఎన్నికల క్రతువులో నాలుగోదశ పోలింగ్‌ సోమవారం జరగనున్నది. తెలుగు రాష్ట్రాలు రెండిరటిలోని 42 లోక్‌సభ స్థానాలు, ఆంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, తెలంగాణలోని ఒక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో 4.08 కోట్ల మంది, తెలంగాణలో 3.34 కోట్ల మందికి పైగా ఓటర్లు రేపు నిర్దేశిస్తారు. నిన్నటివరకూ పాలక, ప్రతిపక్ష పార్టీలు అలవిగాని హామీలు, అంతులేని ప్రలోభాలు, విద్వేషపూరిత ప్రసంగాలు, ఒకర్నిమించి మరొకరు వాగ్దానాల వరదలతో హోరెత్తించాయి. ‘కోడ్‌’ కళ్లుగప్పి చాపకిందనీరులా మద్యం, డబ్బు ప్రవాహాన్ని పరుగులెత్తించాయి. నిగ్రహం చూపి నిదానించి వివేచనతో మాట్లాడాల్సిన నేతలు అలవోకగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిందలతో గురివింద చందంగా తమ వాచాలత్వాన్ని ప్రదర్శించారు. ప్రజాసేవ ముసుగులో బరిలో దిగిన వారిలో నేరచరితులు తక్కువేమీ కాదు. దేశ ప్రజాస్వామ్య నిజపరిరక్షకులైన ఓటర్లే తమ వివేచనతో తీర్పు ఇవ్వాల్సిన తరుణం అసన్నమైంది. వయోజనుల చేతిలోని ఓటాయుధానికి ఘన చరిత్ర ఉంది. ప్రభుత్వాలను కూల్చడం, ఏర్పాటు చేయడంతోపాటు ప్రజల జీవితాలను ప్రభావితం, పతనం చేయడం ఈ ఓటు మీదే ఆధారపడి ఉంది. దేశంలో ఎన్నికల ప్రారంభంలో మొత్తం ఓటర్లు 13కోట్ల మందే. నేడు ఆ సంఖ్య దాదాపు 97కోట్లు. ఈ సంఖ్య దేశ మొత్తం జనాభాలో దాదాపు 70 శాతం. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఓటర్ల సంఖ్య దాదాపు 15 కోట్లు పెరిగింది. మండుటెండలపై వ్యక్తమౌతున్న ఆందోళనల కారణంగా మొదటిసారిగా వికలాంగులు, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు తమ ఇళ్ల నుంచే ఓటు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం మొట్టమొదటిసారిగా అనుమతించింది. ఓటర్లు మరింత అనుకూలమైన సమయంలో వచ్చేందుకు వీలుగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ని గంటపాటు పొడిగించారు. మన దేశంలో మొదట 21 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించి అనంతరం 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 ఏళ్లకే ఓటుహక్కు కల్పించారు. ఇది దేశంలోని యువత పట్ల మనకు గల పరిపూర్ణ విశ్వాసానికి తార్కాణమని నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ వ్యాఖ్యానించారు. నిజమే, 140కోట్ల మందికిపైగా ఉన్న జనాభాలో 25ఏళ్ల లోపు యువత సగానికి సగం ఉండడం ఈ దేశ ప్రత్యేకత. ఈసారి దేశంలో 18`19 ఏళ్ల వయస్సు కలిగి తొలిసారి ఓటు వేయనున్న ఓటర్లు దాదాపు మూడుకోట్ల మంది ఉన్నారని అంచనా. అయితే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంతమంది భాగస్వాములవుతున్నారనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది. ఇప్పటివరకూ 2014లోనే అత్యధిక పోలింగ్‌ శాతం నమోదైంది. అదీ కేవలం 66.4శాతమే. ఆ ఎన్నికల్లో 27కోట్ల మందికిపైగా ఓటుహక్కు వినియోగించు కోలేదు. సంపన్నులు, విద్యావంతులు, ఎగువ మధ్యతరగతివారిలో అత్యధికులు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు విశ్లేషకులు చెపుతున్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడంలో ఎన్నికల సంఘం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొందరు ఓటు వేయకపోతే ఏంలే అనే నిరాసక్తత వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేయడమే. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఓట్లు గల్లంతైనట్లు, కొన్ని చోట్ల దొంగ ఓట్లు పెద్ద సంఖ్యలో చేర్పించినట్లు, ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు ఉన్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ అప్రజాస్వామిక అధికార దుర్వినియోగ దుష్కార్యంలో పాలక పార్టీల పాత్ర ముఖ్యంగా ఎన్నికల కమిషన్‌ అనుసరిస్తున్న తీరు ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నిచాతినీచమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఉదాసీన ధోరణి ప్రదర్శించడం, ఇప్పటికే ముగిసిన మొదటి రెండు దశల్లో పోలైన ఓట్ల శాతాన్ని ప్రకటించడంలో చేసిన జాప్యంతో ఎన్నికల కమిషన్‌ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. ఎన్నికల కమిషన్‌ ఈ విధమైన చర్యలు, ప్రజాస్వామ్యమంటే ఎలాగైనా తామే అధికారంలోకి రావడం అని భావించే నాయకుల వల్లే ఎన్నికల ప్రక్రియపై సామాన్యులకు విశ్వాసం సన్నగిల్లుతోంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలున్నప్పటికీ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే శాసన వ్యవస్థకు చోదకశక్తి అయిన రాజకీయ రంగం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి, చైతన్యాన్ని ప్రకటించకపోతే మిగతా వ్యవస్థలు కూడా భ్రష్టుపడుతాయి. ఆ దృశ్యాన్ని కూడా మనం కేంద్రంలో గత పదేళ్లగా, రాష్ట్రంలో అయిదేళ్లలో చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. మోదీ, జగన్‌… రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి దాదాపు నిరంకుశ పాలనను కొనసాగించారు. ఎంతో గురుతర బాధ్యతతో వ్యవహరించి, రాజ్యాంగ వ్యవస్థల పనితీరుపై సునిశిత ఆలోచన చేసి, దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శకంగానూ, మనకు మనం సచ్ఛీలతతో జీవించేలానూ చూడాల్సిన పాలకులు, నేతలు నేడు ఆ కర్తవ్యాన్ని విస్మరించి అప్రజాస్వామ్యానికి, సమస్త అక్రమాలకు పాల్పడుతున్నారు.
ప్రజాస్వామ్య కీచకులైన వారి తోలుతీయడానికి, అప్రజాస్వామిక సార్వభౌముల ఆట కట్టించడానికి ఇప్పుడు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యం, వివేకం, విజ్ఞత గలవారు… ధన, కనక, మద్యం ప్రవాహాలతో ఏమార్చాలని చూసిన పార్టీలకూ, నేతలకూ తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పగలరని గత చరిత్ర చెబుతోంది. ఈ ఎన్నికల్లోనూ మరో సారి అదే ప్రస్ఫుటంగా ప్రతిఫలింపచేస్తారని ఆశిద్దాం. ఓటరు ఎంతో చైతన్యంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణబద్ధ మవుతున్నాడు. అప్రజాస్వామ్య, అరాచక, అవినీతి శక్తులకు తగిన గుణపాఠం నేర్పుతూ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మయిన భావప్రకటనా స్వేచ్ఛ పరిఢవిల్లడానికి ప్రజలు సందర్భం వచ్చినప్పుడల్లా యుక్తాయుక్తవిచక్షణతో వ్యవహరిస్తున్నారు. చేతిలోని ఓటు అనే మహాస్త్రాన్ని సద్వినియోగం చేసుకోవడం ఓటర్లపైనే ఆధారపడి ఉంటుంది. డబ్బు, మద్యం ప్రభావాలకు లోనుకాకుండా ఎక్కడికక్కడ అవినీతిని కుళ్లగించి, ప్రజలకు సేవచేసే నిజమైన ప్రజాప్రతినిధులను, సమర్థులను ఎంచుకోవడం ఓటర్ల ప్రాథమిక కర్తవ్యం. ప్రతి ఓటు ఎంతో విలువైనది. ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు నిర్ధారిత మవుతాయి. కొందరు ఓటర్ల నిస్పృహ, అలసత్వం కారణంగా అభ్యర్థుల గెలుపోటములు తారుమారైన ఉదంతాలు ఎన్నో! కాబట్టి ఒత్తిడులకు, ప్రలోభాలకు, క్షణికమైన ఎరలకు ఆకర్షితులై ఓటును అమ్ముకోడమో, తప్పుడు నిర్ణయానుసారం వినియోగించడమో జరిగితే తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అనర్హులు, అసమర్థులు, అవినీతిపరుల చేతిలోకి జారిపోతుంది. ఈ తప్పుకు అయిదేళ్లపాటు పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. రాష్ట్ర, దేశ భవిష్యత్తు అయోగ్యుల పాల్బడకుండా వివేచనతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. బలహీనులకు బలవంతులతో సమానమైన అవకాశాలు కల్పించేదే ప్రజాస్వామ్యమని గాంధీజీ అన్నారు. అటువంటి మహత్తర స్థితికి సూచి ఓటు. ఈ కీలక సమయంలో ఓటును సద్వినియోగం చేసుకోడమే ఏకైక కర్తవ్యం. ఓటరు స్థాయిలో విజ్ఞతే మహోజ్జ్వల భవితకు సరైన పునాది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img