Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

హద్దు మీరిన మోదీ కక్ష సాధింపు

తొమ్మిది సార్లు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఇ.డి.) సమన్లను నిర్లక్ష్యం చేసిన తరవాత గురువారం రాత్రి ఇ.డి. అధికారులు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేస్తున్నది ఇ.డి.తెలియజేయలేదు కానీ మద్యం కుంభకోణానికి ఆయనే సూత్రధారి అని మాత్రం వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టయిన వారిలో కేజ్రీవాల్‌ మొదటి వారు. ఇంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను, బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ యాదవ్‌ ను, ఇటీవల జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను కూడా అరెస్టు చేశారు. కానీ వారు అరెస్టు కాకముందే రాజీనామా చేశారు. కేజ్రీవాల్‌ మాత్రం చివరి దాకా రాజీనామా చేయలేదు. పదవిలో ఉండగానే అరెస్టయ్యారు. పైగా ఆయన మద్దతుదార్లు ఆయన నిర్బంధంలో ఉంటూనే ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తారంటున్నారు. జైలులో ఉంటూ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించకూడదు అన్న నిబంధన ఏ చట్టంలోనూ లేదని రాజ్యాంగ నిపుణులు ఎస్‌.కె.శర్మ లాంటివారు అంటున్నారు కానీ అలా నిర్వహించిన పూర్వోదంతాలూ లేవు. పైగా ముఖ్యమంత్రి నిర్బంధంలో ఉన్నారు కనక రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం కొనసాగడం లేదని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వానికి జో హుకుందార్లుగా పని చేసే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిద్ధంగానే ఉంటారు. అరెస్టు అవుతానన్న విషయం కేజ్రీవాల్‌కు గురువారం ఉదయమే స్పష్టంగా తెలిసిపోయింది కనక ప్రభుత్వం బర్తరఫ్‌ అయ్యే పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించడమె విజ్ఞత అయి ఉండేదేమో. హేమంత్‌ సొరేన్‌ అందుకే రాజీనామా చేశారు. తమ మంత్రివర్గాలు బర్తరఫ్‌ కాకుండా చూసుకోవడం కోసమే లాలూ, జయలలిత, హేమంత్‌ సొరేన్‌ అరెస్టు చేయకముందే రాజీనామా చేశారు. కేజ్రీవాల్‌ మాత్రం రాజీనామా చేయలేదు. అరెస్టును రద్దు చేయించాలని ఆయన సుప్రీంకోర్టుకు విన్నవించినా రాత్రి పొద్దు పోయాక విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదీ కాక దిల్లీ మద్యం కేసులోనే అరెస్టయిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు కవితకు కూడా అత్యున్నత న్యాయస్థానం నుంచి ఊరట కలగలేదు కనక కేజ్రీవాల్‌ అత్యున్నత న్యాయస్థానంలో తన అర్జీ ఉపసంహరించుకున్నారు. దిల్లీ మద్యం కుంభకోణం బూచిని చూపి మోదీ కనుసన్నల్లో అడిరచే ఇ.డి. అనేకమంది ప్రతిపక్ష నాయకుల మీద కత్తిగట్టినట్టు ప్రవర్తిస్తోంది. దిల్లీ ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్‌ సిసోడియా 13 నెలలుగా జైలులోనే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ ఆరు నెలలుగా నిర్బంధంలోనే ఉన్నారు. కేజ్రీవాల్‌ సన్నిహితుడు విజయ్‌ నాయర్‌ కూడా కటకటాలు లెక్కిస్తున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టును అడ్డుకోవడానికి ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు గురువారం రాత్రి ఆ రోడ్డును దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఆప్‌ కార్యకర్తలను, దిల్లీ మంత్రి ఆతిశీ లాంటివారిని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి భద్రతాదళాల వారు యుద్ధానికి సిద్ధమైనట్టు రావడం మరీ విచిత్రం. కేజ్రీవాల్‌ను నిర్బంధించినా ఆయన ఆలోచనలను బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి బల్వంత్‌ మాన్‌ లాంటి వారు గంభీరమైన ప్రకటనలు గుప్పిస్తున్నా ఇ.డి.వ్యవహర సరళి చూస్తే ఇప్పట్లో కేజ్రీకి స్వేచ్ఛ లభించే అవకాశం చాలా తక్కువ.
కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగి ఉండొచ్చు. అయితే ఆ మద్యం విధానాన్ని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఎప్పుడో రద్దు చేసింది. అయినా ఆ ఉదంతం ఇంకా ఆమ్‌ఆద్మీ పార్టీని వెంటాడుతూనే ఉంది. అన్నింటికన్నా మించి కేంద్ర ప్రభుత్వం అధీనంలో పని చేసే సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలో అంతర్భాగమైన ఇ.డి.ని మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను దెబ్బ తీయడానికి వినియోగించుకుంటోందన్న అభిప్రాయం జనంలో బాగా నాటుకు పోయింది. అందుకే కేజ్రీవాల్‌ మద్యం విధానాన్ని తప్పు పడ్తున్నవారు కనిపించడం లేదు. కవితను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే రెండు రోజుల తరవాత కేజ్రీని అరెస్టు చేయడంలో మద్య విధాన కుంభకోణాన్ని ప్రతిపక్షాలను బలహీన పరచడానికి మోదీ ప్రభుత్వం వినియోగించుకుంటోందన్న భావన మరింత ఎక్కువ కావచ్చు. ఇ.డి.ని మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద దాడికి పదునైన ఆయుధంగా వినియోగిస్తోందన్నది మాత్రం నిర్వివాదాంశం. ఇందులో మోదీ ప్రభుత్వ కక్ష సాధింపు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఇ.డి. కేసులు, ద్రవ్య అక్రమ వినియోగ చట్టాం (పి.ఎం.ఎల్‌.ఎ.) లాంటివాటి కింద అరెస్టు అయిన వారు దీర్ఘకాలం నిర్బంధంలో ఉంటారు తప్ప విచారణ ప్రారంభం కాదు. అంటే విచారణ కాకుండానే శిక్ష అనుభవించేట్టు చేసే విధానాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ సారి 400 సీట్లు సాధిస్తామని మోదీ ఊరూరా తిరిగి టముకు వేయడం ఆయన బలాన్ని కాక బలహీనతను సూచిస్తోంది. ఓటమి భయం బీజేపీని వెంటాడుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న కొద్దీ ప్రతిపక్షాల మధ్య ఐక్యత మరింత పటిష్ఠం అవుతోంది. ప్రతిపక్షాలను కుంగ దీయడానికి తన చేతిలో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలు గొప్ప ఆయుధం అని మోదీ భావించవచ్చు కానీ అవే విషనాగులై మోదీ కుర్చీ చుట్టు భయంకర రీతిలో తిరుగుతున్నాయి. పైగా సుప్రీం అభిశంసించిన తరవాత ఎన్నికల బాండ్లకు సంబంధించిన సకల వివరాలు ఎస్‌.బి.ఐ. ఎన్నికల కమిషన్‌ కు అందజేసిన రోజుననే కేజ్రీని అరెస్టు చేయడంతో మోదీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్య మరింత బలంగా బయట పడిరది. సీబీఐ, ఇ.డి.లాంటివి బీజేపీ నేతల మీద వచ్చిన ఆరోపణలను పట్టించుకుని వారి మీద దాడి చేసిన ఉదంతం ఒక్కటి కూడా లేదు. పైగా ఇతర పార్టీలో ఉంటూ ఆరోపణలతో ఊపిరాడని నాయకులు బీజేపీలో చేరిపోగానే అప్పటిదాకా ఉన్న కేసులన్నీ కనుమరుగైపోతున్నాయి. కేజ్రీవాల్‌ అదే పనిగా ఇ.డి.సమన్లను బేఖాతరు చేయడంతో ఇ.డి. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరూపించడంలో కేజ్రీ విజయవంతం అయి ఉండొచ్చు. కానీ కేజ్రీ సమన్ల దాటవేతకన్నా మోదీ సర్కారు ప్రతిపక్షాలను వెంటాడడంలో ఎంత మాత్రం జాప్యం చేయలేదు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తరవాత కేంద్రం ఇలా వేటాడుతోందంటే ఎన్నికల నైతిక ప్రవర్తనా నియమావళిని కూడా బేఖాతరు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుందనుకోవాలి. దిల్లీలో షీలా దీక్షిత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పాలన పదిహేనేళ్లు కొనసాగి అంతమైన దగ్గర్నుంచి దిల్లీలో కేజ్రీవాల్‌ తిరుగులేని నాయకుడిగా వెలిగిపోతున్నారు. అది బీజేపీకి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. అంతేగాక అవసరమైనప్పుడు బీజేపీ తన గుత్త సొత్తు అనుకుంటున్న హిందుత్వ రాజకీయాలను ఏదో ఓ రూపంలో అనుసరించడానికి కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీజేపీ అగ్ర నాయకత్వానికి ఈ రెండు అంశాలూ సుతరామూ మింగుడు పడడం లేదు. దిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ సాధించిన ఫలితాలు అవమానకరంగా ఉన్నాయి. దేశ రాజధానిలో తమ ప్రభుత్వం లేదన్న బాధ బీజేపీకి నిరంతరం గుర్తొస్తూనే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img