acaiwater.com www.bonusheda.com www.bonusorti.com www.bonusdave.com gamersbonus.com www.bonusarsiv.com www.bonusfof.com rcflying.net www.bonustino.com www.onlinesporbahisi.com texasslotvip.com gamefreebonus.com bonusrey.com visiopay.com heatextractors.com
Friday, September 27, 2024
Friday, September 27, 2024

జ్ఞాన శూన్య గవర్నర్‌

రాజ్యాంగ పదవుల్లో ఉండే వారందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతినబూనుతారు. ఇది రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర మంత్రివర్గ సభ్యులకు, రాష్ట్ర గవర్నర్లకు, మంత్రులకు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకూ వర్తిస్తుంది. రాజ్యాంగం మీద ప్రమాణంచేసి రాజ్యాంగాన్ని కుళ్లబొడిచే వారు రాజ్యమేలుతున్న రోజుల్లో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి లాంటి వారు రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని ఖాతరు చేస్తారనుకోవడం భ్రమే. సెక్యులరిజం మన దేశానికి అవసరం లేదని ఆర్‌.ఎన్‌.రవి నిర్మొహమాటంగానే చెప్పారు. సెక్యులరిజం అనే భావన యూరప్‌ నుంచి వచ్చిందని, మనం దాన్ని అనుసరించవలసిన అగత్యం లేదని రవి అన్నారు. సెక్యులరిజం అన్న మాట మొదట రాజ్యాంగంలో లేదని, ‘‘అభద్రతా భావం ఉన్న ఒక ప్రధానమంత్రి’’ సెక్యులరిజం అన్న మాటను రాజ్యాంగంలో చేర్చారని ఆర్‌.ఎన్‌. రవి అంటున్నారు. రాజ్యాంగంలో మొదట ఈ మాటలేని మాట నిజమే. ఇందిరాగాంధీ హయాంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అంతకు ముందు రాజ్యాంగంలో ఉన్న ‘‘సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్రం’’ అన్న మాటలను ‘‘సార్వభౌమ, సోషలిస్ట్‌, సెక్యులర్‌, ప్రజాస్వామ్య రిపబ్లిక్‌’’ గా మార్చారు. అలాగే ‘‘దేశ ఐక్యత’’ అన్న మాటలను ‘‘దేశ ఐక్యత, సమగ్రత’’ అని కూడా మార్చారు. ఇది చరిత్ర. ఈ చరిత్ర గవర్నర్‌ హోదాలో ఉన్న ఆర్‌.ఎన్‌.రవికి తెలియకపోవడం మనకు ఎలాంటి గవర్నర్లను నియమిస్తున్నారు అన్న దానికి నిదర్శనం. ఆర్‌.ఎన్‌.రవి సెక్యులరిజం మనకు అనవసరం అని చెప్పి ఊరుకోలేదు. ఇది యూరప్‌ దేశాల భావన అనీ అక్కడ చర్చికి, రాజ్య వ్యవస్థకు మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా సెక్యులరిజం అన్న భావన రూపుదిద్దుకుందని కూడా రవి అన్నారు. చర్చికి, రాజ్యవ్యవస్థకు మధ్య ఘర్షణ కారణంగా యూరప్‌లో సెక్యులరిజం అన్న భావన ఉద్భవించిందన్న తెలివిడి ఉన్న గవర్నర్‌ అదే నోటితో మనం ‘‘ధర్మం’’ ప్రకారం నడుచుకోవాలి అంటున్నారు. పశ్చిమ దేశాల్లో చర్చి ఆధిపత్యంలో కొనసాగింది కూడా క్రైస్తవ ధర్మమే కదా. దాని ఆధిపత్యం సహించలేకే సెక్యులరిజం అన్న భావన అంకురించిందన్న తెలివిడి ఆర్‌.ఎన్‌.రవికి లేకపోవవడం విచారకరం. అక్కడ పనికి రాదనుకున్న ‘‘ధర్మం’’ మన దేశంలో ఆధిపత్య స్థానంలో ఉండాలని ఆయన కోరిక కావచ్చు. ఇది అచ్చు గుద్దినట్టు బీజేపీ అభిప్రాయమే. బీజేపీ నియమించిన గవర్నర్‌ ఆ పార్టీ భావజాలానికి అనుగుణంగా వ్యవహరించడంలో ఆశ్చర్యం లేదు కాని రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగానికి విరుద్ధంగానే కాదు రాజ్యాంగాన్ని తూలనాడే రీతిలో మాట్లాడడం రవి చిత్త వైపరీత్యానికి సంకేతం. తిరువనంతపురంలోని తిరువత్తూరులో హిందూధర్మ విద్యా పీఠం స్నాతకోత్సవంలో మాట్లాడుతూ తమిళనాడు గవర్నర్‌ సెక్యులరిజం అక్కర్లేదని వ్యాఖ్యానించడం ఆ వేదికకు అనుగుణంగా వ్యవహరించడం అని సర్ది చెప్పుకోవడానికి వీల్లేదు. ఆయన ఎక్కడ మాట్లాడుతున్నారన్న దానికన్నా ఏ హోదాలో మాట్లాడుతున్నారన్నది ప్రధానం. గవర్నర్‌ హోదాలో ఉంటూ రాజ్యాంగంలో ఉన్న అంశాలనే తప్పుపట్టే వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే అర్హతే లేదు. సెక్యులరిజానికి తప్పుడు భాష్యం చెప్పి దేశాన్ని మోసగించారు అని కూడా రవి వ్యాఖ్యానించారు. సెక్యులరిజం భారతీయ భావన కాదట. అలాగైతే ‘‘సెక్యులర్‌, సోషలిస్ట్‌’’ అన్న మాటలను రాజ్యాంగంలో చేర్చిన 42వ రాజ్యాంగ సవరణను తిరగతోడుతూ యథాలాపంగా ఎమర్జెన్సీ విధించడానికి వీలు లేకుండా జనతా పార్టీ హయాంలో 42వ రాజ్యాంగ సవరణలో జరిగిందనుకుంటున్న అపసవ్యాన్ని మార్చడానికి 44వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు 42వ సవరణలోని కొన్ని అంశాలను మాత్రం మార్చారు. సెక్యులర్‌, సోషలిస్టు అన్న మాటలను తొలగించే ధైర్యం బీజేపీకి పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్‌ు కూడా మిళితమైన జనతా పార్టీకి ఎందుకు లేకపోయిందో ఆలోచించే శక్తి రవి లాంటి గవర్నర్లకు లేకపోవడం సహజమే. సెక్యులరిజం అన్న మాటను చేర్చడాన్ని తప్పుపట్టడం ఆర్‌.ఎన్‌.రవి లాంటి వారు మాత్రమే చేయగల దుస్సాహసం.
తనను గవర్నర్‌ను చేసిన మోదీకి విధేయంగా ఉండాలన్న ఆతృతలో ఉన్నవీ లేనివీ, తన హోదాకు తగని వ్యాఖ్యలు చేయడం రవికి కొత్త కాదు. గవర్నర్‌ పదవుల్లో ఎవరిని నియమించాలన్న నియమాలను బుట్ట దాఖలు చేసే సంప్రదాయం బీజేపీ కనిపెట్టిన మహత్తరమైన అంశం ఏమీ కాదు. కాంగ్రెస్‌ హయాంలోనూ రాజకీయ నిరుద్యోగులకు రాజ్‌ భవన్‌లో ఆశ్రయం కల్పించారు. బీజేపీ దీనికి జోడిరచిన మరో దుర్లక్షణం ఏమిటంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. భావజాలం ఉన్న వారిని వెతికి గవర్నర్‌ పదవుల్లో కూర్చో పెట్టడం. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి వారిని వెతికి నియమిస్తుంటారు. తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి తాత్సారం చేయడం, ప్రతిపక్షాలు పోషించవలసిన పాత్రనే తాము ప్రోత్సహించడం, అనువైనప్పుడల్లా సంఫ్‌ు పరివార్‌ భావజాలాన్ని ప్రచారంలో పెట్టడం చాలా మంది గవర్నర్లు అనుసరిస్తున్న విధానమే. మహారాష్ట్ర గవర్నరుగా పని చేసిన కోషియారీ, కేరళ గవర్నరుగా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, ఒకప్పుడు బెంగాల్‌ గవర్నర్‌గా పని చేసిన ప్రస్తుత రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ పోషించిన దుష్ట పాత్రనే ఆర్‌.ఎన్‌.రవి కూడా అద్వితీయంగా పోషిస్తున్నారు. ఒక సందర్భంలో అధికారిక ఆహ్వానపత్రంలో తిరువళ్లువర్‌ కు రవి కాషాయ వస్త్రాలు తొడిగి తరించారు. గత సంవత్సరం తమిళనాడు మంత్రి వి.సెంథిల్‌ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ అరెస్టుచేస్తే ముఖ్యమంత్రికి మాత్రం చెప్పకుండా సదరు మంత్రిని బర్తరఫ్‌ చేసేశారు. తద్వారా గవర్నర్‌ మంత్రివర్గ సలహా మేరకు నడుచుకోవాలన్న రాజ్యాంగ నియమాన్ని బాహాటంగా ఉల్లంఘించారు. సెక్యులరిజం అన్న మాటను ఇంతకు ముందే రాజకీయ ప్రయోజనాల కోసం ‘‘సెక్యులరిజం’’ అన్న బీజేపీ నాయకులు ఉన్నారు. రవి దృష్టిలో సెక్యులరిజం విదేశీయమైంది అయితే, ఒక మనిషికి ఒకే ఓటు, ఫెడరల్‌ విధానం కూడా విదేశీయమైనవే కనక వాటిని తుడిచిపెట్టాలన్నది ఆయన అభిప్రాయం కాబోలు. ఇదీ రాజ్యాంగ ఉల్లంఘనే. మనకు ప్రజాస్వామ్య వ్యవస్థ అనాదిగా ఉందని వాదించే వారికి కొదవ లేకపోవచ్చు. కానీ ప్రస్తుతం మనం అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం మన ప్రాచీన చరిత్రలో ఎన్ని పేజీలు తిరగేసినా ఫలితం ఉండదు. రాజ్య వ్యవస్థ ‘‘ధర్మం’’ అనుసరించాలని రవి వాదిస్తున్నారంటే మన దేశం మత రాజ్యంగా ఉండాలనుకుంటున్నారా. అలాంటి వ్యక్తి ఒక్క క్షణం ఆ పదవిలో ఉన్నా ప్రమాదమే. సెక్యులరిజం అంటే ఆయనకు బొత్తిగా అర్థం అయినట్టు లేదు. యూరప్‌లో వచ్చిన సెక్యులర్‌ విధానానికి మనం అనుసరిస్తున్న సెక్యులర్‌ విధానానికి తేడా తెలిసినట్టు లేదు. యూరప్‌ లో సెక్యులరిజం అంటే రాజ్య వ్యవస్థపై చర్చి పెత్తనం చేయకపోవడం. మన సెక్యులర్‌ విధానం అంటే రాజ్య వ్యవస్థలో ఏ రకంగానూ మత జోక్యం ఉండకపోవడమే కాదు, మత వ్యవహారాలలో రాజ్యానికి ఇసుమంత ప్రమేయం కూడా లేకపోవడం. మన సెక్యులరిజం పరమత సహనానికి పరిమితం అయిందికాదు. నోటికొచ్చినట్టు మాట్లాడి ఆర్‌.ఎన్‌.రవి భారత్‌ అన్న భావన రూపొందడానికి కారకులైన గాంధీని, నెహ్రూను, అంబేద్కర్‌ ను కూడా అవమానించారు. మతాన్ని, రాజకీయాలను కలగాపులగం చేయకపోవడమే సెక్యులరిజం అని రవికి అర్థం అయ్యే అవకాశం ఉందా?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img