Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

రాజకీయ బరిలో భార్యామణులు

వంశపారంపర్య రాజకీయాలను ఎవరెంత విమర్శించినా మన దేశంలోనే కాదు దక్షిణాసియాలోనే ఈ ధోరణి కొనసాగుతూనే ఉంది. జాతీయ రాజకీయ పార్టీలలోనే కాక ప్రాంతీయ పార్టీల, లేదా పరిమిత ప్రాంతంలో పలుకుబడి ఉన్న రాజకీయ పార్టీలలోనూ ఇదే రివాజుగా మారింది. ఆ వరసలో ఇప్పుడు మరో ఇద్దరు చేరిపోయారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడువల్ల ఇటీవల అరెస్టు తరవాత ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు నాయకుల భార్యలు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను గత మార్చి 21న ఆ హోదాలో ఉండగానే అరెస్టు చేశారు. ఆయన జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తానంటున్నారు. జైలు నుంచి పరిపాలించ కూడదన్న నిబంధనలేవీ లేనందువల్ల న్యాయస్థానాలు సైతం కేజ్రీవాల్‌ జైలు నుంచి పరిపాలన కొనసాగించకూడదని చెప్పలేని స్థితి ఉంది. అయినా ఆయన జైలులో ఉన్నది ఇప్పటిదాకా అయితే నిందితుడిగానే తప్ప దోషిగా కాదు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ ను జనవరి 31 న అరెస్టు చేశారు. కానీ ఆయన అరెస్టుకు ముందే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆయన భార్య కల్పనా సొరేన్‌ ముఖ్యమంత్రి అవుతారన్న ఊహాగానాలు బయలు దేరాయి కానీ చివరకు చంపై సొరేన్‌ ముఖ్యమంత్రి స్థానంలో నియమితులయ్యారు. బహుశ: చంపై సొరేన్‌ ఎప్పుడు కావాలంటే అప్పుడు తప్పుకుని మళ్లీ హేమంత్‌ సొరేన్‌ ముఖ్యమంత్రి కావడానికి సహకరించే తత్వం ఉన్నవారు కావచ్చు. జైలునుంచే పరిపాలన కొనసాగించడంలో భాగంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవ్వదలుచుకున్న ఆదేశాలను సునీతా కేజ్రీవాల్‌ కే పంపుతున్నారు. ఆమె కేజ్రీవాల్‌ కుర్చీలోనే కూర్చుని భర్త పంపిన ఆదేశాల గురించి తెలియజేస్తున్నారు. అంటే కేజ్రీవాల్‌ రాజీనామా చేయకతప్పని పరిస్థితి ఏర్పడితే సునీతా కేజ్రీవాల్‌ పగ్గాలు చేపడ్తారన్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భరూచ్‌, భావనగర్‌ స్థానాలకు పోటీచేస్తోంది. మిగతా 24 చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేస్తోంది. అక్కడ ఎన్నికల ప్రచారంలో మేటి నాయకుల జాబితాను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. ఇందులో సునీతా కేజ్రీవాల్‌ పేరు కూడా ఉండడం చూస్తే ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్టే. గుజరాత్‌లో ప్రముఖ ఎన్నికల ప్రచారకుల జాబితాలో జైలులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ పేర్లు కూడా ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు, ఇటీవలే జైలు నుంచి విడుదలైన సంజయ్‌ సింగ్‌, రాఘవ చడ్డా, సందీప్‌ పాఠక్‌ కూడా ఎన్నికల ప్రచారంచేసే ప్రముఖుల వరసలో ఉన్నారు. గుజరాత్‌లో మే ఏడవ తేదీన ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. మరో రెండు రోజుల్లో నామినేషన్లు దాఖలు చేయడం మొదలవుతుంది. కేజ్రీవాల్‌ ఏర్పాటు చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి కొన్ని విశిష్టతలు ఉన్నాయి. అన్నా హజారే నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్‌ ప్రముఖమైన నాయకుడు. ఆ ఉద్యమం చల్లారిన తరవాత కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేశారు. అన్నా ఉద్యమంలోని కొందరికి ఇది నచ్చలేదు. 2015 నుంచి దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఆయనే నాయకుడు. మూడుసార్లు ఆయన ఎన్నిక కావడం విశేషం. పరిశుభ్రమైన రాజకీయాలు ఉండాలనుకున్న చాలా మంది ప్రసిద్ధులు మొదట్లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. కానీ ఆయన వ్యవహారసరళి నచ్చకో మరో కారణంవల్లో చాలా మంది ఆ పార్టీ నుంచి వెళ్లి పోయారు. మనీశ్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌ లాంటి వారు ఆయన తరవాత ప్రసిద్ధ నాయకులుగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి పదవి దగ్గరకు వచ్చే సరికి కేజ్రీవాల్‌ ఆ స్థానంలో తన అర్థాంగినే కూర్చోబెట్టాలనుకుంటున్నారు. ఇతరత్రా ఆమె అర్హతలను ప్రశ్నించే అవకాశం లేదు కానీ కేజ్రీవాల్‌ అరెస్టు తరవాతే ఆమె ప్రత్యక్షంగా రాజకీయాల్లో భాగస్వామి అవుతున్నారు.
జార్ఖండ్‌ లో మొదటి నుంచే వంశపారంపర్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఉద్యమ నాయకుడు శిబూ సొరేన్‌ కుమారుడే. హేమంత్‌ జైలుకెళ్లవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన భార్య కల్పన ముర్ము సొరేన్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. అలా జరగలేదు కానీ ఇప్పుడు ఆమె రాజకీయాల్లో చురుకుగానే ఉన్నారని, హేమంత్‌ సొరేన్‌ తరఫున ఆమే చక్రం తిప్పుతున్నారంటున్నారు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం జార్ఖండ్‌ రాజకీయాలపై గణనీయమైన ప్రభావంచూపే అవకాశం ఉంది. రాజకీయ నైపుణ్యం, చతురతలో ఆమె హేమంత్‌ సొరేన్‌కు ఏ మాత్రం తీసిపోరన్న అభిప్రాయమూ ఉంది. ఆమెకు నిర్దిష్టమైన రాజకీయ దృక్పథం కూడా ఉందట. ప్రతిపక్ష ఐక్య సంఘటన ‘‘ఇండియా’’ లోనూ ఆమె క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. సీట్ల పంపిణీ, ఇతర రాజకీయ కార్యక్రమాలలో కూడా ఆమె ప్రమేయం, ప్రత్యక్ష పాత్ర ఉందంటున్నారు. కొద్ది రోజుల కిందట ప్రతిపక్ష ఐక్య సంఘటనలోని జార్ఖండ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకూర్‌, రాష్ట్రీయ జనతా దళ్‌ అగ్ర నాయకులతో కల్పన చర్చలు జరిపారు. లోకసభ ఎన్నికల వ్యవహారాలు, సీట్ల పంపిణీలోనూ ఆమె పాత్ర కనిపించింది. కొద్ది రోజుల కింద కల్పన సొరేన్‌ దిల్లీ వెళ్లి కేజ్రీవాల్‌ భార్య సునీత కేజ్రీవాల్‌తో మంతనాలు జరిపారు. జార్ఖండ్‌ రాజకీయాలలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా ఆమె ప్రమేయం ఉంటుందంటున్నారు. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన నేతలతో చర్చల్లో ఆమే పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఆమె జార్ఖండ్‌లోని అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడితే ఆమె పాత్ర ఎలా ఉంటుందో తేలుతుంది. హేమంత్‌ సొరేన్‌ను కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా జైలులో పెట్టిందన్న సానుభూతి జార్ఖండ్‌ ప్రజల్లో ఉంది. ఇది కల్పన సొరేన్‌ కు బాగా అనుకూలించే అంశమే. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాణా కుంభకోణంలో ఆయన అరెస్టు అయినప్పుడు అంతవరకు గృహిణిగానే ఉన్న లాలూ భార్య రబ్డీ దేవి ముఖ్యమంత్రి అయిపోయారు. బీజేపీలోనూ వంశ పారంపర్య రాజకీయాలకు కొదవే లేదు. అనేకమంది నాయకుల సంతానం ఎన్నికల బరిలోకి దిగారు. విజయమూ సాధించారు. ఇప్పుడూ అలా బరిలో ఉన్న బీజేపీ నాయకులు చాలా మందే కనిపిస్తారు. డి.ఎం.కె., తెలుగు దేశం, బిజూ జనతా దళ్‌, తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రధాన నేత వారసులు రాజకీయాలలో ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆనువంశిక రాజకీయాల మంచి చెడ్డలు చర్చనీయాంశం కావచ్చు నేతల కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రాకూడదని చెప్పే అవకాశం లేదు. ఏ రూపంలో వారు రాజకీయాల్లోకి వస్తున్నారన్నదే ప్రధానం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img