Friday, June 14, 2024
Friday, June 14, 2024

బయో మెడికల్ వ్యర్ధాలు పర్యావరణానికి ప్రమాదకరం

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

విశాలాంధ్ర – భీమవరం: బయో-మెడికల్ వ్యర్థాలు మానవులకు, పర్యావరణానికి ప్రమాదకరం, వీటి నిర్వీర్యంపై అందరూ విస్తృత అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.శుక్రవారం స్థానిక విష్ణు కాలేజ్ ఆడిటోరియంలో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై సుస్థిర అభివృద్ధి సూచికల జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశం, వర్క్‌షాప్ కు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవ కార్యకలాపాలన్నీ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయని, అటువంటి వాటిలో కొన్ని వ్యర్థాలు ప్రమాదకరమైనవన్నారు. వాటిని సరైన విధానంలో నిర్వీర్యం చేయడం ఎంతో ముఖ్యమన్నారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, వ్యవసాయ, మెడికల్, తదితర వ్యర్థాలు నీరు, నేల, గాలిని కలుషితం చేస్తాయన్నారు. ఇది మానవులకు, పర్యావరణానికి కూడా ప్రమాదకరమన్నారు. ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు చాలా వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయని, ఇవి అంటువ్యాధులను ప్రసారం చేయగలవని, ముఖ్యంగా హెచ్ ఐ వి హెపటైటిస్ బి & సి వంటి వాటికి దారితీస్తాయన్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు మూడు మిలియన్ టన్నుల వైద్య వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందని, ఈ మొత్తం ఏటా ఎనిమిది శాతం పెరుగుతుందని ఒక అంచనా ఉందన్నారు. బయో మెడికల్ వ్యర్థాలలో కణజాలాలు, అవయవాలు, శరీర భాగాలు వంటి మానవ శరీర నిర్మాణ వ్యర్థాలు, వెటర్నరీ హాస్పిటల్స్ నుండి పరిశోధన సమయంలో ఉత్పత్తి చేయబడిన జంతు వ్యర్థాలు మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ వ్యర్థాలు, హైపోడెర్మిక్ సూదులు, సిరంజిలు, స్కాల్పెల్స్, విరిగిన గాజు వంటి వ్యర్థ పదార్ధాలు, విస్మరించిన మందులు, సైటోటాక్సిక్ మందులు డ్రస్సింగ్, బ్యాండేజీలు, ప్లాస్టర్ కాస్ట్‌లు, రక్తంతో కలుషితమైన పదార్థం, ట్యూబ్‌లు, కాథెటర్‌లు వంటి మురికి వ్యర్థాలు, ఏదైనా సోకిన ప్రాంతాల నుండి ద్రవ వ్యర్థాలు, భస్మీకరణ బూడిద, ఇతర రసాయన వ్యర్థాలు ఉంటాయన్నారు. సాధారణ జీవ-వైద్య వ్యర్థాలను శుద్ధి చేసే సదుపాయం అందుబాటులో లేని గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాల్లో మాత్రమే లోతైన ఖననం ద్వారా పారవేయడం అనుమతించబడుటుందన్నారు. బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో విభజన అనేది అత్యంత కీలకమైన దశ అన్నారు. బయో మెడికల్ వ్యర్ధాల దుష్ఫలితాలపై అన్ని వర్గాలలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, సరైన మార్గం ద్వారా నిర్వీర్యం చేయడానికి సూచించాలన్నారు.తొలుత బయో-మెడికల్ వ్యర్థాలు పై అవగాహన గోడ ప్రతిని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఏయస్పి ఏవి సుబ్బరాజు, పొల్యూషన్ కంట్రోలు బోర్డు ఇ ఇ కె.వెంకటేశ్వర రావు, జిల్లా పరిషత్ సీఈవో కెవియస్ఆర్ రవి కుమార్, సిపివో కె.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమ శాఖ అధికారి వి.ఆదిశేషు, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఏ.రామ స్వామి, డిఎంహెచ్ డి.మహేశ్వరరావు, పురపాలక సంఘం కమిషనర్లు యం శ్యామల, కె టి సుధాకర్, తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. పి సూర్యనారాయణ, హెల్త్ సూపర్వైజర్లు, హెడ్ నర్సులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img