Monday, October 28, 2024
Monday, October 28, 2024

ఎండ దెబ్బకు 550 మంది హజ్‌ యాత్రికులు మృతి

మక్కా: సౌదీ అరేబియాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. 52 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ నలుమూలల నుంచి హజ్‌ యాత్రకుగాను మక్కా చేరుకున్న 550 మంది అధిక ఉష్ణోగతలను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇద్దరు అరబ్‌ దౌత్యాధికారులు ప్రకటించారు. మృతుల్లో 323 మంది ఈజిప్టు పౌరులు, 60 మంది జోర్డాన్‌కు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. ఈజిప్టు పౌరుల్లో ఒక్కరు మాత్రమే తొక్కిసలాటలో గాయపడి మరణించగా మిగతా వారంతా ఎండ దెబ్బకు గురై మరణించినట్లు వెల్లడిరచారు. అల్‌ మువాసెమ్‌ ఆసుపత్రి శవగారం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మృతుల సంఖ్యను దౌత్యాధికారులు ధ్రువీకరించారు. అయితే వేర్వేరు దేశాల నుంచి వచ్చిన యాత్రికుల్లో 577 మంది ఎండ దెబ్బకు గురై మృతి చెందినట్లు మీడియా ప్రకటనలు పేర్కొనగా మృతుల సంఖ్య 550గా అధికారిక ప్రకటన పేర్కొంది. కాగా, మక్కాలో 51.8డిగ్రీల ఉష్ణోగత నమోదైనట్లు సౌదీ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదిలావుంటే హజ్‌ యాత్రలో భాగంగా గల్లంతైన తమ దేశ పౌరుల కోసం గాలిస్తున్నట్లు ఈజిప్టు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన చేసింది. సౌదీ అధికారులతో సమన్వయం చేసుకొని తమ వారి ఆచూకీని కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. తమ కుటుంబాలతో సంప్రదింపులు జరపలేకపోతున్న వారి సహాయార్థం 24 గంటలు పనిచేసే ఎమర్జెన్సీ రూమ్‌ను జెడ్డాలోని ఈజిప్టు కాన్సులేట్‌ ఏర్పాటు చేసింది. కాగా హజ్‌ కోసం 1.8 మిలియన్ల మంది యాత్రికులు వచ్చినట్లు సౌదీ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img