Monday, October 28, 2024
Monday, October 28, 2024

జైలు నుంచి అసాంజే విడుదల

వాషింగ్టన్‌: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే నేరం అంగీకరించారు. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోర్టులో సమర్పించిన పత్రాలు వెల్లడిరచాయి. దీంతో కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఆయన్ను బ్రిటన్‌ జైలు నుంచి మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఈ పరిణామంతో సుదీర్ఘంగా కొనసాగుతున్న రహస్య పత్రాల ప్రచురణ కేసు ఓ కొలిక్కి రానుంది. పశ్చిమ పసిఫిక్‌లోని యూఎస్‌ కామన్వెల్త్‌ మరియానా ఐలాండ్స్‌లోని ఫెడరల్‌ కోర్టులో అసాంజే హాజరుకానున్నట్లు పత్రాలు వెల్లడిరచాయి. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరారోపణలను అంగీకరించనున్నారని తెలిపాయి. దీన్ని న్యాయమూర్తి కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఏళ్లుగా కొనసాగుతున్న అమెరికా న్యాయపోరాటానికి ఓ పరిష్కారం లభిస్తుంది. అమెరికా సైన్యంలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించారని ప్రపంచవ్యాప్తంగా అసాంజేకు అప్పట్లో ఓ వర్గం మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్‌ చేశారని ఆరోపించింది. తద్వారా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశారని వాదించింది. నేరాంగీకారం, శిక్ష ఖరారు తర్వాత అసాంజే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. మరియానా ఐలాండ్స్‌లోని అతిపెద్ద ద్వీపమైన సైపన్‌లో అక్కడి కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆయన కోర్టులో హాజరుకానున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్లే విచారణను అక్కడ చేపడుతున్నారు. పైగా అమెరికా అధీనంలో ఉండే ఆ భూభాగం ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంటుంది. తాజా ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించటంతో పాటు అదనపు జైలు శిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img