Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

నిక్కీ హేలీ తొలి విజయం

వాషింగ్టన్‌: అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ ఎట్టకేలకు ప్రైమరీ ఎన్నికల్లో తొలి విజయం సాధించారు. ఆదివారం డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. దీంతో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుకు అడ్డుకట్ట పడినట్లయింది. అయితే, ఆయన్ను అధిగమించడానికి వచ్చే మంగళవారం జరగనున్న వివిధ ప్రైమరీల్లో కూడా హేలీ భారీ విజయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన తన సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలోనూ నిక్కీ ఓడిపోయారు. అయితే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడానికి నిరాకరించారు. ఓవైపు ట్రంప్‌ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ఆయనకు ప్రత్యామ్నాయం తానేనంటూ నిక్కీ ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలో డెమోక్రాట్ల ఆధిపత్యం ఎక్కువ. అక్కడ నమోదిత రిపబ్లికన్ల సంఖ్య 23,000 మాత్రమే. 2020లో అధ్యక్షుడు జో బైడెన్‌ తమ పార్టీ ప్రైమరీ ఎన్నికలో 92 శాతం ఓట్లు సాధించారు. కాగా రిపబ్లికన్‌ పార్టీ నుంచి ప్రైమరీ ఎన్నికల్లో గెలుపొందిన తొలి మహిళగా నిక్కీ హేలీ చరిత్ర సృష్టించారు. డెమొక్రటిక్‌, రిపబ్లికన్‌ రెండు పార్టీల్లో ప్రైమరీలలో గెలిచిన మొదటి భారతీయ- అమెరికన్‌ కూడా నిక్కీ రికార్డు నమోదు చేశారు. 2016లో బాబీ జిందాల్‌, 2020లో కమలా హ్యారిస్‌, 2024లో వివేక్‌ రామస్వామి ఈ ముగ్గురు ఒక్క ప్రైమరీ కూడా గెలవలేకపోయారు. ఇప్పటివరకు ట్రంప్‌ నెగ్గిన ప్రతినిధుల సంఖ్య 244కు చేరుకుంది.
హేలీ ఖాతాలో 24 మంది మాత్రమే ఉన్నారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవాలంటే 1,215 మంది ప్రతినిధులను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం 15 రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img