Friday, May 31, 2024
Friday, May 31, 2024

నారీ శక్తి జుమ్లానా!!

దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కానీ మహిళలకు టికెట్లు ఇచ్చే విషయంలో కమలం పార్టీ చొరవ చూపలేదు. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించింది. కానీ ఆ రిజర్వేషన్‌ను ప్రస్తుత ఎన్నికల్లో అమలు కానివ్వలేదు. తమ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కేవలం ఎనిమిది మంది మహిళలను నిలబెట్టింది. దీంతో ‘నారీశక్తి’ అన్నది మోదీ ప్రభుత్వ మరో జుమ్లాగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లో నారీశక్తి కానరాలేదు. బీజేపీ తరపున కేవలం ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నుంచి 11 మంది, కాంగ్రెస్‌ తరపున ఒకరు మాత్రమే లోక్‌సభ బరిలో నిలిచారు. యూపీలో మొత్తం 79 మందిని నిలబెట్టిన ఎన్డీయే కేవలం ఎనిమిది మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. ఇందులో బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్‌ (సోనేలాల్‌) అభ్యర్థి ఉన్నారు. 2014, 2019 ఎన్నికలప్పుడు ఎన్డీయే కూటమి తరపున 11 మంది పోటీ చేయగా, ఈసారి ఆ సంఖ్య ఎనిమిదికి పడిపోయింది. సిట్టింగ్‌ ఎంపీలు కేశ్వరి దేవి పటేల్‌ (ఫూల్‌పుర్‌), రీటా బహుగుణ జోషి (అలహాబాద్‌), సంఘమిత్ర మౌర్య (బదౌన్‌)తో పాటు రాంపూర్‌లో ఓడిపోయిన జయప్రదలను బీజేపీ పక్కకు పెట్టేసింది. వీరి స్థానంలో పురుషులకు టికెట్లు ఇచ్చింది. ఓ వివాదాస్పదమైన వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టడంతో బారాబంకీ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ ఉపేంద్ర రావత్‌ నిరాకరించారు. దీంతో ఆ స్థానంలో రాజ్‌రాణీ రావత్‌కు అవకాశం లభించింది. బీజేపీకి ప్రత్యర్థి, దాని కంటే 13 స్థానాలు తక్కువగా పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నుంచి 10 మంది, కాంగ్రెస్‌ నుంచి ఒకరు కలిపి ఇండియా కూటమి తరపున మొత్తం 11 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌పై ఘజియాబాద్‌ నుంచి డాలీ శర్మ రంగంలోకి దిగారు.
ఎస్పీ మహిళా అభ్యర్థులు…
సమాజ్‌వాదీ పార్టీ తరపున కైరానా నుంచి ఇక్రా హసన్‌ పోటీ చేస్తున్నారు. ఈమె మాజీ ఎంపీలు తబస్సుమ్‌ హసన్‌, చౌదరి మునవ్వర్‌ హసన్‌ కుమార్తె. అలాగే కేంద్ర మాజీ మంత్రి బేని ప్రసాద్‌ వర్మ మనుమరాలు శ్రేయా వర్మ (గోండా), పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డిరపుల్‌ యాదవ్‌ (మెయిర్‌పురి), మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే తుఫానీ సరోజ్‌ తనయ ప్రియా సరోజ్‌ (మఛిలీషెహర్‌), మాజీ ఎంపీ పర్మైలాల్‌ కోడలు, మాజీ ఎంపీ ఉషా వర్మ (హర్దోయి), మాజీ ఎమ్మెల్యే, దళిత నేత యోగేశ్‌ వర్మ భార్య, పూర్వ మేయర్‌ సునితా వర్మ (మీరట్‌), కార్పొరేట్‌లతో సత్సంబంధాలున్న అనూ టాండెన్‌ (ఉన్నావో), ప్రముఖ భోజ్‌పూరి నటి కాజల్‌ నిషాద్‌ (గోరఖ్‌పూర్‌), సమాజ్‌వాదీ పార్టీ ఓబీసీ విభాగాధ్యక్షుడు రాజ్‌పాల్‌ కశ్యప్‌ బంధువు జోత్య్న గోండ్‌ (షాజహాన్‌పూర్‌), మాజీ ఎమ్మెల్యే రుచీ వీరా (మొరాదాబాద్‌) పోటీ చేస్తున్నారు. ఘాజిపూర్‌ సిట్టింగ్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ కుమార్తె నుస్రత్‌ పోటీ చేసే అవకాశముండటంతో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగవచ్చు.
బీజేపీ అభ్యర్థులు…
బీజేపీ తరపున పోటీ చేస్తున్న మహిళలు కూడా రాజకీయ నేపథ్యంగల కుటుంబాల నుంచి వచ్చారు. బారాబంకీ నుంచి పోటీ చేస్తున్న రాజ్‌రాణి రావత్‌ జిల్లా పంచాయత్‌ అధ్యక్షురాలు కాగా మేనకా గాంధీ (సుల్తాన్‌పూర్‌) కేంద్ర మాజీమంత్రి. స్మృతీ ఇరానీ (అమేథి) కేంద్రమంత్రి, నీలం సోంకర్‌ (లాల్‌గంజ్‌) బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, రేఖా వర్మ (ధౌరాహా) బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, హేమా మాలిని (మథుర) ఎంపీ, బాలీవుడ్‌ నటి. సాధ్వీ నిరంజన్‌ జ్యోతి (ఫత్హేపూర్‌) కేంద్రమంత్రి, అనుప్రియా పటేల్‌ (మిర్జాపూర్‌)… అప్నాదళ్‌ (ఎస్‌) అభ్యర్థి. ఈమె కేంద్ర మంత్రి, కుర్మీ (ఓబీసీ) మాజీ నేత సేనేలాల్‌ పటేల్‌ కుమార్తె. ఇదిలావుంటే, 2014లో 13 మంది, 2019లో 11 మంది మహిళలు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img