Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

అబద్ధాల మోదీ

రా బావ ఏంటి పళ్లు కొరుకుతూ కోపంతో వస్తున్నావు. ఏముంది బీజేపీ నాటకాలు ఒక్కొక్కటి బైటపడుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నాడు మోది. మూడోసారి
ప్రధాని అయినాక ఒకే దేశం ఒకే మతం అంటాడు. నువు సహిస్తావా చెప్పు. నిజమే అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గుతుందట. కాని లక్షల కోట్లు ప్రజాధనం దోపిడీకి గురయితే అది కనపడదు. ఎన్నికలకు నిధులు ఇస్తే ఎంత దోపిడీదారులైనా పరవాలేదు. అది నిజమే మరి మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, దేశంలో ప్రజాస్వామ్యం కాపాడేది తానేనని మోది డబ్బా వాయించుకుంటాడు. మరి అయిదేళ్లు ప్రజోపయోగ పాలన చేయమని ఎన్నుకున్న తరువాత మూడేళ్లకో నాలుగేళ్లకో ఒకే దేశం, ఒకే ఎన్నికల పేరుతో ఎన్నికలు జరపటం అదేమి ప్రజాస్వామ్యం. అసలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రజా వ్యతిరేకపాలన సాగిస్తుంటే వెంటనే ఆ ప్రభుత్వాన్ని దించి ఎన్నికలు జరపడానికి వీలుగా రీకాల్‌ పవరు ఓటర్లకు ఉండాలని ప్రజలు కోరుతుంటే అందుకు విరుద్ధంగా ఐదేళ్లు ముగియకపోయినా ఎన్నికలు జరపడం ఎంతోటి ప్రజాస్వామ్యమో మోదీ చెప్పాలి. అంతేకాదు ప్రభుత్వరంగ సంస్థలన్నిటిని ప్రైవేటు పరంచేసి లక్షలాది మంది నిరుద్యోగులను చేస్తూ తనది ప్రజామోద ప్రభుత్వమంటూ అబద్ధాలు చెప్పడానికి మోదీ వెనుకాడడు. అంతెందుకు బావ నిన్న కాక మొన్న మూడు పార్టీలు కలిసి ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెసు, వైసీపీ కుటుంబపాలన చేసేయట. చంద్రబాబు మాత్రం ప్రజల కోసం ఏం పని చేస్తాడట. గతంలో మోదీని తిట్టని తిట్టు తిట్టకుండ తిట్టిన చంద్రబాబుకు ఇపుడు దైవదూతగా మోదీ కనపడుతున్నాడు. పాపం మోదీకి అయెధ్యలో బాలరాముడి ప్రతిష్ట సమయంలో రామావతారంలో కోటి రామారావులు కనిపించాడని చెప్పడం ఎంత అబద్ధమో ప్రజలకు తెలుసు. ఆ మాటతోనే ఆంధ్రుల మనసు పులకించి పోతుందనుకోవడం మోదీ తలంపు. కాని మాటల మాంత్రికుడని ఆంధ్రులకు బాగా తెలుసు. తిట్టిన నోటితోనే పొగడటం చంద్రబాబుకే చెల్లు. ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ఏం చేస్తాడో చెప్పకుండా వైసీపీని, కాంగ్రెసును తిట్టడంతో మోదీ సరిపెట్టాడు. ఒక పక్క జగన్‌ను బాహాటంగా విమర్శిస్తున్న షర్మిల కాంగ్రెస్‌ నేతగా సభలు నిర్వహిస్తుంటే వైసీపీ, కాంగ్రెసు ఒకటేనని మోదీ అంటే ఆంధ్రులు నమ్ముతారని అనుకుంటే అది మోదీ అవివేకం. అది సరె అసలు ఈ కూటమిలో నాయకులు ఒకర్ని ఒకరు నమ్మనిరీతిలో వ్యవహరిస్తున్నారు. అన్నింటి కంటే విశేషం కమ్యూనిస్టులకు ఓట్లు లేవనుకోవడం. కమ్యూనిస్టు పార్టీల కేడరు చెక్కు చెదరలేదు. ఇతర పార్టీల వలె ఎరచూపితే జెండా మార్చరని పాపం చంద్రబాబుకు, మోదీకి తెలియదేమో. అసలు ఆర్‌ఎస్‌ఎస్‌ను జోకొడుతూ ప్రజలకు అబద్ధాలు వల్లెవేస్తూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు మోదీ. అది సరె ఎన్నాళ్లు ఇలా మోసం చేయగలడు. భలేవాడివయ్యా ప్రజల్ని ప్రశ్నించకుండ, ఆలోచించకుండ నాయకులు చెప్పింది చేస్తున్నంతకాలం మోసగాళ్లకు కొదువ ఉండదు. కాని ఈ మధ్యే డబ్బు ఎరచూపినా ఓటు ఎవరికి వెయ్యచ్చో ప్రజలు ఆలోచిస్తున్నారు. అసలు ఈ మోసగాళ్లను పక్కన పెట్టాలంటే ప్రజల్ని వివేకవంతులుగా మార్చాలి. పల్లెల్లోకి వెళ్లే వాళ్ల జీవనవిధానం గమనించి వారి సమస్యలు తెలుసుకుని వాటి శాశ్వత పరిష్కారం ఎలాగో వారికి వివరించాలి. ఎటువంటి ప్రభుత్వం అవసరమో వారు గుర్తించేలా చేయాలి. ఏ పార్టీ డబ్బుతో ఎరచూపినా వారు అపుడే సరైన నిర్ణయం తీసుకోగలరు. అసలు అభివృద్ధి అంటే డబ్బు పంచడం కాదని స్వయం ఉపాధితో తమ బతుకు తాము బతకడం అని తెలుసుకుంటారు.
సామాన్యుని జీవన ప్రమాణం పెరగడమే సరైన అభివృద్ధి. స్వయం ఉపాధితో మనగలడంతోనే అభివృద్ధి సాధ్యమని గ్రహించాలి. అంతేగాని కేవలం నున్నటి రోడ్లువేసి ఫ్లైఓవర్లు నిర్మించి యిదే అభివృద్ధి అంటే కడుపు కాలేవాడు ఎలా ఒప్పుకుంటాడు. నిజమే బావ రాష్ట్రం విడగొట్టి కట్టుబట్టలతో పంపారని జోలిపట్టిన చంద్రబాబు ప్రభుత్వ స్థలాలలో కాకుండా కోట్లు పెట్టి వేల ఎకరాలు కొని ప్రపంచంలో ఎక్కడాలేని రాజధాని నిర్మిస్తామని అదే అభివృద్ధి అంటే కడుపు కాలేవాడు ఒప్పుకుంటాడా? నిజమే సామాన్యుల సమస్యల పరిష్కారం అభివృద్ధికాని, బాబు అన్నట్లు రోడ్లు, ఫ్లైఓవర్లు, అధునాతన రాజధాని మాత్రమే అభివృద్ధికాదు. ఇప్పటికైనా సామాన్యుల సమస్యల పరిష్కారం వైపు దృష్టి సారించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img