Friday, May 31, 2024
Friday, May 31, 2024

ఆదర్శ ప్రజానేత సెల్వరాజ్‌

మోదుమూడి మురళీకృష్ణ
కుల, మత, వర్గ దురాగతాలకు వ్యతిరేకంగా, గ్రామీణ పేదలకు భూమి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తమిళనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, లోక్‌సభ సభ్యులు మునియన్‌ సెల్వరాజ్‌ అవిశ్రాంత కృషి సల్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాల్లో ఎప్పుడూ ముందే ఉండేవారు. ఆదర్శవంతమైన ప్రజానాయకుడు. సీపీఐ ప్రముఖ నాయకుడు అయిన సెల్వరాజ్‌ అనుభవజ్ఞుడు, అంకితభావం కలిగిన ప్రజా సేవకుడు మాత్రమే కాదు, రైతు, సామాజిక కార్యకర్త కూడా. ఆయన నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికై ప్రజాసమస్యల పరిష్కా రానికి తనదైన శైలిలో కృషి చేశారు. దశాబ్దాలుగా రాజకీయ రంగంలో తన ఉనికిని చాటుకున్నారు. నాలుగు సార్లు లోక్‌ సభకు ఎన్నికైనా ఆయన ప్రజాభిమానంలో కోటీశ్వరుడు, సం పదలో పేదవాడే. ఎంపీగా వచ్చే పెన్షన్‌, వారసత్వంగా వచ్చిన కొంత వ్యవసాయ భూమే ఆయన ఆస్తి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రజా సేవ పట్ల ఆయన నిబద్ధత ఏమాత్రం సడలలేదు. అచంచలంగా ఉంది, సహచరులు, నియోజకవర్గ ప్రజలలో అపారమైన గౌరవం, ప్రశంసలను పొందారు.
1975లో సీపీఐలో చేరిన సెల్వరాజ్‌ దాదాపు అర్ధశతాబ్దం పాటు సోషలిస్టు ఉద్యమానికి అంకితమై సమసమాజ స్థాపన కోసం పనిచేశారు. తమిళనాడులోని నాగపట్నం నియోజకవర్గం నుంచి ఆయన లోక్‌సభకు నాలుగు దఫాలు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సెల్వరాజ్‌ ఆస్తి ప్రజాభిమానమే. 67 ఏళ్ల సెల్వరాజ్‌ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచారు. తిరువారూరు జిల్లా చిట్టమల్లికి చెందిన సెల్వరాజుకు గత జనవరిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సోకింది. వెంటనే తిరువారూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించి తదుపరి చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందారు. ఆయన మృతితో కమ్యూనిస్టు ఉద్యమం ఒక అంకితభావం కలిగిన నాయకుడిని కోల్పోయింది. తమిళనాడు రాష్ట్ర ప్రజలు పిలిస్తే పలికే, నిబద్ధత కలిగిన నేతను కోల్పోయారు. 50 సంవత్సరాల క్రితం నాగపట్నంలోని వెన్మనై గ్రామంలో స్థానిక భూస్వాములు 29 మంది మహిళలు, పిల్లలతో సహా 44 మంది వ్యవసాయ కూలీలను (ఎక్కువగా దళితులు) గుడిసెలో బంధించి తగులబెట్టిన దారుణ ఘటనను సెల్వరాజ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. బాధితులకు సీపీఐ, సీపీఎం అండగా నిలిచాయి. ఈ పోరాటంతో పాటు గ్రామాల్లో వ్యవసాయ వేత నాలు, భూ పంపిణీకి జరిగిన మహత్తర పోరాటాలకు సెల్వరాజ్‌ నాయకత్వం వహించారు. చాలా ప్రబలంగా ఉన్న అంటరాని తనం, దళితుల ఆలయ ప్రవేశంపై నిషేధానికి వ్యతిరేకంగా సెల్వరాజ్‌ అలుపెరగని పోరాటం సల్పారు. కావేరి డెల్టా బ్లాక్‌ ప్రజల సమస్యలపై పోరాడి, కావేరిపై మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏర్పాటుకు 110 కిలోమీటర్ల మానవహారం నిర్వహించడంలో సెల్వరాజ్‌ పాత్ర ఎనలేనిది.
ప్రస్తుతం తిరువారూర్‌ జిల్లా పరిధిలోని నీడమంగళం టౌన్‌ పంచాయతీ కప్పలుదయాన్‌ గ్రామంలో 1957లో జన్మించిన సెల్వరాజ్‌ చిన్నతనంలోనే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. విద్యార్థి, యువజన సంఘాలైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌)లో అనేక కీలక పదవులు నిర్వహించారు. సీపీఐ నీడమంగళం శాఖ కమిటీ సభ్యునిగా ప్రారంభమైన సీపీఐలో సెల్వరాజ్‌ ప్రస్తానం నాగపట్నం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, జాతీయ సమితి సభ్యుని స్థాయికి చేరింది. సెల్వరాజ్‌ మొట్ట మొదటగా 1989లో నాగపట్నం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996, 1998, 2019లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధికి చేసిన విశేష కృషి చిరస్మరణీయం. డెల్టా ప్రాంత ప్రజల హక్కుల కోసం, రైతుల కోసం సమస్యల పరిష్కారానికి ఎంపీగా అనేక నిరసనలు చేపట్టారు.అనేక కొత్త రైల్వే ప్రాజెక్టులను సాధించడంలో పార్లమెంట్‌ సభ్యునిగా కీలక పాత్ర పోషించారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించారు. గ్రామీణ ప్రజలలో ప్రజా సమస్యలు, నైతిక విలువలపై అవగాహన కల్పిస్తూ, పోరాట స్పూర్తిని నింపారు. నిరక్షరాస్యత నిర్మూలనకు, అక్షరాస్యత పెంపుదలకు కృషి చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరించేలా అవగాహన కల్పించారు. పార్లమెంట్‌ సభ్యునిగా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యునిగా, రసాయనాలు, ఎరువులపై స్థాయీ సంఘం సభ్యునిగా పనిచేశారు. పార్లమెంట్‌ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. వివిధ అంశాలపై చర్చల్లో పాల్గొనే వారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న కావేరి నీటి అంశం పరిష్కారానికి తన వంతు కృషి చేశారు. ఈ ప్రాంత రాజకీయ, సామాజిక నిర్మాణంపై సెల్వరాజ్‌ చెరగని ప్రభావాన్ని చూపారు. అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ఆయన పోటీచేయలేదు. సెలర్వాజ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో సెల్వరాజ్‌ది ఎనలేని పాత్రగా ప్రశంసించారు. సీపీఐ జాతీయ, రాష్ట్ర సమితి, రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు సెల్వరాజ్‌ మృతికి కమ్యూనిస్టు ఉద్యమానికి, పేదల పోరాటానికి తీరని లోటుగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img