Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

ఎవరి కళ్ల జోళ్లు వారివి

ఆర్వీ రామారావ్‌

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తరవాత ఆయనకు వివిధ ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని ఖండిరచాయి. 2011లో అన్నా హజారే నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఆయనతో ఉద్యమంలో పాల్గొన్న వారిలో అతి కొద్దిమంది మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. కొంతమంది తమ మునుపటి వృత్తుల్లోకి వెళ్లి పోయారు. కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేయడం ఆయన సహచరుల్లో కొందరికి నచ్చలేదు. కొందరు కొద్ది కాలం ఆయనతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం స్వరాజ్‌ పార్టీ నాయకుడిగా ఉన్న యోగేంద్ర యాదవ్‌ లాంటి వారు తమకు తోచిన రీతిలో రాజకీయ కార్యకలాపాల్లో ఉంటే అశుతోష్‌ లాంటి వారు రాజకీయాలకు దూరంగా తమ వృత్తిలో నిమగ్నులై పోయారు.
అన్నింటికన్నా విచిత్రమైంది ఏమిటంటే 2011 నాటికి ఉద్యమానికి కేంద్ర స్థానంలో ఉన్న అన్నా హజారే ఉద్యమం చల్లారిన తరవాత ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్న వారిలో రెండు రకాల వారు కనిపిస్తారు. ఒక రకం మన:స్ఫూర్తిగా అవినీతిని అంతం చేయాలనుకునే వారు. ఆ పోరాటానికి ఉన్న పరిమితులను, విస్తారంగా ఉన్న అననుకూల పరిస్థితులను వారు గ్రహించారు. ఈ కోవకు చెందిన వారే రాజకీయాలు కొనసాగించడమో, లేదా సామాజిక కార్యకర్తలుగా మిగిలిపోయారు. రెండవ రకం వారి పరమ లక్ష్యం అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దె దింపడమే. అవినీతి వ్యతిరేకత ముసుగులో వీరు బీజేపీకి బంట్లుగా పని చేశారు. ఉద్యమ నాయకుడు అన్నా హజారేనే దీనికి పెద్ద ఉదాహరణ. కాంగ్రెస్‌ను గద్దె దించే లక్ష్యం పూర్తి అయిన తరవాత వీరు తెరమరుగై పోయారు. కాంగ్రెస్‌ను గద్దె దించేస్తే అవినీతి అంతమైపోతుందని వీరు అనుకున్నట్టున్నారు.
ఈ ఉద్యమం రెండు పరిణామాలకు దారి తీసింది. ఒకటి: కేజ్రీవాల్‌ లాంటి వారు రాజకీయపార్టీ ఏర్పాటుచేసి మొదట దిల్లీలో, తరవాత పంజాబ్‌లో అధికారంలోకి వచ్చారు. రెండు: అవినీతి వ్యతిరేక పోరాట యోధులు ఇష్ట పూర్వకంగానే మాయమయ్యారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత చెలరేగిన అవినీతి గురించి అన్నా హజారే, మాజీ న్యాయమూర్తి సంతోష్‌ హెగ్డే పెదవి విప్పిన సందర్భమే కనిపించలేదు. మోదీ ఏలుబడిలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం మాట అటుంచి కనీసం అవినీతి ఉందని, అది జడలు విప్పి నాట్యం చేస్తున్న వాస్తవాన్ని వారు గుర్తించడానికి నిరాకరించారు.
కేజ్రీవాల్‌ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం అన్నా హజారే లాంటి వారికి ఎప్పుడూ నచ్చలేదు. ఈ పోరాటానికి రాజకీయ వేదిక అవసరమని వీరు భావించినట్టు లేదు. రాజకీయాలపై భయంకరమైన ప్రభావం చూపించే అవినీతి మీద పోరాటం రాజకీయ పార్టీలకు అతీతంగా ఎలా సాధ్యమో వీరెన్నడూ వివరించిన పాపాన పోలేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసినందువల్ల కేజ్రీవాల్‌ 2015 నుంచి దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ అన్నా హజారే ఉద్యమం వల్ల అపారమైన లబ్ధి పొందింది బీజేపీ, దానికి తిరుగులేని నాయకుడిగా తయారైన నరేంద్ర మోదీ మాత్రమే.
అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తెరచాటు నుంచి సంఫ్‌ు పరివార్‌ మద్దతు ఇచ్చి అన్నా హజారేను సంఫ్‌ు పరివార్‌ అప్పనంగా వాడుకుంది. హజారే జన జీవన రంగం నుంచే దూరమయ్యారు. న్యాయమూర్తి సంతోష్‌ హెగ్డే పరిస్థితీ అదే. కేజ్రీవాల్‌ అరెస్టు తరవాత అన్నా హజారే హఠాత్తుగా ప్రత్యక్షమై కేజ్రీవాల్‌ మీద విమర్శలు గుప్పించారు. మద్యం జోలికి వెళ్లొద్దు, మద్యం లాగే అధికారం కూడా మత్తెక్కిస్తుంది అని హజారే అంటున్నారు. మరింత డబ్బు సమకూర్చుకోవడం కోసం కేజ్రీవాల్‌ మద్యం విధానం రూపొందించారని హజారే అంటున్నారు. ఈ వివాదం దాదాపు రెండేళ్ల నుంచి వినిపిస్తున్నా హజారే నోట ఒక్క మాటా రాలేదు. సంతోష్‌ హెగ్డే అదే రీతిలో మాట్లాడారు. ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్ర యాదవ్‌, అశుతోష్‌, అశీశ్‌ ఖైతాన్‌ మాత్రం కేజ్రీవాల్‌ అరెస్టును ఖండిరచారు. వీరంతా ఇంతకు మునుపు కేజ్రీకి సన్నిహితులే. ‘‘నేను అనేక విషయాల్లో కేజ్రీవాల్‌తో ఏకీభవించను. నేను ఆమ్‌ ఆద్మీ పార్టీ సమర్థకుడినీ కాదు. కానీ ఆయనను అరెస్టు చేసిన తీరు హాస్యాస్పదం’’ అని యోగేంద్ర యాదవ్‌ అన్నారు. 2015లోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ క్రమశిక్షణా సంఘం యోగేంద్ర యాదవ్‌ను పార్టీ నుంచి తొలగించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అవినీతిని అంతమొందించడం కాదు, ప్రతిపక్షాలను అణచడమే అసలు లక్ష్యం అని కూడా యాదవ్‌ అన్నారు. మద్యం విధానంలో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే చట్టం ప్రకారం శిక్షించాలని కూడా ఆయన అన్నారు.
ప్రశాంత్‌ భూషణ్‌ మరో అడుగు ముందుకేసి ‘‘కేజ్రీవాల్‌ కు వ్యతిరేకంగా చిన్న సాక్ష్యం కూడా లేదు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క పత్రమైనా లేదు’’ అన్నారు. ప్రస్తుతం సత్య హిందీ డాట్‌ కాం నడుపుతున్న అశుతోష్‌ ఒకప్పుడు కేజ్రీకి సన్నిహితుడు. 2014లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున దిల్లీలోని చాందినీ చౌక్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. కేజ్రీవాల్‌ ను అరెస్టుచేసి మోదీ నాయకత్వంలోని బీజేపీ పెద్ద సాహసం చేసిందని అశుతోష్‌ అంటారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్య సీట్ల విషయంలో అవగాహన కుదరడంతో బీజేెపీ వెన్నులో వణుకు పుట్టిందని అశుతోష్‌ భావిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న కపిల్‌ మిశ్రా ఒకప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేనే. ఖరావల్‌ నగర్‌ నుంచి 2015లో ఆయన దిల్లీ శాసన సభకు ఎన్నికయ్యారు. కేజ్రీ మంత్రివర్గంలో ఉండేవారు. 2017లో ఆయనను ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి తొలగిస్తే బీజేపీలో చేరారు. 2017లో ఆయనను శాసన సభ్యుడిగా అనర్హుడిని చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ దిల్లీ విభాగం ఉపాధ్యక్షుడు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో మతకలహాలు జరగడానికి ముందు విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఇలాంటి వారు సహజంగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తున్నారు. కేజ్రీవాల్‌తో ఇంతకు ముందు కలిసి పనిచేసిన వారిలో కొందరికి ఆయన అరెస్టు సంతోషం కలిగిస్తే మరి కొంతమంది ఆయనను సమర్థించడం లేదు కానీ కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరిని ఖండిస్తున్నారు. ఈ గందరగోళంలో అవినీతి వ్యతిరేక పోరాటం అదృశ్యమై పోయింది. ఎవరి కళ్లాద్దాలలోంచి వారు కేజ్రీవాల్‌ వ్యవహారాన్ని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img