Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

కిట కిట తలుపులు

చింతపట్ల సుదర్శన్‌

పొద్దుట్నించీ ‘డ్యూటీ’ చేసి అలసిపోయిన సూర్యుడు ఆకాశపు అంచున ఉన్న టమాటా రంగు గేట్‌ తెరుచుకుని లోపలికి పోబోతున్నాడు. బతికాం జీవులం ఎండ తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న డాంకీకి అరుగు ఎక్కుతున్న డాగీ కనపడిరది. ఎండలో తిరగడమెందుకు ‘సన్‌స్ట్రోక్‌’ తెచ్చుకోవడం ఎందుకు అంది డాంకీ. నీ కేంటి బ్రో బజార్లో ఎక్కడ చూసినా పారేసిన పేపర్లు, కరపత్రాలు, చిరిగిన పోస్టర్లు ఇలా వెళ్లి అలా మింగి వచ్చేస్తావు. నాది కుక్క బతుకు కదా అన్ని వీధులూ తిరగాలి. మటన్‌, చికెన్‌షాపుల ముందు గంటలు గంటలు బీటు వెయ్యాలి. దొరికింది తిని రావడానికి ఇంత టైము పడుతుంది మరి అంది డాగీ గోడకు ఆనుకుని కూచుంటూ. నిజమే ‘బ్రో’ పొట్ట తిప్పలు, టెకెట్టు తిప్పలు, పదవి తిప్పలు నానారకాల జీవులకు నానా రకాల తిప్పలు తప్పవుకదా! అప్పట్నించీ నీ కోసమే ‘వెయిట్‌’ చేస్తున్నానోయ్‌! ఓ ‘క్వశ్చిన్‌’ అడగాలని అంది డాంకీ. క్వశ్చిన్‌ అంటే, ప్రశ్న బాబోయ్‌ అసలే ప్రశ్నలమీద ‘ప్రశ్నల సీజన్‌’ ఇది. ఈడీవారు, సీబీఐ వారు ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్నారు కదా! నీ కెందుకొచ్చిన ప్రశ్న చెప్పు ఇప్పుడు. అలాగనకు బ్రదర్‌. సందేహం వచ్చినప్పుడు తీర్చుకోవాలి కదా అంది డాంకీ. సరే వొద్దన్నా వొదిలే గాడిదవు కాదు గదా కానీ! మరేంలేదు. అడిగిందే అడిగి అడిగిందానికి తెలీదు! ఏమో! నాకే మెరుక! అని అనిపించుకోనూ ఒకే ఒక ప్రశ్న అంది డాంకీ. ‘సరే ప్రొసీడ్‌’ అంది డాగీ. ఏంలేదు నా మీద నీ అభిప్రాయం ఏమిటి? అంది డాంకీ విలాసంగా, ఖుషీగా, హుషారుగా తోక ఊపుతూ. డాగీ ఉలిక్కిపడిరది. ఇదేం ప్రశ్న అని చిరాకుపడబోయి, తమాయించ ుకుంది. నీమీద నా అభిప్రాయమా? సదభిప్రాయమే. నాలుగు కాళ్ల వాడివైనా రెండు కాళ్ల వాడికి ఉండాల్సిన తెలివితేటలు న్నాయి. పైగా పైవాడి అనుగ్రహం వల్ల మనిషిలా మాట్లాడగల్గుతున్నావు. కరంట్‌అఫయిర్స్‌ గురించి బాగా తెల్సినవాడివి. ‘దక్షిణపు గుంపు’ అనగానేమిటో సారా కుంభకోణమేమిటో, ఎవరికోసం ఎవరు ఎవరిని దర్యాప్తు చేస్తున్నారో, సోదాలు, తనిఖీలు, కస్టడీలు ఒకటా రెండా అన్ని విషయాలూ తెల్సినవాడివి నువ్వు మామూలు గాడిదవి కాదు మనిషి లాంటి గాడిదవి అంది డాగీ.
ఆ మాటన్నావు థాంక్స్‌ ‘బ్రో’. మనిషిలాంటి గాడిదవైనప్పుడు గాడిదల్లాంటి మనుషులు చేసే పని నేను కూడా ఎందుకు చెయ్యగూడదో చెప్పు. మనిషిలాంటి గాడిదవైన నువ్వు గాడిదల్లాంటి మనుషులుచేసే పని చేస్తానంటావా? ఏమిటబ్బా అది! ‘మైండ్‌’లో ‘బల్బు’ వెలగడంలేదు అంది డాగీ. ఇంతదూరం వచ్చాక ఇంకా మూసిపెట్టనులే. ‘మేక్‌ హౌ వైల్‌ ది సన్‌షైన్స్‌’ అని ఇంగ్లీషుల్లో ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో’ అని తెలుగులోనూ అన్నారు కదా. ఆ పనే ఇప్పుడు మన పూజ్య మాజీలు, కాబోయే ఖతర్నాక్‌లూ చేస్తున్నారు కదా. నేను కూడా ‘జంపు’ చెయ్య గలను కదా అందుకని, అందువల్ల, అందుకోసం. అర్థమైంది మై డియర్‌ డాంకీ బ్రదర్‌ ప్రజాస్వామ్యం నిర్వచనాన్ని ఇంకోరకంగా చెప్పకు. నువ్వు ‘జంపింగ్‌’ అనగానే అర్థం అయింది. త్రాసులో కప్పల్ని తూయగలడా ఎవడైనా. కప్పగంతులు అలవాటైన కప్పలు గెంతకుండా ఉండలేవు అలాగే ఏ పార్టీలో ఉంటే, ప్రజల సొమ్ముకు కన్నం వెయ్యగలిగే అవకాశం వస్తుందో ఆ పార్టీలోకే గెంతుతారు ఎవరైనా. పైగా పాత కసులు మోపుళ్లకొద్దీ ఉన్నవాళ్ల కోసం, అవినీతి మంత్రులని పాపు లర్‌ అయిన వాళ్లకోసం, కోట్లతో ఓట్లు కొనగలిగిన భాగ్యవంతుల కోసం అన్ని పార్టీల వాళ్లు గేట్లు ఎత్తేశారు. లారీల కొద్దీ కండువాలు, పూలగుత్తులు రెడీ చేసి ఉంచారు. నీకు కండువా కప్పుకోవాలని ఉందా ఏం అంది డాగీ. అందుకే గదా నీ చేత మనిషిలాంటి గాడిదననిపించు కున్నాను. ఏం నాకేం తక్కువ? కొంచెం నాసిరకంగా ఉందే అనుకో. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే కదా. గాడిదనైన నన్ను గుర్రంగా మార్చ లేరా! ఆ మాటకువస్తే ‘గెలుపు గుర్రాలని’ ముద్దుగా పిలిపించుకుంటున్న మనుషుల్లో గాడిదలెన్ని లేవు అంది డాంకీ. నీ ఆర్గుమెంట్లకి ఎదురే ఉండదన్నా. నువ్వు కోర్టులో ఉంటే నిందితులకు ఈ జన్మలో ‘బెయిల్‌’ రానే రాదు. సరే! ఇంతకీ ఏ పార్టీలోకి జంపవుదామనుకుంటున్నావు! ఎందులోకో ఎందుకు, ఇప్పుడు గెలిచి తీరుతామంటున్నారే, ‘నాలుగు శతకాలు’ మావేనని ఢంకా బజాయిస్తూ తాళాలు మోగిస్తున్నారే ఆ పార్టీలోకే. బురదలో కాలుపెట్టలేనివాడు పేడలో, పేడలో కాలుపెట్టలేని వాడు ఇంకెక్కడో కాలుపెట్టే సందుకోసం నానా హైరానా పడ్తున్నారు. నువ్వు వెళ్దామనుకుంటున్న పార్టీకి నీతిమంతుల పార్టీ అని పేరుంది మరి అంది డాగీ. పేరుకేమిలెద్దూ ఎవరికి వారు పతివ్రతలే, చేసేది వేరే అయినా చెప్పేవి ‘శ్రీరంగ నీతులే’ అయినా ఆ పార్టీలో చేరేవారందరినీ ‘నిర్మా వాషింగ్‌’ పౌడర్‌తో ‘రాకి’ శుభ్రం చేస్తున్నార్ట గదా. నన్నూ శుభ్రం చేసుకుంటారు తమలో కలుపుకుంటారుపైగా నా వల్ల బోలెడు ‘పబ్లిసిటీ’ కూడా. రాముడెంతటి ఘనుడో కృష్ణుడు అంతేగా. కంసుడి చెరసాల నుంచి బాలకృష్ణుడ్ని తప్పించే పనిలో భాగస్వామికాదా మా ముత్తాత తాత అంది డాంకీ. అప్పుడొచ్చాడు అబ్బాయి. అరుగుఎక్కి తన జాగాలో కూచుంటూ తాతలదాకా వెళ్లిపోయేరా అప్పుడే అన్నాడు నవ్వుతూ. ఏది ఏమైనప్పటికీ సొంత ఊరినీ, సొంత పార్టీని, సొంత తాత ముత్తాతల్నీ ఎలా మరచి పోగలం అంది డాంకీ. అవునవును అవసరానికి ఏ గూట్లోది ‘గుటుక్కు’ మనిపించినా సొంత గూటి మీద అధికారం ఎక్కడికీపోదు. ఎప్పుడవసరం అయితే అప్పుడు ఆ గూటికి రావచ్చు పోవచ్చు అంది డాగీ. అక్షరసత్యం మాట్లాడేవు! ఇప్పుడో అక్రమ మైనింగ్‌ కింగ్‌ ఆ మాటే అన్నాడు. ఎన్ని తిరుగుళ్లు తిరిగినా రక్తం మాత్రం అదే కదా. నా రక్తమే ఆ పార్టీ, ఆ పార్టీ ఏ నా ‘బ్లడ్‌గ్రూపు’ అంటే కాదనేవాడెవడు అన్నాడబ్బాయి. నువ్వు చెప్పన్నా మన డాంకీకి పాలిటిక్స్‌ అవసరమా! అనవసరంగా తల దూరుస్తానంటుంది అంది డాగీ. అదా విషయం. బుద్ధి ఉన్న ఏ గాడిదా బుద్ధిలేని గాడిదల గుంపులోకి జొరబడకూడదు. నువ్వు ఆ ఆలోచన మానుకోవడం మంచింది అన్నాడు అబ్బాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img