Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

గెలుస్తున్నాం… బతకడం లేదు గురువుగారూ…


అతను భూమి గుండ్రంగా లేదని, అందుకే బతుకులు అస్తవ్యస్తంగా ఉన్నాయని కనుగొన్న శాస్త్రవేత్త. అతను జర్నలిస్టులు పెంపుడు జంతువులుగా మారతారని మూడున్నర దశాబ్దాల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు. ఇప్పుడంటే వృక్ష సంపదతో మీ అందం రెట్టింపు అవుతుందని ఊదరగొడుతున్నారు కాని మూడు దశాబ్దాల క్రితమే తన ఆయుర్వేద విద్యతో హెర్బల్‌ సబ్బులకు నాందీ వాచకం పలికిన డాక్టర్‌. అతను మెదడులో పెన్నులతో పుట్టిన వాడు.
జానా బెత్తెడు గాలివాన మొక్కలు మహా సౌష్టవంగా కనిపించాయన్న రహస్యాన్ని విప్పినవాడు… డాబాల కొత్తవలస డాబా గదిలో రా.వి.శాస్త్రిని చదివి ఎంత గొప్పగా రాశాడు అని మురిసిపోయిన వాడు. విశాఖ ఆంధ్రా యూనివర్సీటీ లైబ్రరీ ఒక్కో అరలోంచి చేతిలోకి తీసుకున్న పుస్తకాలు చదువుతూ తండ్రులారా ఎంత గొప్పగా రాశారయ్యా అని ఆ రచయితలకు కన్నీళ్లతో కాళ్లు కడిగిన వాడు. బైబిల్‌ పదో ప్రకటన ఒకటో వాక్యంలో అన్నట్లుగా అతను మేఘమును ధరించిన వాడు. అలా ధరించిన మేఘం నుంచి చినుకు చినుకుగా సాహిత్యం పేరుతో జీవితాలను చూపించిన వాడు. గెలుపు సరేనర్రా… బతకడం ఎలా అని నిలదీసిన వాడు.
అతడే.. ఆ ఒక్కడే మహా రచయిత కే.ఎన్‌.వై. పతంజలి. వారి జ్ఞానం కంటే ఎదుటి వాడి అజ్ఞానమే అంబానీలకు, ఆదానీలకు పెట్టుబడి అని అదేదో సామెత చెప్పినంత సులువుగా చెప్పింది పతంజలి మాత్రమే. అనేకానేక సీతాకొకచిలుకలు తమ రెక్కలపై రాసుకున్న దెయ్యం ఆత్మకథలను ఒక్కొక్కటిగా రేకలు విచ్చుకున్నట్లుగా విప్పినవాడు. దెయ్యాలను కూడా అమ్మేసే పుస్తక వ్యాపారులకు కేరాఫ్‌ అడ్రస్‌ విజయవాడ ఏలూరు రోడ్డేనని స్టాంపు వేసి మరీ చెప్పిన వాడు ఈ ఒక్క పతంజలే. ఆకలేసినప్పుడు బోయినమే ముఖ్యం తప్ప విశ్వాసం కాదని అత్యంత ఎక్కువ విశ్వాసముందని భావించే జీవి వీర బొబ్బిలితో నర మానవుడికి చెప్పించిన వాడు. ఈ ఒక్క వాక్యంలోనే బాబోరే నీ విశ్వాసం నీకు కూడు పెట్టదురా నాయనా అని హితవాక్యం పలికిందీ ఈ పతంజలే. రెండు చెవుల మధ్య ఏమీలేని మానవుల మధ్య తిరుగుతూ ‘‘ దెష్టోయ్‌.. దయిద్రవోయ్‌’’ అని విసుక్కున్న వాడు కూడా ఈ పతంజలే.
పాత్రలను సృష్టించి లోకం మీదకి విసిరేయకుండా ఆ పాత్రలని ప్రతి మనిషి స్వభావంలోనూ చూపించిన సాహిత్య బ్రహ్మ పతంజలి రాజుగోరే. బహుశా, గురజాడ, పెద్ద గురువుగారు రా.వి.శాస్త్రి తర్వాత వారు సృష్టించిన పాత్రలను వారి వెంటే తిప్పుకున్నది పతంజలే అనిపించింది ఆయనతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన నాకు. తనకు తెలిసీ తెలియని వైద్యాన్ని అందించేసి ఆనక ఆ మనిషి ప్రాణం మీదకి వచ్చిన తర్వాత ఆదరాబాదరాగా కార్పొరేట్‌ ఆసుపత్రులకు తరలించే ఆర్‌ఎంపీ డాక్టర్లను ఇప్పుడు ప్రతి పల్లెలోనూ చూస్తున్నాం కదా…! కాని ఉప్పలపాటి ఫకీర్రాజు అనబడే ఓ ఆయుర్వేద ఆర్‌ఎంపీ చేత ‘‘నాయనా వైద్యుడిగా చెలామణీ కావడానికి వైద్యమే రానక్కరలేదు. మనం వైద్యం చేస్తే జబ్బులు పూర్తిగా తగ్గిపోకూడదు. అలాగని మనుషులు కూడా పోకూడదు’’ అంటూ భవిష్యత్‌ వైద్యోపనిషత్‌ని మూడున్నర దశాబ్దాల క్రితమే చెప్పిన వాడూ ఈ క్రాంతిదర్శి పతంజలే. అప్పన్న సర్దార్‌ గవర్నర్‌ని కలిసి రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం అన్న ఆనందంలో భార్యకు ఫోన్‌ చేసి ‘‘ఏమే రేపటి నుంచి నువ్వు ముఖ్యమంత్రి పెళ్లానివి’’ అని చెప్పినప్పుడు అవతలి నుంచి ఆ అమాయకురాలు ‘‘ ఛీ.. బాగోదండీ ‘‘ అంటూ చెప్పిన సమాధానంలో ఎటకారంతో పాటు ఏనాటి రాజకీయాలకైనా సరిగ్గా తగిలిన బాణమే ఉందనిపిస్తుంది కదా…! ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన బంధువుని కట్టేసి, తన్ని మరీ మర్యాదలు చేసిన రాజుల లోగిళ్లని అంతకు మునుపు కానీ, ఆ తర్వాత కానీ మనకి ఎవరైనా చెప్పారా పతంజలి వినా… అగ్రరాజ్యం అధిపతి బుష్‌గారు చెపినట్లుగానే పాకిస్థాన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇస్తామన్న అటల్‌ బీహారీ వాజ్‌పేయ్‌ని అమెరికా పెద్ద పాలేరుగా కీర్తించింది ఈ ధైర్యశాలి పతంజలే. ఇలాంటి అనేకానేక సంఘటనలకు మనల్నే బాధ్యుల్ని చేస్తూ నీకెటూ ఆత్మగౌరవం లేదని తేల్చేసిన వాడు ఒకే ఒక్క పతంజలి మాత్రమే. వారసత్వ రాజకీయాలతో ప్రజలకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తూనే దొప్పలపూడి సన్యాసినాయుడి గారి మూడో కొడుకు ఎంతో ఎన్టీ రామారావు గారి కుమారుడు కూడా మనకి అంతే అని ఈసడిరచుకున్న ఏకైక తెగువ ఉన్న జర్నలిస్టు ఈ ఇలాతలంలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే నే చెప్పే పేరు కే.ఎన్‌.వై. పతంజలి. ఎవడి బతుకులు వాడు బతకడం లేదని, పరాయి బతుకుల దారిలో నడుస్తున్నామని గుర్తు చేసిన వాడు. జీవించమంటే గెలవడం కాదని, గెలుపు కోసం పరుగులు తీస్తూ జీవితాన్ని కోల్పోతున్నామని ఎరుక కలిగించేందుకు ప్రయత్నించిన వాడు కూడా ఈ పతంజలే. ఆయన ఎన్ని చెప్పినా…. మనం ఇంకా గెలుపు కోసం తపిస్తూ పరుగులు తీస్తున్నామని, బతకడం లేదని, ఐదేళ్లకోసారి చూపుడు వేలుని మార్కెట్‌లో పెట్టడం వదల్లేదని… ఆ సురాలోకంలో విహరిస్తున్న పతంజలికి చెబుదామనే ఇదంతా….
(మార్చి 29 మహా రచయిత కే.ఎన్‌.వై. పతంజలి జయంతి)

  • సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img