Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

డిజిటల్‌ యుగంలో చిన్నబోతున్న రంగస్థలం!

1961లో అంతర్జాతీయ రంగస్థల సంస్థ (ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌, ఐటిఐ) చొరవతో రంగస్థల ప్రాధాన్యం, సమాజ పరివర్తనంలో ప్రత్యక్ష పాత్రను నిర్వహించడం లాంటి లక్ష్యాలతో ఏటా మార్చి27న ప్రపంచ దేశాలు ‘‘ప్రపంచ రంగస్థల దినోత్సవం (వరల్డ్‌ థియేటర్‌ డే)’’ను పాటించటం ఆనవాయితీగా మారింది. ప్రపంచ రంగస్థల దినం-2024 నినాదంగా ‘‘థియేటర్‌ అండ్‌ ఏ కల్చర్‌ ఆఫ్‌ పీస్‌’’ అనే అంశాన్ని ఎంపిక చేశారు. నాటకం సార్వజనీయం, సర్వకాలీనం. ప్రాచీన కళల్లో బహుళ ప్రజాధరణ పొందిన నాటకం ప్రముఖమైంది. మన ముందున్న అనేక కళల్లో జీవితాన్ని వాస్తవంగా చూడడానికి, మానసికో ల్లాసానికి రంగస్థలం ఉపయుక్తం అవుతున్నది. నేటి డిజిటల్‌ యుగపు వినోద విజ్ఞాన మాద్యమాలుగా సినిమాలు, స్మార్ట్‌ఫోన్లు, గూగుల్‌ మాద్యమాలు, అంతర్జాల తెరలు, ఓటీటీి వేదికల వరదల్లో నాటకరంగం కొట్టుమిట్టాడుతున్నది. రంగస్థల నాటకాలు, వీధి నాటకాలు, నాటికలు అనాదిగా మానవాళికి వినోద విజ్ఞాన వితరణ కేంద్రాలుగా సేవలు అందించడం మన గత అనుభవంగా మది పొరల్లో మధుర జ్ఞాపకాలుగా మిగిలి పోయాయి. నేడు రంగస్థలం ఆదరణ కరువై అనాథగా మారి అంతరించే దుస్థితికి చేరడం అత్యంత విచారకరం. రంగస్థల పోషకులుగా నటులు, దర్శకులు, రచయితలు, సంగీతకారులు, గాయకులు, డిజైనర్లు, శబ్ద నిర్మాతలు, లైటింగ్‌/స్టేజ్‌/వేషధారణ నిపుణులు నాటకాన్ని సజీవ రూపంగా మార్చడానికి కృషి చేయడం మనకు తెలుసు. ఒక నాడు ఒక మహా ఉద్యమ చరిత్రగా వెలిగిన రంగస్థలం ఆధునిక పోకడలతో రోజు రోజుకు నిరాదరణకు గురవుతున్నది. గొప్ప చరిత్ర కలిగిన రంగస్థల దినం సందర్భంగా థియేటర్‌ నిపుణులు, ఔత్సాహికులు, నిర్వహణ సంస్థలు నేడు కూడా అవిరళ కృషి చేస్తున్నారు. భాష, సంస్కృతి, సరిహద్దులకు అతీతంగా రంగస్థల రూపాలు ప్రజలకు విశేష వినోదాన్ని, స్ఫూర్తిని కలిగిస్తూనే ఉన్నాయి. ప్రపంచ రంగస్థల దినం వేదికగా నాటకాలు, నాటికలు, వీది,ó లఘు నాటికలు ప్రదర్శించడంతో పాటు నాటక రంగ సుప్రసిద్ధ నిపుణుల సేవలకు పురస్కారాలు, నాటకాలను చూడడం, ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, నటులకు చేయూత ఇవ్వడం, థియేటర్‌ ఫెస్టివల్స్‌ నిర్వహించడం, నాటక రంగాన్ని వివిధ మాద్యమాల ద్వారా ప్రచారం చేయడం లాంటివి నిస్వార్థంగా కొనసాగాలి. రంగస్థల శక్తిని గ్రహించి విద్యాలయాలు, యూనివర్సిటీలు, స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు, పౌర సమాజం తగు చర్యలను తీసుకొని మసకబారిన నాటకంపై వెలుగులు విరజిమ్మాలి. నాటకం ప్రజలను ఏకం చేస్తుంది. రంగస్థలం సమాజాన్ని జాగృత పరుస్తుంది. సమాజ అవలక్షణాలను విమర్శిస్తూనే విరుగుడు మంత్రాన్ని బోధిస్తుంది. నాటకం ఓ వాస్తవ దృశ్య శ్రవణ రూపం. పరస్పర అవగాహన, సాంస్కృతిక వైవిధ్య ప్రాముఖ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతుంది. రంగస్థలం ఉచిత నడవిజ్ఞాన వితరణ కేంద్రం. ప్రపంచ మానవాళి జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాటకరంగ కళ నేడు నిరాదరణ వరదలో కొట్టుకుపో తున్నది. నాటకరంగంలో వెలిగిన ప్రముఖ నటులు వెండితెర స్టార్లుగా వెలుగులు చిమ్ముతున్నారు. నాటకం నుంచే సినిమా పుట్టింది. ఇప్పటికీ రంగస్థల నటులు సినిమా రంగంలో రాణిస్తూనే ఉన్నారు. ఏఎన్‌ఆర్‌, ఎన్టీఆర్‌, నాగయ్య, ఎస్వీ రంగారావు, కోట బ్రదర్స్‌, జయప్రకాశ్‌ రెడ్డి, విజయ్‌ దేవరకొండ/ నవీన్‌ పోలిశెట్టి, సందీప్‌ మాధవ్‌ లాంటి ఎందరో మన తెలుగు నటులు టాలీవుడ్‌ను సుసంపన్నం చేసిన విషయం మనకు తెలుసు. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ ప్రపంచ శాంతికి ఊతం ఇస్తున్న రంగస్థలం పునర్వైభవం పొందడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృష చేయాలి. నాటకాన్ని మన జీవితాల్లో భాగం చేసుకోవాలి. డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img