Friday, December 1, 2023
Friday, December 1, 2023

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వమెప్పుడు?

బుడ్డిగ జమిందార్‌

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 15 సభ్య దేశాలుంటాయి. వీటిలో 5 శాశ్వత దేశాలు చైనా (1971 నుంచి ప్రస్తుత పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా, అంతకుపూర్వం రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా), రష్యా (ప్రారంభంలో సోవియట్‌ యూనియన్‌), అమెరికా, ఫ్రాన్స్‌, యు.కెలు వీటో అధికారంతో ఉన్నాయి. మిగతా 10 దేశాలు తాత్కాలికంగా రెండు సంవత్సరాలకొకసారి ఉంటాయి. తాత్కాలిక రెండు సంవత్సరాల పదవీకాలంలో ఆసియా, ఆఫ్రికాల నుండి 5 దేశాలు, తూర్పు యూరపు నుండి ఒక దేశం, లాటిన్‌ అమెరికా కరీబియన్‌ ప్రాంతాల నుండి 2 దేశాలు, పశ్చిమ యూరపు మిగతా దేశాల నుండి రెండు దేశాలకు అవకాశం ఉంటుంది. ఈ పది సభ్య దేశాలకు వీటో అధికారం ఉండదు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి 2022 చివరి వరకూ మన దేశానికి తాత్కాలిక సభ్యత్వం వచ్చింది. లోగడ 1950, 67, 72, 77, 84, 91, 2011 సంవత్సరాలలో మనకు ఈ అవకాశం దక్కినప్పుడు ప్రపంచ ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల ప్రశంసలు మనకు దక్కాయి. అప్పుడు దౌత్యపర విజయాలను సాధించిన అనుభవం కూడా మనకు ఉంది. అలీనోద్యమానికి చిహ్నంగా భారతదేశం అప్పట్లో గుర్తింపు తెచ్చుకుంది. 2021 ఆగస్టు 1 నుండి భద్రతా మండలి అధ్యక్ష హోదా బాధ్యతల్ని మనదేశం తీసుకొంది. ఒక నెల పాటు మనదేశం ఈ హోదాతో భద్రతా సమితి సమావేశాలను నిర్వహిస్తుంది. ఎజండా తుది నిర్ణయం మన దేశంపై ఉంటుంది. మరలా ఒక నెల పాటు 2022 డిసెంబరులో ఈ అధికార అధ్యక్ష బాధ్యతలు మనకు వస్తాయి. శాంతి సాధన, స్వేచ్ఛాయుత నౌకా రవాణా, టెర్రరిజానికి వ్యతిరేకంగా భారతదేశం కృషి చేస్తుందని మనదేశం నుండి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత రాయబారిగానున్న టి.ఎస్‌.తిరుమూర్తి వీడియో సందేశం ద్వారా తెలియజేసారు. ఐతే ‘క్వాడ్‌’ కూటమిలో భాగస్వామిగా ఉన్న భారతదేశం ప్రాధాన్యతను ఇవ్వవలసిన అంశాలు అనేకం ఉన్నాయి. కొవిడ్‌ మహమ్మారి పరిష్కార మార్గాలు, అభివృద్ధి చెందుతున్న ఆసియా, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాలపై అమెరికా చేస్తున్న అజమాయిషీ, మధ్యప్రాచ్యంలో యెమెన్‌, సిరియా వంటి దేశాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులకు వ్యతిరేకంగా, వెనుజులా, క్యూబా వంటి దేశాలపై సాగుతున్న దిగ్బంధన వ్యూహాలకు వ్యతిరేకంగా, ఆఫ్ఘనిస్తాన్‌లో సుస్థిరత సాధనకు మనదేశం నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలిని మారిన కాలానికి అనుగుణంగా సంస్కరించవలసిన ఆవశ్యకతపై ప్రపంచ వ్యాపితంగా చర్చలు జరుగుతున్నాయి. 1945 అక్టోబరులో రెండవ ప్రపంచ యుద్ధానంతరం పర్మినెంట్‌ సభ్య దేశాలుగా (పి5) ముందుకు వచ్చిన 5 దేశాలకు ఐరాస ఆర్టికల్‌ 108, 109 ద్వారా వీటో అధికారం లభ్యమైంది. ఎటువంటి నిర్ణయాల్ని అయినా వ్యతిరేకించే హక్కు ఈ పి5 దేశాలకు ఉండటంతో ఐక్యరాజ్యసమితిని సంస్కరించటమే సాధ్యం కావటం లేదు. 76 సంవత్సరాల ఐరాస చరిత్రలో అనేక దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో, మేధో సంపత్తిలో అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా బ్రెజిల్‌, జర్మనీ, భారతదేశం, జపాన్‌ వంటి దేశాలు భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కావాలంటున్నాయి. అవసరమైతే ‘వీటో’ అధికారం లేని సభ్యత్వానికి ఈ జి4 దేశాలు కూడా సిద్ధపడుతున్నాయి. దీనికి తోడు దక్షిణాఫ్రికా కూడా శాశ్వత సభ్యత్వం కావాలంటోంది. మరొకవైపు ఇటలీ, పాకిస్తాన్‌, మెక్సికో, ఈజిప్టు వంటివి కూడా ఛాన్సు కావాలంటున్నాయి. మనదేశ సభ్యత్వానికి అమెరికా, రష్యాలు అనుకూలమైనప్పటికీ చైనా అనుకూలంగా లేదు.
భద్రతా సమితిలో సంస్కరణల కోసం 2005 సంవత్సరంలో అప్పటి ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ 24 సభ్య దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలని ప్రణాళికను తయారు చేయగా పి5 దేశాలు బుట్టదాఖలా చేసాయి. ఈ ప్రణాళిక వల్ల ప్రపంచం నలుమూలల నుండి సరైన ప్రాతినిధ్యంతో సమతౌల్యం పాటించే అవకాశా లుండేవి. అగ్రరాజ్యాల దూకుడు ముందు ఐక్యరాజ్యసమితి నానాటికీ అలంకారప్రాయ మవుతున్నది. నేటి ప్రపంచం ఐరాస భద్రతా సమితికి అనుగుణంగా నడవటం లేదని ఆంటోనియో గుటెరస్‌ ఒకప్పుడు అన్నారు. భద్రతా మండలిలో సభ్యదేశాల సంఖ్య పెంపుదల కోసం తీవ్రమైన చర్చ జరపాలనీ, ఐ.రా.స జనరల్‌ అసెంబ్లీ చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ శాశ్వత సభ్యదేశాలు చర్చకు రానీయటం లేదని ఒకప్పుడు అభిప్రాయ పడ్డారు. భద్రతా సమితిలో పి5 నిర్ణయాలను కాదనే స్థితి లేదు. ఉదాహరణకు ఆప్ఘనిస్తాన్‌లో సోవియట్‌ యూనియన్‌, అమెరికా నాటో దేశాల ప్రవేశం ఈ కోవకే చెందుతుంది. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేసిన 6 రోజుల యుద్ధం, జెరూసలెం తీర్మానం, పాలస్తీనాలో శాశ్వత కట్టడాల నిర్మాణం తదితర అంశాలపై అమెరికా లోపల ఒక మాట, బయట ఒక మాట అను తీరుతో వ్యవహరించటంతో ఐరాస మౌనపాత్ర వహిస్తూ రబ్బరు స్టాంపుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ‘వీటో’లలో.. విముక్తి ఉద్యమాలకు మద్దతుగా, ఇజ్రాయిల్‌ అకృత్యాలకు వ్యతిరేకంగా, వర్ధమాన దేశాలకు, సోషలిస్టు దేశాలకు బాసటగా సోవియట్‌ యూనియన్‌ 117 సార్లు, అమెరికా 82 సార్లు, యుకె. 29, చైనా 17, ఫ్రాన్స్‌ 16 సార్లు వీటో అధికారాలను ఉపయోగించాయి. రష్యా మన తరపున పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అనేకమార్లు వీటోను ఉపయోగించింది.
ఐక్యరాజ్యసమితి పారదర్శక బాధ్యతతో వ్యవహరిస్తే ప్రపంచంలో అనేక సమస్యలు పరిష్కారం కాగలవు. నూతన సమస్యలపై దృష్టిపెట్టడం సాధ్యమవుతుంది. అమెరికా వంటి దేశం ఐక్యరాజ్యసమితికి నిధులను ఆపుతామని ట్రంప్‌ హయాంలోఅనటం హేయమైనచర్య. ఐరాసను స్వతంత్రంగా పని చేసుకోనీయాలి. 5,000 కోట్ల డాలర్లను ఏటా ఐరాస అనేక కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంది. రెండిరట మూడు వంతుల నిధులు స్వచ్ఛందంగా వస్తాయి. ఒక వంతు మాత్రం దేశాల నుంచి వసూలు చేస్తారు. అగ్ర భాగాన అమెరికా 1000 కోట్ల డాలర్లతో ఏటా ఖర్చులో మొత్తం 20 శాతం నిధులు సమకూర్చుతుంది. రెండవ స్థానంలో 12 శాతం నిధులను చైనా, 8.5 శాతం నిధులను జపాన్‌ ఇస్తున్నాయి.
పర్యావరణానికి యుఎన్‌ఇపి నైరోబీలోనూ, జనాభా నిధుల కోసం న్యూయార్క్‌లో యుఎన్‌ఎఫ్‌పిఎ, పిల్లల కోసం యునిసెఫ్‌, ప్రపంచ ఆహార ప్రోగ్రామ్‌ (డబ్ల్యుఎఫ్‌పి) రోమ్‌లోనూ, ప్రపంచ వ్యవసాయ సంస్థ ఎఫ్‌ఎఓ కెనడా లోనూ, అంతర్జాతీయ లేబర్‌ఆర్గనైజేషన్‌ ఐఎల్‌ఓ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోనూ, విద్యసైన్సుకల్చర్‌ కోసం యునెస్కో పారిస్‌లోనూ, డబ్ల్యుటిఓ మాడ్రిడ్‌ (స్పెయిన్‌) లోనూ, డబ్ల్యుహెచ్‌ఓ జెనీవాలోనూ ఇంకా అనేక రంగాలలో ఐక్యరాజ్యసమితి కృషిసల్పుతుంది గనుక ఐరాస చారిత్రాత్మకమైనది, విశిష్టమైనది. ఇటువంటి ఐరాసకి ఆయువుపట్టు వంటి భద్రతామండలిలో భారతదేశానికి శాశ్వతసభ్యత్వం ఇవ్వటం సమంజసం, న్యాయపరమైనదే. కానీ మనదేశాన్ని ఇప్పుడున్న 5దేశాలు ఏకగ్రీవంగా ఒప్పు కోవాలంటే కూటముల వైపునకు పయనించకుండా తటస్థంగా అలీనఉద్యమ సారథిగా ముందుకు వస్తే తప్పనిసరిగా పి5 దేశాల మద్దతు లభిస్తుంది. అంతవరకూ వేచి చూడటమే అవుతుంది.
వ్యాస రచయిత ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరమ్‌
జాతీయ కార్యవర్గ సభ్యులు, 9849491969

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img