Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

భీతిగొల్పుతున్న ఆరోగ్య రంగం

జ్ఞాన్‌పాఠక్‌

మన దేశంలో ఆరోగ్యపరిస్థితి భయంకరంగా ఉందని ప్రపంచబ్యాంకు తెలిపింది. 97కోట్ల మందికి పైగా ఆరోగ్యకరమైన ఆహారం లభ్యంకావడం లేదు. ఆరోగ్యభద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(ఏప్రిల్‌) సందర్భంగా, దేశ ఆరోగ్యం 2024 నివేదికను అపోలో గ్రూపు విడుదల చేసింది. ఇది ప్రజలందరికీ హెచ్చరిక. ప్రపంచంలో కేన్సర్‌ వ్యాధికి రాజధానిలాంటిది. నలుగురిలో ఒకరు కూడా ఆరోగ్యంగా నిద్ర పోవడంలేదు. ఐదుగురిలో ఒకరు, 25మందిలో 18మంది డిప్రెషన్‌కు (మానసికంగా కుంగిపోవడం) గురవుతున్నారు. యువతలో 1820ఏళ్ల మధ్యలో ఉన్నవారు ఆందోళన, ఊబకాయం, విసుగు, నిద్రలేమి, బలహీనత, తక్కువ ఉత్పత్తి సామర్ధ్యంలో ఉన్నారు. ముగ్గురిలో ఇద్దరు అధిక రక్తపోటు, అలాగే షుగర్‌ వ్యాధికి ముందటి పరిస్థితిలో ఉంటున్నారు. అలాగే పదిమందిలో ఒకరు షుగర్‌ అదుపుకాని స్థితిలో ఉంటున్నారు. మరో నెలరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా ఈ నివేదిక విడుదల కావడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశం. అయితే మోదీ ప్రభుత్వం ఏ అంశంపైనైనా వచ్చే నివేదికలను అంగీకరించదు. ఎందుకంటే నిజాలు కంటే అబద్ధాలే ప్రియం. ఈ ఆరోగ్య అంశాలన్నీ ప్రత్యేక ప్రాధాన్యత గలవి. ప్రధాని మోదీ, ఆయనపార్టీ బీజేపీ మూడవసారి కూడా గెలుపొందాలని కోరుకుంటున్నారు. మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ శక్తులు తాము గొప్పగా అభివృద్ధి చేసామని, బాధలకు గురవుతున్న భారతీయులను అనేక అంశాలలో పరిరక్షించామని డప్పాలు కొట్టుకుంటున్నారు. ఈ శక్తులు చేస్తున్న ప్రచారం అంతా జనాన్ని తప్పుదారి పట్టించేదే. ఈ పదేళ్లకాలంలో సామాన్య ప్రజలకు, రైతులకు మోదీ ప్రభుత్వం చేసిన మేలేమీ లేదు.
బీజేపీ పాలనలో ఆరోగ్యం అధ్వాన్నం:
2023 నీతి ఆయోగ్‌ ప్రకారం, వార్షిక ఆరోగ్య సూచీ బీజేపీ పాలితరాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది. 202021లో ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మనం లోతుగా పరిశీలించినట్లయితే బీజేపీపాలిత రాష్ట్రాలన్నిటికంటే ఆరోగ్యసౌకర్యాల కల్పన చాలా మేలుగా ఉంది. కేరళరాష్ట్రం అన్నిటికంటే ఉన్నతస్థాయిలో 77.53శాతం, పంజాబ్‌ 65.83శాతం, తమిళనాడు 64.05శాతం, గుజరాత్‌ 62.71శాతం, మహారాష్ట్ర 61.76, హిమాచల్‌ప్రదేశ్‌ 61.84శాతం, జమ్ముకాశ్మీర్‌ 61.02శాతం, ఆంధ్రప్రదేశ్‌ 60.84శాతం, కర్నాటక 59.39శాతం, తెలంగాణ 56.12శాతం, చత్తీస్‌ఘడ్‌ 52.69శాతం నమోదయ్యాయి. అన్నిరాష్ట్రాలకంటే యూపీ చాలా అధ్వాన్నంగా ఉన్నది. అక్కడ 34.44శాతం ఉండగా రాజస్థాన్‌లో 37.35శాతం, బిహార్‌లో 39.10శాతం, ఒడిశాలో 40.19శాతం, మధ్యప్రదేశ్‌లో 40.77శాతం, ఉత్తరాఖండ్‌లో 44.61శాతం, అసోంలో 45.84శాతం, హర్యానాలో 47.59శాతం ఉన్నాయి. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఆరోగ్యం చాలా అధ్వాన్నంగా ఉన్నస్థితిని తెలియజేస్తున్నాయి. అత్యధిక ప్రతిపక్షపార్టీలు ఇండియాకూటమిలో ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వాల కంటే ప్రతిపక్షాలు అన్నివిధాలుగా ఆరోగ్యంపట్ల శ్రద్ధచూపాయి. దిల్లీలో ఆప్‌ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకంటే కూడా ఉన్నతస్థాయిలో ఆరోగ్యరంగాన్ని దిద్దితీర్చింది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఈడీ పరిధిలో డిటెన్షన్‌లో ఉన్నారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రతి మొహల్లా చివరిలో క్లినిక్‌లను ఏర్పాటుచేసి గొప్పప్రశంసనీయమైన విధంగా ఆరోగ్య సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పెద్దపెద్ద ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోలేని సాధారణ ప్రజలంతా మొహల్లా క్లినిక్‌లను ఉపయోగించుకుంటున్నారు. ఆప్‌ పాలిస్తున్న పంజాబ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో చాలా వేగంగా ఆరోగ్యరంగాన్ని అభివద్ధి పరుస్తోంది. దేశంలో చాలా మెరుగ్గా ఆరోగ్యరంగాన్ని దిద్ది తీరస్తున్న రాష్ట్రాల్లో కేరళ తర్వాత రెండవదిగా పంజాబ్‌ ఉన్నది. కేరళలో వామపక్ష ఫ్రంట్‌ ఆరోగ్యరంగం పట్ల చాలా శ్రద్థ వహించింది. రాజస్థాన్‌లో ఆరోగ్యరంగం అత్యంత అధ్వాన్నంగా ఉంది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత వైద్యహక్కును చట్టంగా తీసుకొచ్చి ఆరోగ్యరంగాన్ని అభివృద్ధి పరచేందుకు కృషి చేసింది. ప్రజల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచేందుకు కాంగ్రెస్‌ ఒక్క రాజస్థాన్‌లో ఆరోగ్యహక్కును చట్టంగా తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం రాజస్థాన్‌. తాజాగా కాంగ్రెస్‌ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో పౌరులందరికీ ఆరోగ్యహక్కు కల్పిస్తామని తెలియజేసింది. ఆరోగ్యభద్రత సార్వత్రికమైనదని ప్రజారోగ్యకేంద్రాలు అంటే ఆస్పత్రులు, క్లినిక్‌లు, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, సంచార ఆరోగ్యభద్రతా యూనిట్లు, డిస్పెన్సరీలు, ఆరోగ్యకేంపులు ద్వారా ప్రజలకు అవసరమైన చికిత్సలు అందచేస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. అలాగే ఆరోగ్యపరీక్షలు, అనారోగ్యాల గుర్తింపు, వైద్యం, శస్త్రచికిత్సలు, మందులు, పునరావాసం తదితరాలకు ఉచితంగా చికిత్సలు అందచేస్తామని తెలిపింది. ఇండియాకూటమిలో ఆరోగ్యరంగానికి సంబంధించిన వాగ్దానం చేసిన ప్రతిపక్ష రాజకీయపార్టీ కాంగ్రెస్‌ ఒక్కటే. గత పదేళ్లకాలంలో మోదీ ప్రభుత్వంలో వైద్యచికిత్సలు అత్యంత ఖరీదైపోయాయి. దేశంలో అత్యధిక ప్రజలు ముఖ్యమైన అనారోగ్యాలకు చికిత్సచేయించడం సాధ్యం కావడంలేదు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ 25లక్షల మేరకు బీమాతో నగదురహిత చికిత్స అందించడానికి చట్టం తీసుకువచ్చింది. ప్రైవేటురంగ ఆసుపత్రులు, ప్రభుత్వరంగ ఆసుపత్రులలో చికిత్సకు 25లక్షల బీమా హామీ ఉంటుంది. ఈ పధకం కింద లాభాలులేని ఆరోగ్య సౌకర్యాలను, ఆరోగ్య కేంద్రాలను తిరిగి డిజైన్‌ చేస్తామని కాంగ్రెస్‌ తెలియజేసింది. 202829 నాటికి మొత్తం ఆరోగ్యరంగానికి 4శాతానికి పెంచుతామని ప్రతి ఏటా కొద్దికొద్దిగా బడ్జెట్‌ను పెంచుతూ చివరకు 4శాతాన్ని కేటాయించడం జరుగు తుందని ఎన్నికల ప్రణాళిక తెలిపింది. 202324 జీడీపీలో కేంద్ర ఆరోగ్య బడ్జెట్‌ కేవలం 0.35శాతం మాత్రమేఉంది. 202223లో 0.42శాతం, 2021`22లో 0.56శాతం మాత్రమే కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆరోగ్యరంగాన్ని నిర్లక్ష్యంచేస్తూ ప్రైవేటు రంగానికి మాత్రం అన్నివిధాలుగా సహాయం చేస్తోంది. నాణ్యమైన మందులు తయారీకి ఉత్పత్తి యూనిట్లను కఠినంగా అజమాయిషీ చేస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. నాణ్యమైన మందులను ప్రజలకు సరఫరా చేయగలిగినట్లయితే ప్రజల ఆరోగ్యాలు మరింతగా మెరుగవుతాయి. తక్కువ నాణ్యమైన మందులు తయారు చేసే కంపెనీలలో దర్యాప్తు చేసినప్పటికీ వాటిపై ఎలాంటి చర్య బీజేపీ ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. మోదీ ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్లు పథకం ద్వారా రాజకీయ పార్టీలకు ముఖ్యంగా బీజేపీకి ఆయా కంపెనీలు డొనేషన్లు ఇవ్వడానికి బదులుగా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయి. ఇలా బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలకంటే ఆరోగ్య రంగంపట్ల శ్రద్ధ చూపేందుకు ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ చేర్చడం గొప్పచర్య. ఇప్పటికే దిల్లీలో ఆప్‌, కేరళలో వామపక్ష ఫ్రంట్‌ ఆరోగ్యరంగంలో ప్రశంసనీయమైన చర్యలు తీసుకున్నాయి. ఆందోళన కలిగిస్తున్న తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి నుండి ప్రజలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు తీసుకున్నటువంటి చొరవలు తీసుకోవాలి. దేశంలో ఆరోగ్య ఎమర్జన్సీని ప్రకటించ వలసిన పరిస్థితి ఉన్నది. ఆరోగ్యరంగానికి ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యతనిచ్చి ప్రజలకు వైద్య చికిత్సలు అందచేయడానికి ముందుకు వచ్చిందో పరిశీలించి ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటుచేయవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img