Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

మండే కాలం

చింతపట్ల సుదర్శన్‌

ఎన్నికల కాలం, ఎండాకాలం ఒక్కటే కావడంతో ‘డబుల్‌ దమాఖా’ ఎండ ఎవరినీ కుదురుగా కూచోనివ్వడం లేదు. ఈ ఎండలో తిండి కోసం అరుగు దిగి వెళ్లే సాహసం చెయ్యాలో వద్దో అర్థం కాలేదు డాగీకి. అరుగు మీద ఓ పక్క డాంకీ, నిన్న తిన్న కాగితాల్ని నెమరువేసుకుంటున్నది. దీనికి ఉన్న ‘ఫెసిలిటీ’ మనకు లేకపోయింది అని వాపోయింది డాగీ. ఏమిటి ‘తంబీ’ అరుగు దిగేదిలేదా? కడుపు మాడ్చుకుంటావా? అంది డాంకీ. నీకున్న సదుపాయం నాకు లేదుకదా బ్రదర్‌. ఈ ఎండలో వెళ్లి మళ్లీ రాగలనా అనిపిస్తోంది. ఇక్కడే ఉంటే కడుపుమాడినా, ప్రాణం ఊడదు కదా. అలాగంటే ఎలా? ఆఫ్టరాల్‌ ‘స్ట్రీట్‌ డాగ్‌’ వి నువ్వూ ఎండకు భయపడిపోతే ఎలా? నిత్యం ‘ఏసీ’ గదుల్లో కాళ్లూపుకుంటూ కూచునే నాయకులంతా ఎండలో తిరిగి తిరిగి మాడి మసిబొగ్గులై పోతున్నారు. వాళ్ల కంటే ఎక్కువా నువ్వు అంది డాంకీ తోక ఎగరేస్తూ. చెప్పావులే! వాళ్లు ఈ నాలుగు రోజులు ఎండలో తిరిగితే మళ్లీ అయిదేళ్ల దాకా మహారాజులే కదా. దర్జా, దర్పమూ, హోదా, డబ్బూ, దస్కమూ అన్నీ కాళ్ల దగ్గర పడుంటాయి. ఇప్పుడు మాడిన ముఖాలే ‘క్రీం’ లు పూసుకుని కళకళలాడ్తయి అంది డాగీ.
అలాగెందుకు అనుకుంటావు. ప్రజల్ని ఉద్ధరించడం కోసం, ప్రజల్ని సేవించుకోడం కోసం చెమటోడుస్తున్నారనుకోవచ్చు గదా అంది డాంకీ, డాగీని రెచ్చగొడుతూ. రోడ్డు షోల్లో, కార్నర్‌ మీటింగుల్లో కాబోయే ప్రజాప్రతినిధులూ, మంత్రులూ నోరు నిప్పి పుట్టేదాకా ఒకళ్ల నొకళ్లు తిట్టుకోవడమేనా ప్రజల్ని ఉద్ధరించడమంటే అంది డాగీ మూతి వంకరగా పెట్టి. తిట్టుకోవడం సరే ప్రజలకు ఇచ్చే వరాల మాటేమిటి. దాన కర్ణుడికి కూడా లేని దాతృత్వం వీళ్లకు లేదా? అడగనిదే వరాలిచ్చే దేవుళ్లు కాదా? దేవుళ్లా దయ్యాలా? వరాలిస్తారా రూపాయి చేతికిచ్చి వంద లాక్కుంటారు ఇలాగే నోటికి ఎంత వస్తే అంత ఏది తోస్తే అది ఇచ్చేసుకుంటూ పోతే చివరికి ప్రజలకు చేతికి ‘చిప్ప గ్యారంటీ’ అంది డాగీ. గ్యారంటీ అనే మాట వాడావు కదా? ఆ గ్యారంటీనే ఏ పార్టీనయినా గెలిపించేది. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విమాన ప్రయాణం దాకా వెళ్తుంది. అది కదా అభివృద్ధి అంటే అంది డాంకీ. చూడబోతుంటే నువ్వు ఎక్కడో ఫ్యాను కింద కూచుని వచ్చినట్టున్నావు. సర్కారీ గాడిదవైపోయావా ఏంటి? అంది డాగీ గుర్రుమంటూ.
నా అంత తెలివైన గాడిద సర్కారుకు సలహాదారుగా ఉంటే ‘ఆ కిక్కే’ వేరప్పా! కానీ గాడిదల్లాంటి మనుషులకే ఇస్తారు పదవులన్నీ. ఈ మాట నిజమే మరి గాడిద బరువు మోసేవారు, గాడిదలా తలూపేవారు మనుషుల్లో ప్రత్యేకంగా ఉంటారు. వారికే పొజిషన్లూ, పదవులూ నాలాంటి గాడిదలకు, నీలాంటి కుక్కలకూ ‘పోర్ట్‌ఫోలియోలు’ కూడానా. నువ్వంటుంటే ఒకటి గుర్తుకొస్తున్నది. మనషుల్లో నాలాంటి గాడిదలే కాదు నీలాంటి కుక్కలూ ఉన్నారు అంది డాంకీ! నాలాంటి వారా ఎవరెవరు అని కుతూహలపడిరది డాగీ. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రతి పార్టీలోనూ కుక్కల్లాంటి వారుంటారు. అవతలి పార్టీ వాళ్ల చాలెంజ్‌లకు ప్రతి చాలెంజ్‌లు, ఖండనలకు ప్రతి ఖండనలు, బూతులకు ప్రతి బూతులు ప్రయోగించడానికి అన్ని పార్టీల్లోనూ మొరిగీ మొరగగానే అవతలి పార్టీ వాళ్లు తమ మనుషుల్ని ‘ఉస్కో’ మని ఉసిగొల్పుతారు. అంతే వాళ్లు నీకన్నా గొప్పగా ‘నాన్‌స్టాప్‌’ గా ‘మొరుగు’ లంకించుకుంటారు. ఇలాంటి ఆల్సేషియన్లూ, జర్మన్‌ షెప్పర్డులూ, లాబ్రడార్లూనే కదా టీవీల చర్చలు కొనసాగిస్తారు. తమ పార్టీల గొప్పతనాన్ని వేనోళ్ల పొగుడుతారు. వీళ్ల కీచులాటే కదా టీవీ యాంకర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌, ప్రేక్షకులకు తలనొప్పి, ‘బామ్‌’ లు అమ్మేవాళ్లకి మార్కెటింగ్‌ అంది డాంకీ.ఒళ్లంతా చెమట కారుస్తూ అరుగు ఎక్కాడు అబ్బాయి. ఏవిటి బ్రో నీరు కారిపోతున్నావు అంది డాగీ. ఎండ చంపేస్తున్నది, తొక్కి నార తీస్తున్నది, నాలుక కోసి ముక్కలు చేస్తున్నది అన్నాడబ్బాయి. ఏ రోడ్డు షో నుంచి వస్తున్నావన్నా పాలిటిక్సు మాట్లాడుతున్నావు అంది డాంకీ. ఊరంతా గోలే! ఫ్యాను తిరుగుతున్నది కాని గాలేది అంటాడొకడు, కిందపడితే భళ్లున గ్లాసు అంటాడొకడు, అందరి చెవుల్లో ఉన్నది పూవే అంటాడొకడు. వీళ్ల మాటలు విని మండిపోతున్నారు జనం. ఒకడేమో మా నాన్నొక గజదొంగ, మా నాన్నకు ఓటు వెయ్యవద్దంటాడు. ఒకడేమో మా మామ దుష్టుడు, దుర్మార్గుడు మా మామకు ఓటెయ్యవద్దంటాడు. ఒక చెల్లెమ్మేమో మా అన్న దొంగలకు దొంగ, రౌడీలకు రౌడీ, పుండాకోర్లకు పుండాకోరు, హంతకులకు బాడీగార్డు మా అన్నకు ఓటు వెయ్యవద్దు అంటుంది అంటూ అలుపు తీర్చుకోడానికి కూలబడ్డాడు అబ్బాయి. ఆకాశంలో సూర్యుడు మండిపడుతున్నాడు. నాయకులంతా ఒకరి మీద ఒకరు బట్టకాల్చి విసురుకుంటున్నారు. జనాన్ని ఈ మంటా, ఆ మంటా ‘డబుల్‌ దమాఖా’ తడాఖా రూచి చూపిస్తున్నవి అంది డాంకీ. ఇది ఎన్నికల కాలం, ఎండాకాలం కాదు మండే కాలం, నా కడుపు ఎండేకాలం అంది డాగీ నీరసంగా.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img