Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

మోదీ మాటలకు అర్థాలే వేరులే

సవ్యసాచి

రాజకీయ రణతంత్రం అనగానే పంచతంత్రం గుర్తుకు రావడం సహజం. విష్ణుశర్మ పంచతంత్రంలో మిత్రభేదం, మిత్రలాభం, కాకోలూకీయం, లబ్ధప్రణాశం, అపరీక్షిత కారకం ఉంటాయి. ఈ రచన ద్వారా ఆరు నెలలోనే రాకుమారులను నీతి శాస్త్రజ్ఞులను చెయ్యాలన్నది విష్ణుశర్మ సంకల్పం. అయితే పంచతంత్రంలో రాకుమారులకు కుట్రలు, కుయుక్తులు, అడ్డదారులు నేర్పలేదు. అవి ఎలా ఉంటాయో తన కథల ద్వారా పరిచయం చేస్తాడు. అందువల్లనే పంచతంత్రం కాలక్రమేణా హితోపదేశంగా, నీతిచంద్రికగా ప్రాచుర్యం పొందింది. మన కాలంలో ఆ పంచతంత్రం రాజకీయ రణతంత్రంగా వికృత రూపం పొందింది. పైగా మోదీ మార్క్‌ రాజకీయ రణతంత్రం ప్రత్యేకమైనది. మోదీ రణతంత్రం హితోపదేశం కాదు…విద్వేషోపదేశం, అది నీతి చంద్రిక కాదు, దుర్నీతి చంద్రిక … మోదీ రణనీతి ప్రకృతి కాదు, వికృతి. అదొక విశ్వామిత్ర సృష్టి. స్వర్గానికి పోతున్నామన్న భ్రమ కల్పించి మనల్ని త్రిశంకు స్వర్గానికి చేరుస్తుంది. అందులో చిక్కుకుంటే సాలెగూడులో చిక్కుకున్నట్లే. పైకిపోలేం. కిందకు దిగలేం. 2024 ఎన్నికలు వస్తున్నాయి. మోదీ కొత్త నినాదాన్ని ఆలపిస్తున్నారు. ‘మోదీ గ్యారంటీ’ అంటూ జబ్బ చరిచి మరీ ప్రకటిస్తున్నారు. మోదీ మౌనం వెనుక, మాటల వెనుక ఒక రహస్యం వుంటుంది. స్వప్రయోజనం వుంటే మౌనం నటిస్తూ పనికానిచ్చేస్తారు. ఈ పనులకు బహిరంగ ప్రకటనలు వుండవు. జబ్బ చరుపులు వుండవు. అంతా నిగూఢ గుప్తమే. ఆదానికి విమానా శ్రయాలు, పోర్టులు, సహజ వనరులు దఖలు పరుస్తారు. అంబానీకి ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలను టెలి కమ్యూనికేషన్‌లు విస్తరించడానికి గేట్లు తెరుస్తారు. ఎన్నికల బాండ్లు సమర్పిస్తే ప్రాజెక్టులు, వారికి మంజూరవుతాయి. ఎలాంటి ప్రకటనలూ లేకుండానే ఆప్త మిత్రులకు కాసుల పంట పండిస్తారు. ఐటీ, ఈడీ, సీబీఐ ఆయన అంబులపొదిలో అస్త్రాలు. వాటితో దాడులు చేయిస్తారు. లొంగిన వాళ్లకు పార్టీ కండువాలు కప్పి కేసులను పక్కన పెడతారు. లొంగకపోతే జైళ్లపాలు చేస్తారు. వీటన్నింటినీ మోదీ చెప్పకుండా చేస్తారు. అడ్డదారుల్లో పార్టీ నిధులను పోగేస్తారు. ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధం అంటారు. ఈ డబ్బుతో ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చేస్తారు. వారిని భయభ్రాంతులను చేస్తారు. మోదీ మౌనతంత్రంతో సాగించే కుతంత్రాలకు ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే !
మనకు తెలిసిన రాజకీయ మోదీ హామీలు ఇచ్చే మోదీ. ఈ హామీలను పదేపదే వల్లిస్తారు. వీటినే ఎన్నికలప్పుడు గ్యారంటీలు అని జబ్బ చరిచి మరీ ప్రకటిస్తారు. ఏతావాతా ఇవన్నీ వారంటీ లేని గ్యారంటీలు. కొన్ని ప్రకటనలతోనే తుస్సు మంటాయి.. మరికొన్ని ఆచరణకు ఆమడదూరంలో మహిళా రిజర్వేషన్ల చట్టంలా మురిపిస్తాయి. ఎన్నికలలో అవసరమైన ‘‘పౌర సత్వ సవరణ’’ చట్టాలు లాంటి వాటిని బైటకు తీసి తక్షణం అమలులోకి తెస్తారు. మోదీ హామీల తంతు మనకు తెలియంది కాదు. 2014లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు తిరుపతిలో ఎన్నికల సభ నిర్వహించాయి. ఆ వేదిక మీద ప్రధాని అభ్యర్థిగా వున్న మోదీ విభజన వల్ల కలిగిన కష్టాల మీద భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించారు. తిరుపతి దేవుని పాదపద్మాల చెంత మోదీ స్వయంగా చేసిన వాగ్దానం. అందరూ ఈ హామీని గ్యారంటీ అనుకున్నారు. అధికారంలోకి వచ్చాక ‘‘ప్రత్యేక హోదా’’కు ఆయన వాయిదాల మీద తిరుక్షవరం చేశారు. 14వ ఆర్థిక సంఘం అడ్డు చెప్పిందని బుకాయించారు. ప్రత్యేక హోదా సమస్య తమ పరిధిలోనిది కాదని వారు ప్రకటించినా అదే పాట నేటికీ పాడుతున్నారు. దేశంలోనే అతి గొప్ప రాజధాని నిర్మాణం జరిపిస్తామని మోదీ ప్రకటించారు. ఈ రాజధానికి మోదీ స్వయంగా శంకుస్థాపన చేశారు. చారెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి సరిపెట్టారు.
విభజన చట్టంలో ఎన్నో హామీలున్నాయి. అవి చట్టబద్ధమైన హామీలు. కేంద్రం గ్యారంటీగా అమలు చేయాల్సిన హామీలు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నంలో పోర్టు, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక తరహా నిర్దిష్టమైన ప్యాకేజీలు వీటన్నింటికీ మోదీ ఎగనామం పెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు అరకొర నిధులు, కొన్ని విద్యా సంస్థల ఏర్పాటుతో సరిపెట్టారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను డబుల్‌ ఇంజిన్‌ సర్కారులే నడిచాయి. ఇక్కడ ఎవరు అధికారంలో లేదా ప్రతిపక్షంలో వున్నా ఎడాపెడా మోదీకే జైకొట్టారు. అయినా మోదీ ప్రసన్నుడు కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో పరుగులు తియ్యలేదు. ఇప్పుడు మోదీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తే రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామంటున్నారు. ఇది మోదీ గ్యారంటీ అంటున్నారు. మోదీ చేతల భాష మౌనం. మోదీ కోతల భాష హామీలు, గ్యారంటీలు. అందుకే ఆయన మాటలకు అర్ధాలే వేరులే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img