విశాలాంధ్ర,పార్వతీపురం : మండలాల్లో తహాశీల్దార్లు సమర్థవంతమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ సమావేశం జరిగింది. రెవెన్యూ అంశాల పట్ల సానుకూలంగా స్పందించి మంచి పరిష్కారం చేయాలనిస్పష్టం చేశారు. రికార్డులు పక్కాగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే సమస్యలు మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. సమస్యలపై ముఖ్యంగా భూసమస్యల పట్ల క్షుణ్ణంగా విచారణ చేయాలని ఆయన ఆదేశించారు. మండలాల్లో సంభవించే విపత్తులు, ఇతర సమస్యలను ముందుగా గుర్తించే విధంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. గ్రామ స్థాయి సమాచారం పక్కాగా కలిగి ఉండాలని ఆయన ఆదేశించారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్, భూ సేకరణ, గృహ నిర్మాణం, తదితర అంశాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పారిశ్రామిక తదితర అవసరాలకు జిల్లాలో లాండ్ బ్యాంక్ అవసరమని, అందుకు అవసరమగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక,ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి జి కేశవనాయుడు, పార్వతీపురం రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి వి వెంకటరమణ, జిల్లా కలెక్టర్ కార్యాలయ విభాగ అధిపతులు పాల్గొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలస్థిరీకరణ:
జాయింట్ కలెక్టర్ శోభిక
జిల్లాలో నిత్యావసరవస్తువుల ధరలను స్థిరీకరించడానికి, మార్కెట్లో సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో స్పెషల్ కౌంటర్లు ప్రారంభించామని జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక తెలిపారు.ఈకౌంటర్లలో నాణ్యత కలిగిన కందిపప్పు, బియ్యం అందుబాటు ధరలకు విక్రయిస్తారని అన్నారు. ఈ కేంద్రాల్లో కందిపప్పు (దేశవాళీ రకం) కిలో రూ.160 నుంచి 150, బియ్యం (ఫైన్ స్టీం బియ్యం) కిలోకు రూ.49 నుంచి రూ.48, ఫైన్ ముడి రాబియ్యం కిలో రూ.48 నుంచి రూ.47 నిర్ణయించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రైతు బజార్లు, ఇతర షాపులలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.