Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు

. పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం
. పంటల బీమా, కౌలు రైతు సమస్యలపై అధ్యయన కమిటీలు
. ధాన్యం కొనుగోలుకు మెరుగైన విధానం
. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర – బ్యూరోఅమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం, ఉచిత ఇసుక విధానం, రబీ సీజన్‌లో ధాన్యం సేకరణపై కీలకంగా చర్చ సాగింది. సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌2022 పై ప్రజలకు అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయన్న విషయం అనేక పత్రికలు, ఇతర మీడియా సంస్థల ద్వారా తేటతెల్లమైందని ల్యాండ్‌ టైటిలింగ్‌ అథారిటీ తెలిపింది. దీంతో ఈ చట్టాన్ని రద్దు చేయాలని భూ యజమానుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి మొదలైందని మంత్రి వివరించారు. ఈ చట్టాన్ని రద్దు పరచడానికి ఏపీ టైటిలింగ్‌ అథారిటీ ప్రస్తావించిన కారణాలు అనేకం ఉన్నాయన్నారు. నీతి ఆయోగ్‌ రూపొందించిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ప్రకారం టీఆర్‌వోగా ప్రభుత్వ అధికారి ఉండాలి. కానీ ఆ స్థానంలో గత ప్రభుత్వం ఎటువంటి అర్హత లేని వ్యక్తులను కూర్చోబెట్టేందుకు అవకాశం కల్పించే విధంగా మార్పులు చేసింది. ఈ చట్టం ప్రకారం సివిల్‌ కోర్టుల ప్రమేయం పూర్తిగా తుడిచివేయబడుతుంది. టీఆర్‌వో దగ్గర సమస్య ఉత్పన్నమైతే వ్యయప్రయాసలకోర్చి నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు చేసే వారసత్వ ఆస్తుల బదలాయింపులు సివిల్‌ కోర్టుల ద్వారా చేయబడవు. ఈ చట్టం అమలులోకి వస్తే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంటుంది. ఈ చట్టం చాలా హడావిడిగా, భాగస్వాములందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా చేశారు. ఈ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్‌ పొందిన భూయజమానికి జిరాక్స్‌ కాపీలు మాత్రమే ఇస్తారు. ఒరిజినల్‌ డాక్యుమెంట్లు సదరు టీఆర్‌వో వద్దే ఉంటాయి. దీనివల్ల ప్రభుత్వం సదరు ఆస్తులను తనఖా పెట్టుకునే అవకాశం ఉందని భూ యజమానులు భయాందోళనకు గురయ్యారు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (టీఆర్‌వో) లు జారీ చేసే జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్ని (జీపీఏ) లు భూ యజమానులను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఎలాంటి శిక్షణ, అవగాహన లేని టైటిలింగ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారుల వల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మరిన్ని అవరోధాలు, గొడవలు ఉత్పన్నమయ్యే పరిస్థితి. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, టైటిల్‌ అప్పిలేట్‌ అధికారులు స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌లు, మ్యూటేషన్‌లు చేసే పరిస్థితి దాపురించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేబినెట్‌, ప్రజా ప్రతినిధులమైన మనందరిపై ఉందని ముఖ్యమంత్రి సూచన మేరకు బిల్లు రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడిరచారు.
సమగ్ర ఇసుక విధానం
ఇసుక, గనుల పాలసీ2019, మరింత మెరుగైన ఇసుక విధానం2021 ను రద్దు చేస్తూ ఉచిత ఇసుక మెకానిజం`2024 ఏర్పాటు అయ్యేంత వరకు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించే మధ్యంతర వ్యవస్థ ఏర్పాటు చేసేలా జులై 8న జారీ చేసిన జీవో ఎం.ఎస్‌ నంబర్‌ 43కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆయా సంస్థలతో ఉన్న ఒప్పందాలను నిలుపుదల చేయడం, ఇసుకకు సంబంధించిన స్టాక్‌ను సంబంధిత అధికారులకు అప్పగించాలని మైన్స్‌, జియాలజీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. శాండ్‌, మైనింగ్‌ పాలసీ2022, మరింత మెరుగైన ఇసుక పాలసీ2021 ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదట వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం2024 ను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రివర్గం అభిప్రాయపడిరది. వినియోగదారులకు సరసమైన ధరలకు ఇసుక లభించేలా చూడటం, శాండ్‌ ఆపరేషన్‌లో పారదర్శకతను పెంపొందించడం, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడం, పర్యావరణ హితం కోరుతూ గౌరవ సుప్రీం కోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన మార్గదర్శకాల మేరకు సమగ్ర ఇసుక విధానం2024ను తీసుకురావాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
ధాన్యం కొనుగోలుకు రూ.2 వేల కోట్ల రుణం
ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం రూ.2,000 కోట్ల రుణాన్ని వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల సంస్థ పొందేలా అనుమతిస్తూ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ జారీ చేసిన జీవోలో రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గత రబీ సీజన్‌లో సేకరించిన వరి ధాన్యానికి 84 రోజులు గడిచినా ఎటువంటి సొమ్ము చెల్లించకుండా తాత్సారం చేశారు. అందువల్ల మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బకాయి సొమ్ము రూ.1,000 కోట్లు సదరు రైతులకు చెల్లించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించే పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ఆహార, పప్పు ధాన్యాలను సేకరించి జాతీయ ఆహార భద్రతా చట్టానికను గుణంగా తెల్ల రేషన్‌ కార్డు కలిగి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాయితీ ధరలకు అందిస్తున్నదన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు రుణాలను తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ప్రస్తుత సంవత్సరానికిగాను ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు ఎన్‌సీడీసీ (నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి వర్కింగ్‌ కేపిటల్‌ అసిస్టెన్స్‌ రూపేణా రూ.3,200 కోట్ల కొత్తగా రుణాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ, సహకార శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న ధాన్యం కొనుగోలు విధానంలోని లోపాలను సవరించి రైతులకు సులువైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేబినెట్‌ అభిప్రాయపడిరది.
పంటల బీమా, కౌలు రైతుల రుణాలపై మెరుగైన విధానం
వివిధ రాష్ట్రాల్లో ఉన్న పంట బీమా చట్టాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఆర్థిక, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ మంత్రులు ముగ్గురితో కూడిన ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నెలరోజుల్లో నివేదికను ఇవ్వాల్సిందిగా ఆ కమిటీకి సూచించారు. కౌలు రైతులకు సులువుగా రుణాలు అందించే కొత్త విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై అధ్యయనం చేయాల్సిందిగా కేబినెట్‌కు ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి పార్థసారధి వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img