విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ముగ్గురు జడ్జిలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోమవారం ప్రమాణం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో మహేశ్వరరావు కుంచెం (అలియాస్ కుంచం), తూటా చంద్ర ధనశేఖర్ (అలియాస్ టీసీడీ శేఖర్), చల్లా గుణరంజన్‌తో అదనపు న్యాయమూర్తులుగా సీజే ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టులో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి.పొన్నారావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డా.వై.లక్ష్మణరావు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.