Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

. కూటమి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలి
. సీఎం అఖిలపక్షంతో సంప్రదించాలి: రామకృష్ణ
. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలి: ముప్పాళ్ల
. మహావిజ్ఞాపన దీక్షకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు

విశాలాంధ్ర – విజయవాడ : అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద అగ్రిగోల్డ్‌ బాధితులు చేపట్టిన మహా విజ్ఞాపన దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సీపీఐ నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి బాధితుల సమస్యను పరిష్కరించాలని కోరతామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి అఖిలపక్ష నేతలతో సంప్రదించి వారి సూచనలు, సలహాలతో సమర్థ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్ణీత గడువులో ఈ సమస్యను పరిష్కరించడమే చంద్రబాబు పరిపాలనా దక్షతకు నిదర్శంగా ఉంటుందన్నారు. కాలం గడిచిన తరువాత పరిష్కరిస్తే ఉపయోగం ఉండదన్నారు. పదేళ్లుగా ఈ సమస్య ఉందని, ప్రభుత్వాలు మారిపోతున్నా పరిష్కారం కావటం లేదన్నారు. పారదర్శకంగా పని చేయకపోవటం వల్లే విమర్శలు వస్తున్నాయన్నారు. నిబద్ధత కలిగిన విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరావు లాంటి అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందన్నారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ కంపెనీ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికలో మేనిఫెస్టోలో పేర్కొన్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. సమస్య మొదటిసారి వెలుగులోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 142 మందికి రూ.5లక్షలు పరిహారం అందించారని, కంపెనీ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తమ పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం బాధితుల నిమిత్తం రూ.906 కోట్లు రెండు విడతలుగా ఇచ్చిందన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఒక సమర్థవంతమైన అధికారులతో ప్రత్యేక కమిటీ (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌)ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అధికారుల బృందం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తే బాధితులు వారి ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకువస్తారని చెప్పారు. కంపెనీ అడ్డగోలుగా ఆస్తులు అమ్మేస్తుందని, మట్టి, కలప, వీల్కెనచోట బినామీ ఆస్తులను అమ్ముకుంటుందన్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కంపెనీల ఆస్తులను పరిరక్షించటానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఏలూరు కోర్టులో ఉన్న 11వేల కేసుల్లో తమదీ ఒకటనీ ఈ సమస్య పరిష్కారం కోసం చాలా సంవత్సరాలు పట్టే అకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు. బాధితుల పక్షాన ఏడు డిమాండ్‌లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్సీ కేఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో వాయిదా తీర్మానం ఇచ్చి అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల తరుపున మద్దతు ప్రకటించారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితుల డిమాండ్లను పరిష్కరించటానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేని అంశాలే ఉన్నాయని ప్రత్యేక దృష్టిపెడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ మాట్లడుతూ సమస్య పరిష్కారానికి బాధితుల్లో రాజకీయ చైతన్యం రావాల్సి ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వేంకటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని కుటుంబాల సమస్యగా ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలన్నారు. ఐక్యంగా పోరాటం చేస్తే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ఒకేఒక్క లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏఐటీయూసీ తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ మోసం చేసిన కంపెనీ ఆస్తులు అమ్మి సమస్యను పరిష్కరించాలని కోరటం న్యాయమైనదని, ఈ ప్రభుత్వ హయాంలోనే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వి.తిరుపతి రావు అధ్యక్షత జరిగిన మహా విజ్ఞాపన దీక్షకు వివిధ రాజీకయ పార్టీలు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్‌.మల్లికార్జున్‌, ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్‌తో పాటు 26 జిల్లాల నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు. దీక్ష సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి రాష్ట్ర కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య అభ్యుదయ గీతాలు ఆకట్టుకున్నాయి.

అగ్రిగోల్డ్‌ సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం: వర్ల రామయ్య

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. అడగకుండా అన్నం పెట్టే అయ్య చంద్రబాబు అని అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా గత పది సంవత్సరాలుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు చేస్తున్న పోరాటాన్ని కొనియాడారు. కమ్యూనిస్టులు ముక్కు సూటిగా ఉంటారని, అవతలి వ్యక్తిని చట్టంలో ఎలా బిగించాలో తెలిసిన వ్యక్తుల్లో ముప్పాళ్ల ఒకరని చమత్కరించారు. చంద్రబాబు అనుమతితో వచ్చి మీకు హామీ ఇస్తున్నానన్నారు. మీ ఆవేదన, ఆకాంక్షకు తగినట్లుగానే ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు, అన్ని రాష్ట్రాలలో కేసులన్నీ ఏలూరు కోర్టు అనుమతి ఇచ్చేందుకు న్యాయశాఖ నిపుణులతో సంప్రదిస్తున్నామన్నారు. త్వరలోనే మీ కష్టాలు తీరుతాయని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యర్‌ పర్యవేక్షణలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీ కుటుంబాలలో త్వరలోనే సంతోషాన్ని చూస్తారని ప్రకటించగా బాధితుల హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అనంతరం దీక్షలో ఉన్నవారందరికీ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img