Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

హమాస్‌ ప్రతిఘటనతో కంగుతిన్న ఇజ్రాయిల్‌

టెల్‌అవివ్‌: రఫా నగరంపై దాడి చేయడం ద్వారా హమాస్‌ను అంతం చేయాలన్న భావిస్తున్న ఇజ్రాయిల్‌కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. ఉత్తర, మధ్య గాజాలో మళ్లీ హమాస్‌ క్రియాశీలమైంది. భూతల దాడుల్లో భాగంగా ఈ ప్రాంతంలో హమాస్‌ను తుదముట్టించామని భావిస్తున్న ఇజ్రాయిల్‌కు ఈ పరిణామం కలవరపెడుతోంది. రెండ్రోజులుగా ఉత్తర గాజాలో ఇజ్రాయిల్‌ రక్షణ దళాలను (ఐడీఎఫ్‌) హమాస్‌ మిలిటెంట్లు ప్రతిఘటించడం ప్రారంభించారు. దీంతో కేవలం రఫాకే పరిమితమైన ఇజ్రాయిల్‌ ఇప్పుడు మళ్లీ గాజా వ్యాప్తంగా గగనతల దాడులను ప్రారంభించింది. ఆదివారం గాజా సిటీ తూర్పు ప్రాంతంలోని జబాలియా శరణార్థి శిబిరం లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. రఫాలోనూ హమాస్‌ మిలిటెంట్లు లక్ష్యంగా దాడులు చేసింది.
మధ్య రఫాలో హమాస్‌ కీలక నేతలు తలదాచుకున్నారని భావిస్తున్న ఇజ్రాయిల్‌, ఆ ప్రాంతం నుంచి తరలివెళ్లాల్సిందిగా అక్కడి పలస్తీనా పౌరులను కరపత్రాల ద్వారా పదే పదే హెచ్చరిస్తోంది. దాదాపు 3 లక్షల మంది ఇప్పటికే ఖాన్‌ యూనస్‌, అల్‌ మవాసీ ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే ఆ ప్రాంతాల్లో ఇప్పటికే శరణార్థులు కిక్కిరిసి ఉన్నారని.. కొత్తగా వచ్చేవారికి చోటు దొరకని పరిస్థితి ఉందని ఐక్యరాజ్యసమితి సంస్థలు, ఇతర సహాయక సంస్థలు చెబుతున్నాయి.
ఈజిప్ట్‌ ఆగ్రహం
ఇజ్రాయిల్‌`హమాస్‌ మధ్య కాల్పుల విరమణ దిశగా శాంతి ప్రయత్నాలు ఓవైపు జరుగుతుంటే రఫాపై దాడులు కొనసాగడాన్ని ఈజిప్ట్‌ తప్పుపట్టింది. ఈ కవ్వింపు చర్యలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇక నుంచి గాజాకు సాయం పంపబోమని కాల్పుల విరమణ చర్చల్లో కీలక భూమిక వహిస్తున్న ఈజిప్ట్‌ తెలిపింది. ఈజిప్టు, గాజా సరిహద్దుల్లోని కీలక రఫా క్రాసింగ్‌ను ఇటీవల ఐడీఎఫ్‌ ట్యాంకు దళాలు ఆక్రమించిన సంగతి విదితమే. కాల్పుల విరమణకు అనేక షరతులు పెడుతున్న ఇజ్రాయిల్‌.. అమెరికా సూచిస్తున్న యుద్ధానంతర ప్రణాళికలనూ తిరస్కరిస్తోంది. వెస్ట్‌బ్యాంకును పాలిస్తున్న పలస్తీనా అథారిటీకే గాజా పగ్గాలను అప్పగించాలన్నది అమెరికా ప్రతిపాదన. అరబ్‌, ఇతర ముస్లిం దేశాల సాయంతో గాజాను పునర్నిర్మించాలన్న ఆలోచనలో ఉంది. ఇజ్రాయిల్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా సూచన ఆమోదిస్తే పాలస్తీనా స్వతంత్రదేశంగా ఆవిర్భవిస్తుందన్న భయం ఇజ్రాయిల్‌ను వెంటాడుతోంది.
బైడెన్‌పై వ్యతిరేకత
కొన్ని రకాల ఆయుధాలను ఇజ్రాయిల్‌కు పంపించకుండా నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీసుకొన్న నిర్ణయాన్ని స్వపక్ష రిపబ్లికన్లు, విపక్ష డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్‌ సెనెటర్‌ లిండ్సె గ్రాహం స్పందిస్తూ అమెరికా-ఇజ్రాయిల్‌ సంబంధాల్లో బైడెన్‌ నిర్ణయం అత్యంత దారుణమైందిగా పేర్కొన్నారు. ఆయుధ సరఫరాను కొనసాగిస్తూ.. ఇజ్రాయిల్‌కు అండగా ఉండాలని పేర్కొన్నారు. అదే పార్టీకి చెందిన మరో సెనెటర్‌ రిక్‌స్కాట్‌ స్పందిస్తూ… ఈ నిర్ణయం ద్వారా బైడెన్‌ హమాస్‌ మద్దతు బృందంలో చేరిపోయారని వ్యాఖ్యానించారు.
ఇక డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన 26 మంది ప్రతినిధులు జోబైడెన్‌కు ఓ లేఖ రాశారు. ‘‘ఆయుధ సరఫరా నిలిపి హమాస్‌, ఇరాన్‌ మద్దతున్న బృందాలకు బైడెన్‌ నిర్ణయం ఓ సందేశం పంపింది. దీనిపై మేం ఆందోళనగా ఉన్నాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. రఫాపై దాడిని వ్యతిరేకిస్తూ ఇజ్రాయిల్‌కు గత వారం 2000 పౌండ్ల బరువైన 1800, 500 పౌండ్ల బరువైన 1700 బాంబుల సరఫరాను అమెరికా నిలిపివేసిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img