Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

తిరుపతిలో అందరూ వైసీపీ అభ్యర్థులే

. ఓటర్లు ఆలోచించి తీర్పు ఇవ్వాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ్ఞప్తి

విశాలాంధ్ర-తిరుపతి : తిరుపతిలో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ వైసీపీకి చెందిన వారేనని, ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి తీర్పు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమి తరపున సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.మురళిని గెలిపించాలని కోరుతూ తిరుపతిలో శనివారం భారీ రోడ్‌ షో నిర్వహించారు. మొదట బాలాజీ కాలనీలోని జ్యోతిరావ్‌ ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాలాజీ కాలనీ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు, నాలుగు కాళ్ల మండపం, తిలక్‌ రోడ్డు మీదుగా పాత మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వరకు రోడ్డు షో నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న అభినయ్‌ రెడ్డి (వైసీపీ), ఆరణి శ్రీనివాసులు (జనసేన)… పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న మద్దిల గురుమూర్తి (వైసీపీ), వి.వరప్రసాదరావు (బీజేపీ)…ఈ నలుగురూ వైసీపీకి చెందిన వారేనన్నారు. వైసీపీలో బాగా డబ్బు సంపాదించు కుని ఆరణి శ్రీనివాసులు జనసేన తరపున, వరప్రసాద రావు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారన్నారు. వీరి నలుగురిలో ఎవరు గెలిచినా బీజేపీకి మద్దతుగా నిలుస్తారని రామకృష్ణ చెప్పారు. అందుకే తిరుపతి ఓటర్లు ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరారు. శ్రామికవర్గం కోసం పని చేసే ఇండియా కూటమి అభ్యర్థులు పి.మురళి, డాక్టర్‌ చింతామోహన్‌ను గెలిపించాలని రామకృష్ణ విజ్పప్తి చేశారు. తిరుపతిలో ఓటుకు రూ.5 వేలతో కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారన్నారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌కు రూ.6 వేలతో కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జనసేన, వైసీపీ ఓట్లు కొనుగోలు చేస్తూ ఎన్నికలను వ్యాపారమయం చేస్తున్నాయని రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయన్నారు. డబ్బు ఉన్న వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ప్రధాన పార్టీలు కూడా వారికే టికెట్లు ఇస్తున్నాయని చెప్పారు. సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు.
నరేంద్రమోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబానీ, అదానీలకు ఊడిగం చేస్తున్నారని, కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. ఎన్నికల బాండ్ల రూపంలో వేలకోట్లు తీసుకొని…కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నారన్నారు. ప్రధాని మత ప్రాతిపదికన ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. అందుకే ప్రజలందరూ ఆలోచించాలని ఆయన కోరారు. దేశాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా 28 రాజకీయ పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయన్నారు. దేశ భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఇండియా కూటమికి అండగా నిలవాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని రామకృష్ణ అన్నారు.
ఈ ఎన్నికల్లో ఓటర్లు జగన్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, రవీంద్రనాథ్‌, రాష్ట్ర సమితి సభ్యులు టి.జనార్దన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, చిన్ని రాజ్‌, సుధాకర్‌ రెడ్డి, ప్రభాకర్‌, నదియా, చలపతి, రవి, శశి, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు, నాయకులు సుబ్రమణ్యం, లక్ష్మి, వేణు, బాలసుబ్రమణ్యం, కాంగ్రెస్‌ నాయకులు గోపాల్‌ రెడ్డి, నరసింహులు, జిలానీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img