Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

సీపీఐ ప్రచార హోరు

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: రాష్ట్రంలో సీపీఐ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మిగిలిన రాజకీయపార్టీలకు పూర్తి భిన్నంగా స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలతో ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం కోలాహలంగా సాగుతోంది. సీపీఐ అభ్యర్థులను సీపీఎం, కాంగ్రెస్‌ బలపరుస్తుండగా, మిగిలిన వామపక్ష పార్టీలు కూడా వారు పోటీ చేయని స్థానాల్లో వీరికి మద్దతు తెలియజేస్తున్నారు. ఇండియా కూటమికి చెందిన మూడు పార్టీల ప్రజాసంఘాలతోపాటు దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘాలుగా విరాజిల్లుతున్న ఏఐటీయూసీ, సీఐటీయూ అనుబంధ సంఘాల శ్రేణులు సీపీఐ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దళాలుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తున్నారు. బూర్జువా పార్టీలు రోజువారీ కూలీ చెల్లించి, ఎన్నికల ప్రచారం చేపడుతుండగా సీపీఐ అభ్యర్థుల ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. కంకి కొడవలి ఎన్నికల గుర్తు, సీపీఐ జెండాలు చేతబూని పార్టీ, అనుబంధ సంఘాల శ్రేణులు అభ్యర్థుల వెంట పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల పాటలు, డప్పుల నృత్యాలు వీరి ప్రచారానికి ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో సీపీఐ అభ్యర్థుల ప్రచారశైలి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గేయాలతో ఓటర్లను ఆకట్టుకుంటుండగా, మరోవైపు ప్రచారంలో పాల్గొనే పార్టీ, అనుబంధ సంఘాల శ్రేణుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఇండియా కూటమి ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐ రాష్ట్రంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంతోపాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తోంది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి జంగాల అజయ్‌ కుమార్‌ పోటీ చేస్తుండగా, విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి అత్తిలి విమల, ఏలూరు అసెంబ్లీకి బండి వెంకటేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జి.కోటేశ్వరరావు, అనంతపురం అర్బన్‌కు సి.జాఫర్‌, తిరుపతికి పి.మురళి, రాజంపేటకు బుక్కే విశ్వనాథనాయక్‌, పత్తికొండ నుంచి పి.రామచంద్రయ్య, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి గాలి చంద్ర పోటీ చేస్తున్నారు. నియంతల పాలన నుండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాలని, లౌకిక రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, అభివృద్ధి, సంక్షేమం కోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ అభ్యర్థుల తరపున సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకులు సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఇప్పటికే గుంటూరు పార్లమెంటుతో పాటు మిగిలిన 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా, ఈనెల 10వ తేదీన విజయవాడలో ఉభయ కమ్యూనిస్టులు నిర్వహించే భారీ బహిరంగసభకు సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి విచ్చేస్తున్నారు.
బీజేపీ,దానికి వంతపాడే
పార్టీలపై ఓటర్లలో చైతన్యం
నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, నియంతృత్వ విధానాలపై, దానికి వంతపాడుతున్న రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ వైఖరిపై సీపీఐ అభ్యర్థులు, నేతలు ఓటర్లలో చైతన్యం కల్గిస్తున్నారు. అధికార దాహంతో కుర్చీ కోసం పాకులాడటమే తప్ప రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రగతి గురించి వైసీపీ, టీడీపీలకు పట్టడం లేదని ప్రజలకు వివరిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. కేంద్రంలో రెండు దఫాలు అధికారం చేపట్టిన బీజేపీ…ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేకపోయింది. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసింది. దేశంలో 60 ఏళ్ల కాలంలో మొత్తం 14 మంది ప్రధానమంత్రులు తమ హయాంలో రూ.55 లక్షల కోట్లు అప్పులు చేస్తే…మోదీ ఈ పదేళ్లలోనే వాటికి మూడిరతలు అదనంగా అప్పులు చేసి రూ.205 లక్షల కోట్లకు చేర్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్‌ ధర గతం కంటే తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచారు. గ్యాస్‌ ధరలు మూడిరతలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలైతే ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు జీఎస్టీ ప్రవేశపెట్టి నిలువుదోపీడీ చేస్తున్నారు. వ్యవసాయరంగాన్ని కోలుకోలేని విధంగా ఊబిలోకి నెట్టారు. విగ్రహాలు కట్టడం, కుల, మత విద్వేషాలు పెంచి ప్రజల మధ్య చిచ్చురేపడం మినహా కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధికి చేసిన ఒక్క మంచి పని కూడా లేదు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలతో పాటు ఎన్నికల కమిషన్‌, న్యాయవ్యవస్థలను కూడా గుప్పెట్లో పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష పార్టీ నేతలపై ఈ సంస్థలను ప్రయోగించి అక్రమ కేసులు బనాయిస్తూ, హిట్లర్‌ లాంటి నియంతలను మరిపించేలా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ భారత రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. విభజన చట్టాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన మోదీ… దాని విధ్వంసానికి పరోక్షంగా సహకరించారు. ఇటువంటి మోదీ నియంతృత్వ ప్రభుత్వానికి రాష్ట్రంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ, జనసేన మద్దతునిస్తున్నాయన్న విషయాన్ని ఓటర్లు అర్థం చేసుకోవాలని కోరుతూ… జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చైతన్యపరుస్తున్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తున్నారు. గత ఐదేళ్లుగా అసెంబ్లీలో ఉన్న వైసీపీ, టీడీపీ పరస్పర దూషణలకు పాల్పడడం తప్ప, ఏ ఒక్క ప్రజా సమస్యపై చర్చించని విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వ్యాపారులు ప్రవేశించారని, దీంతో వారికి సొంత ప్రయోజనాలు తప్ప, ప్రజా సమస్యలు పట్టవన్న సంగతిని గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల నుంచి అపూర్వ స్పందన
సీపీఐ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించే సమయంలో చేతిలో వైసీపీ, టీడీపీ జెండాలు పట్టుకున్నవారు కూడా పిడికిలి బిగించి వారికి నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారు. కొందరు ఆప్యాయంగా హత్తుకుంటూ మీరు గెలవాలని ఆశీర్వదిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు బలపడాలని, అప్పుడే సామాన్యులకు, పేదలకు మేలు జరుగుతుందని ఉద్వేగభరితంగా చెపుతున్నారు. బూర్జువా పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో పోటీ పడుతూ సంక్షేమ పథకాలు పొందుపరుస్తున్నాయంటే… దానికి కారణం కమ్యూనిస్టుల పోరాటాలేనని వారు అంగీకరిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేల పెన్షన్‌ ఇస్తామని కూటమి హామీ ఇవ్వడానికి కమ్యూనిస్టుల ఉద్యమాలే కారణంగా వారు ఉదహరిస్తున్నారు. ఇతరత్రా అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకం అమల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ కృషిని మేం మరువలేమని వారు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు, ఇంక్రిమెంట్లు, మిగిలిన సౌకర్యాలు రావడానికి, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు, అంగన్‌వాడీ, ఆశా, ఆర్టీసీ, మధ్యాహ్నభోజనం తదితర అనేక సంస్థల్లో సిబ్బందికి జీతాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర అనేక సౌకర్యాల కల్పనకు సీపీఐ, సీపీఎం పోరాటాలే కారణమంటున్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు తప్పకుండా ఉండాలని, అప్పుడే రాజకీయాల్లో విలువలు పెరుగుతాయని ఆకాంక్షిస్తున్నారు. గతంలో కమ్యూనిస్టులకు ఓటు వేయాలంటే ఎలాగూ గెలవరని, ఓటు వృధా అవుతుందని భావించేవారమని, ఈసారి మాత్రం కమ్యూనిస్టులను ఎట్టిపరిస్థితుల్లో చట్టసభలకు పంపాలని నిర్ణయించుకున్నామని వివిధ వర్గాల ప్రజలు బహిరంగంగానే చెపుతున్నారు. సీపీఐ అభ్యర్థులకు ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తూ వారి గెలుపుకోసం సహకారం అందిస్తున్నారు. సీపీఐ అభ్యర్థులు వీధుల్లోకి ప్రచారానికి వచ్చినప్పుడు రాజకీయపార్టీల కతీతంగా కొందరు మంచినీరు, నిమ్మరసం, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తూ ప్రోత్సహించడమే ప్రజాస్పందనకు నిదర్శనంగా పేర్కొనవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img