Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

పొట్టనింపుకునేందుకే…ఎన్నికల ప్రచారంలో దినసరి కూలీలు


మండుటెండలో అగచాట్లు

మండుటెండలతో కార్మికులకు పనులు లేకుండా పోయాయి. దీంతో దినసరి కూలీలకు పూట గడవడం కష్టంగా మారింది. ఈలోగా ఎన్నికలు రానే వచ్చాయి. దీంతో ఓ విధంగా ఆకలి తీర్చుకునేందుకు మార్గం లభించినట్లు అయ్యింది. వడగాడ్పులను, ఉక్కుపోతను, ఎండను బేఖాతరు చేస్తూ పార్టీల తరపున ఎన్నికల ప్రచారాన్ని రోజువారీ కూలీలు నిర్వహిస్తున్నారు. రోజుకు రూ.50 లేక రూ.100… కొన్నిసార్లు కాస్త ఎక్కువగా సంపాదన ఉండటం, భోజనం లభిస్తుండటంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తమ పిల్లలను చంకనేసుకొని ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఆయా పార్టీల జెండాలు మోస్తూ, నినాదాలు ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు సూర్యుడు నడినెత్తికి రాకముందు ప్రచారాన్ని ముగించుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు. సాయంత్రం కాస్త చల్లబడ్డాక బయటకు వచ్చి రాత్రి పొద్దుపోయే వరకు ప్రచారం చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 10.30 వరకు… మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 వరకు ఇంటింటి ప్రచారం, ర్యాలీలు జరుగుతున్నాయి. దీంతో అభ్యర్థుల వెంట నడిస్తే రోజుకు రూ.100 నుంచి రూ.500 వరకు కార్మికులు పొందుతున్నారు.
‘మావి రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి. వేసవిలో పనులు ఉండవు. మూహూర్తాలు లేక పెళ్ళిళ్లు, గృహ ప్రవేశాలు జరగవు. నిర్మాణాలు నిలిచిపోతాయి. పూట గడవడం కష్టమవుతుంది. కాబట్టి గత్యంతరం లేక ఎండలోనే ప్రచారానికి వెళుతున్నాం. రోజు రూ.500 వరకు వస్తాయి. మా పిల్లల కడుపు నింపగలుగుతున్నాం. ఇందుకోసం ఎన్నికలకు, అభ్యర్థులకు కృతజ్ఞులం’ అని దినసరి కార్మికులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మహిళలకు డిమాండ్‌ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమ కోసం ప్రచారం చేయాలని అభ్యర్థులు కోరుకుంటారు. నేతలతో పాటు ప్రచారంలో పాల్గొనేందుకు మహిళలు రావాలంటూ మధ్యవర్తులు కోరుతారు. కొన్ని ప్రాంతాల్లో రోజుకు రూ.800 చొప్పున అభ్యర్థులు చెల్లిస్తారని కార్మికులు తెలిపారు.
ప్రచారంలో పాల్గొనడం వల్ల కొద్దిరోజుల్లో రూ.12వేలు ఆర్జించినట్లు మచిలీపట్నానికి చెందిన కార్మికురాలు రాజమ్మ వెల్లడిరచారు. భీమవరంలో ప్రచారర్యాలీలో పాల్గొన్న పెయింటర్‌ పి.రాజేశ్‌ మాట్లాడుతూ ‘పొలం పనుల కోసం యంత్రాలు వినియోగమవుతున్నాయి కాబట్టి వ్యవసాయ కూలీలకు పనుల్లేవు. వేసవిలో పెయింటర్లు, ప్లంబర్లు, కార్పొంటర్లు, ఎలక్ట్రీషియన్లు తదితర అసంఘటిత రంగంలోనూ పనులు దొరకవు. కాబట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా’ అని తెలిపారు. కృష్ణాజిల్లా, గుడివాడలో మేస్త్రిగా పనిచేసే కందుల రాఘవ రావు మాట్లాడుతూ ‘ప్రతి కాలనీ నుంచి ఎన్నికల ప్రచారానికి వచ్చే వ్యక్తుల జాబితాను మధ్యవర్తులు సిద్ధం చేస్తారు. ఉదయం పూట ప్రచారానికి వెళితే రూ.200, అల్పాహారం ఇస్తారు. అదే రోజంతా ప్రచారంలో పాల్గొంటే రూ.500, రాత్రి భోజనం ఇస్తారు’ అని వెల్లడిరచారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే రోజుకు రూ.1500 వస్తాయని మధ్యవర్తి పి.పవన్‌ పేర్కొన్నారు. ఎండలు, వడగాడ్పుల వల్ల ఇసుర క్వారీల్లో పని ఆపేస్తారని, కేటరింగ్‌, నిర్మాణ పనులు చేసేవారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉన్నదన్నారు. వారి కుటుంబాలను ఎన్నికల ప్రచారం ఆదుకుంటోందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివేడు గ్రామంలో వ్యవసాయ కూలి బుజ్జి మాట్లాడుతూ పిల్లలను వెంట తీసుకెళితే రూ.100 అదనంగా వస్తాయన్నారు.
‘మేము పార్టీ జెండాలు మోయాలి, నినాదాలు ఇవ్వాలి, కరపత్రాలు పంపిణీ చేయాలని, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి’ అని తాము చేసే పనిని వివరించారు. వలస కార్మికుడు లక్ష్మణ రావు ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వల్ల రోజుకు రూ.800 వరకు సంపాదిస్తున్నారు. ‘పని కోసం భార్యతో కలిసి పక్క జిల్లాలకు వలస వెళుతుంటాను. ఇప్పుడు నిర్మాణ పనులు లేవు కాబట్టి కుటుంబాన్ని పోషించుకునేందుకు పార్టీల తరపున ప్రచారం చేస్తున్నా’ అని ఒంగోలుకు చెందిన ఆయనన్నారు. ఆక్వా రంగ కార్మికులు సైతం ఈసారి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఉండి, కోరుకొల్లు, కల్లా, కాలిదిండి తదితర పశ్చిమ గోదావరి, ఏలూరు, ఇతర జిల్లాల కార్మికులంతా పార్టీల తరపు ప్రచారం చేస్తూ తమ కుటుంబాలను పోషించుకోగలుగుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img