విశాలాంధ్ర – ఏలూరు : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, అటువంటి కార్యకర్తలకు బడేటి కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ ఎంపీ, మాజీ మంత్రి మాగంటి బాబు పేర్కొన్నారు.
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సూచించారు.
స్థానిక పవర్ పేట లోని టి.డి.పి కార్యాలయంలో బుధవారం బడేటి బుజ్జి 59వ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి విగ్రహానికి ఆయన సోదరుడు, టిడిపి ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మాజీ ఎంపీ మాగంటి బాబు, ఇతర నాయకులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. అనంతరం మాగంటి బాబు మాట్లాడుతూ కష్టంలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఏకైక నినాదంతో బడేటి బుజ్జి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారన్నారు. బుజ్జి చూపిన మార్గంలో నడుస్తూ సోదరుడు చంటి గడిచిన నాలుగేళ్ల కాలంలో ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మడమ తిప్పని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బడేటి చంటి ఘన విజయం సాధించడం తద్యమని పేర్కొన్నారు. టి.డి.పి ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి మాట్లాడుతూ ఉదయం గం. 5 గంటల నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని తక్షణం పరిష్కరించిన ఏకైక నాయకుడు బడేటి బుజ్జి అని అన్నారు. ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన బడేటి బుజ్జి ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని చెప్పారు. ప్రజలకు ఎమ్మెల్యే ఎలా ఉండాలో చూపించింది తన అన్న బడేటి బుజ్జి అని, తాను కూడా ఆయనలాగే మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను అని, తనను ఆశీర్వదించాలని కోరారు. వేలాదిమంది కార్మికులకు జీవన మరణ సమస్యగా మారిన ఏలూరు జూట్ మిల్ సమస్యను పరిష్కరించేందుకు తన వంతు సహాయం చేశానని, కార్మికులకు న్యాయం జరిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. కాగా ఏలూరు లోని 50 డివిజన్ల పరిధిలో దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు, క్లస్టర్ ఇంచార్జ్ లు, డివిజన్ ఇంచార్జ్ లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బడేటి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.