Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

అలసత్వం వద్దు

. అధికారం అహంకారం కాదు…
. పార్టీ కార్యాలయానికి రావడాన్ని మంత్రులు సేవగా భావించాలి
. పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశనం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అధికారంలోకి వచ్చేశామన్న అలసత్వాన్ని విడనాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన శనివారం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ రావడం సేవగా భావించాలని, రోజూ కనీసం ఇద్దరు మంత్రులైనా వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కోరారు. వారిని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్‌ ఇన్‌ఛార్జులు తీసుకోవాలని, ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని మంత్రులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుతో పాటు ఇందుకోసం ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. పార్టీ నేతలెవరూ వ్యక్తిగత దాడులు, కక్ష సాధింపులకు దిగొద్దు అని హెచ్చరించారు. వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే, వారికీ మనకు తేడా ఉండదని, తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలపై నమోదయిన అక్రమ కేసులను సీఎం ఆరా తీశారు. చట్టపరంగానే వారికి ఎలా విముక్తి కలిగించాలన్న దానిపై చర్చించారు. తమ పరిధిలో నమోదయిన కేసుల వివరాలు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు తక్షణమే కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. సమర్థులందరికీ నామినేటెడ్‌ పదవులు దక్కుతాయని పార్టీ విజయం కోసం కృషి చేసిన నేతలకు మరోసారి భరోసా ఇచ్చారు. దీనికి ముందుగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు.
పాపకు రూ.16 కోట్ల ఇంజక్షన్‌ కోసం సాయం కోరిన బాధితులు
గుంటూరుకు చెందిన వెచ్చా ప్రీతమ్‌ దంపతులు తమ పాప హితైషీను తీసుకువచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఏడాది వయసున్న హితైషీ తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. స్పైనల్‌ మసక్యులర్‌ అట్రోఫీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాపకు చికిత్స కోసం వారు ముఖ్యమంత్రిని కలిశారు. పాపకు ఉన్న జబ్బు నయం కావాలి అంటే ‘జోల్‌జెన్స్‌మా’ అనే ఇంజక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ధర రూ.16 కోట్లు కావడంతో తల్లిదండ్రులు సాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నిధుల సమీకరణ కార్యక్రమం కూడా చేపట్టారు. మరో నెల రోజుల్లో ఈ చికిత్స అందించాల్సి ఉందని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తెలియజేయగా, దీనిపై వెంటనే పరిశీలన జరుపుతామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
కాళ్లకు దండం పెట్టే విధానం విడనాడండి : చంద్రబాబు వినతి
ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కారం చేసే పని చేయవద్దని సీఎం చంద్రబాబు కోరారు. ప్రజలతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా కొందరు నేతలు కాళ్లపై పడి నమస్కరించడానికి ప్రయత్నించడంతో సీఎం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దీనిపై చంద్రబాబు బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఎంత వారిస్తున్నా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కాళ్లకు నమస్కారాలు చేస్తున్నారని, ఇకపై ఇలా చేయవద్దని కోరారు. ఆత్మగౌరవంతో అంతా నడుచుకోవాలని, కాళ్లకు మొక్కే సంస్కృతి మంచి విధానం కాదని చంద్రబాబు తెలిపారు.
త్వరలో అన్నా క్యాంటీన్‌లు ప్రారంభం
ధర్మాన్ని కాపాడటానికి విశ్వాసాన్ని కలిగించే ధార్మిక సంస్థలు ఉండటం అందరి అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. తాడేపల్లి సమీపంలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అనంత శేషస్థాపన కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరేకృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రతిష్టాత్మక నిర్మాణం జరుగుతోంది. 216 అడుగల ఎత్తున్న ప్రధాన గోపురంతో వెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మిస్తున్నారు. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు.
మధుపండిత్‌ దాస్‌ నేతృత్వంలో గతంలో అన్నా క్యాంటీన్‌లకు భోజన సరఫరా చేశారు. భోజన నాణ్యతలో ఒక్క చిన్న ఫిర్యాదు లేకుండా 203 అన్నా క్యాంటీన్లు నాడు నిర్వహించాం. కానీ గత ప్రభుత్వం వాటిని మూసేసింది. త్వరలోనే అన్నా క్యాంటీన్లు పున: ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మంచికి వచ్చే ఐదేళ్లు స్పీడ్‌ బ్రేకర్లు ఉండవు… మంచి చేసే వారికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img