Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ఆంధ్రాలో హంగ్‌ తప్పదు

సీపీఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర` విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంత మెజార్టీ రాదని, హంగ్‌ వచ్చే అవకాశం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు, జగన్‌లు ముఖ్యమంత్రిగా ఉండరని, బీజేపీ అనుకూల ప్రభుత్వానికి ద్వారపాలకులుగా ఉంటారన్నారు. విజయవాడ దాసరి భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ మహారాష్ట్రలో శరద్‌ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ, శివసేన వంటి బలమైన పార్టీలను చీల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా షిండేలు ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పని చేస్తోందన్నారు. రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఇండియా కూటమిని బలపర్చాలని కోరారు. ఇటీవల ప్రధాని మోదీ మొదటిసారి జగన్‌ ప్రభుత్వమంతా అవినీతిమయం అంటూ, అభివృద్ధి లేదంటూ చిలకపలుకులు పలికారన్నారు. ఏపీలో ల్యాండ్‌ మాఫియా, మైన్స్‌ మాఫియా అని విమర్శలు చేశారన్నారు. తరువాత జగన్‌, బొత్స సత్యనారాయణ… దిల్లీ పెద్దలు అంతా అవినీతిపరులంటూ ప్రతి విమర్శలు చేస్తున్నారని నారాయణ అన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినట్లుగా ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి అధారాలు లేకుండా ఆరోపణలు చేయరని తెలిపారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే, నాభి నుంచి వచ్చిన మాటలైతే 45 వేల కోట్ల రూపాయల అవినీతి చేసిన జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలని, నాలుక నుంచి వచ్చిన మాటలైతే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నారాయణ డిమాండ్‌ చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కరపత్రాల కంటే ఎక్కువగా కరెన్సీ నోట్లు పంచుతున్నారని చెప్పారు. రోజుకి కోటీ 30 లక్షల రూపాయల పంపిణీ జరుగుతుందన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గించటానికి పెద్ద నోట్లు రద్దు చేశామని మోదీ చెప్పిన మాటలు అబద్ధాలన్నారు. నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవటానికి నోట్ల రద్దు ఉపయోగపడిరదన్నారు. ఇప్పుడు ఓటుకు 10 వేల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. 2016లో విజయ్‌ మాల్యా విదేశాలకు వెళ్లటానికి ముందు రోజు తనపై ఉన్న లుక్‌అవుట్‌ నోటీసులను ఉపసంహరించుకోవటానికి రూ.35 కోట్లు బీజేపీకి చెక్కు రూపంలో పార్టీ ఫండ్‌ ఇచ్చాడని విమర్శించారు. అలాగే ఇటీవల నీరవ్‌ మోదీ లండన్‌ కోర్టులో తన వాదన వినిపిస్తూ తాను 11 వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది నిజమని… వాటిల్లో తాను 30 శాతం మాత్రమే తీసుకుని మిగిలింది ప్రధాని మోదీ వాళ్లకు ఇచ్చేసినట్లు చెప్పాడన్నారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే విదేశాల్లో ఉన్న అవినీతిపరులను వెనక్కు తీసుకురావాలన్నారు. అవినీతికి పాల్పడి విదేశాలకు వెళ్లిన వారిలో ముస్లింలు, ఇతర మైనార్టీలుగానీ లేరని తెలిపారు. ఈ ఎన్నికల్లో అయోధ్య రాముడి ప్రచారం గిట్టుబాటు కాలేదని, మోదీ గ్యారెంటీ ఎక్స్‌పైరీ అయిందన్నారు. మంగళసూత్రాల గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి లేదన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి ప్రధాని మోదీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో వంద కోట్ల అవినీతి చేసిన వారిని అరెస్టు చేసి జైలులో పెడుతున్నారని, రూ.45 వేల కోట్ల అవినీతి చేసిన వారిని బెయిల్‌పై బయట ఉంచుతున్నారని, రూ.15 లక్షల కోట్ల అవినీతి చేసిన వారు విదేశాల్లో హాయిగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా బెదిరిస్తున్నారని విమర్శించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులపై, సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టేవారిపై దిల్లీ పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నియంత్రణలో ఉండే దిల్లీ పోలీసులతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ను జైలులో పెట్టారని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారని చెప్పారు. ప్రపంచంలో ముడి చమురు ధరలు తగ్గినా మన దేశంలో పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. దేశ సంపదను కార్పొరేట్‌లకు దోచిపెడుతున్నారని గ్రహించటంతో ప్రజల్లో మోదీపై వ్యతిరేకత ప్రారంభమైయిందన్నారు. ఇక ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌ ఈ చట్టానికి గతంలో చంద్రబాబు. పయ్యావుల కేశవ్‌లు మద్దతు ఇచ్చారని, ఇప్పుడు విమర్శిస్తున్నారని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమరావతి రాజధాని, భూ సేకరణకు సంబంధించి ఆనాడు ప్రతిపక్ష నేతగా మద్దతు ఇచ్చి తరువాత జగన్‌ విమర్శించటం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ దొంగలేనని నారాయణ విమర్శించారు. మహిళలను గౌరవంగా చూసుకోవాలని తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చెప్పారంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. సొంత తల్లి జగన్‌ అరాచకాలను చూడలేక విదేశాలకు వెళ్లిందని, ఇక బాబాయిని చంపిన అవినాశ్‌ రెడ్డిని జగన్‌ కాపాడుతున్నారని, తనను అవమానిస్తున్నారని చెల్లెళ్లు బహిరంగంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీకి జగన్‌ పరోక్షంగా మద్దతు ఇస్తుంటే, చంద్రబాబు ఏకంగా మోదీకి భజన చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన కేసీఆర్‌ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని, అలాగే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకువచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి ఓడిపోతారని తెలిపారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ దుష్ఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తూ తాను గత డిసెంబరులో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారిందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, కేవీవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.
ఈసీకి నారాయణ లేఖ
ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రిగా మోదీ, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వీటిపై ఎన్నికల సంఘం తగిన సూచనలు చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ బుధవారం లేఖ రాశారు. విమానాలు, హెలికాప్టర్లు, ప్రభుత్వం యంత్రాంగం, పోలీసు యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. భద్రత పేరుతో పూర్తిస్థాయిలో హంగు, ఆర్భాటాలు చేస్తున్నారని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జగన్‌ ప్రచారానికి వెళితే ఆ ప్రాంతంలో చెట్లు నరికేస్తున్నారని పేర్కొన్నారు. ప్రచారం చేసుకోవచ్చుగానీ ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదన్నారు. తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి ప్రధాని, ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి సంబంధించి అవసరమైన సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img