Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆప్‌ సోషల్‌మీడియా ప్రచారం ఉధృతం

రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు మద్దతివ్వాలని వినతి

న్యూదిల్లీ: దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సోమవారం సోషల్‌ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. దిల్లీ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నాయకురాలు అతిశి సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోషల్‌ మీడియా ‘డీపీ’ (డిస్ప్లే పిక్చర్‌) ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆప్‌ నాయకులు, వలంటీర్లు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా ఖాతాలలో వారి ప్రొఫైల్‌ చిత్రాన్ని మార్చుకుంటారని ప్రకటించారు. కొత్త చిత్రం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ‘‘మోదీ కా సబ్సే బడా దార్‌ కేజ్రీవాల్‌’’ అనే క్యాప్షన్‌తో చూపుతుందని ఆమె తెలిపారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య పరిరక్షణను కోరుకునేవారందరూ తమ సోషల్‌ మీడియా ఖాతాల డీపీని ఈ చిత్రంతో మార్చుకోవడం ద్వారా మద్దతు తెలపాలని కోరారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని సవాల్‌ చేయగల ఏకైక నాయకుడు కేజ్రీవాల్‌ అని, అందుకే లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయనను అరెస్టు చేసిందని అతిశి పేర్కొన్నారు. వారు జరిగిందని చెబుతున్న లిక్కర్‌ కుంభకోణంపై రెండేళ్లపాటు దర్యాప్తు చేసినప్పటికీ ఈడీ ‘ఒక్క పైసా’ సాక్ష్యం కూడా సమర్పించలేకపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. బీజేపీ, మోదీ కేజ్రీవాల్‌ను అణిచివేయాలని చూస్తున్నారని, దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆప్‌ యుద్ధం చేస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడం ఒక్క కేజ్రీవాల్‌ పోరాటం మాత్రమే కాదని… పార్టీ సోషల్‌ మీడియా డీపీ ప్రచారంలో చేరాలని ఆమె ప్రజలను కోరారు. కేజ్రీవాల్‌ను గత గురువారం తన ప్రభుత్వం రద్దు చేసిన ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ అరెస్టు చేసిన సంగతి విదితమే.
హోలీకి దూరం: అతిశి
న్యూదిల్లీ: దేశమంతా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఆప్‌ నేత అతిశి కీలక ప్రకటన చేశారు. దిల్లీ మద్యం కేసులో తమ నాయకుడు కేజ్రీవాల్‌ను అన్యాయంగా ఈడీ అరెస్టు చేసిందని, ఈ కారణంగా తాము హోలీ ఆడలేకపోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. దుర్మార్గం, క్రూరత్వం, అన్యాయంపై ఆమ్‌ ఆద్మీ పార్టీలో ప్రతి నాయకుడు రేయింబవళ్లు పోరాడుతున్నారని చెప్పారు. ఈ యుద్ధంలో తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీ, దేశం కోసం మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు తొమ్మిదిసార్లు సమన్లు పంపారు. అయినా కేజ్రీవాల్‌ వాటిని పట్టించుకోలేదు. దీంతో కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు రెండు గంటల పాటు విచారణ జరిపి సీఎంను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీలో ఉంటున్నారు. ఎన్నికల కోసం ఇండియా కూటమిలో చేరిన ఆప్‌ మిత్ర పక్షాలతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ పరిణామాల నడుమ కేజ్రీవాల్‌ అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ నెల 31 ఉదయం 10 గంటలకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెగా ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు దిల్లీలోని రాంలీలా మైదానం వేదిక కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img