Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఇక సంగ్రామమే !

. గేర్‌ మార్చిన రాజకీయపార్టీల అధినేతలు
. కుప్పంలో మొదలైన చంద్రబాబు ఎన్నికల ప్రచారం
. నేటి నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి
. రేపట్నుంచి సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
. వారాహి పేరుతో పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఎన్నికల సంగ్రామానికి ఏపీలోని రాజకీయపార్టీల అధినేతలు నడుం బిగించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకున్న ప్రధాన పార్టీల నేతలు ఇక పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనకాపల్లి ఎంపీ మినహా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా… టీడీపీ 5 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. జనసేన కూడా కేవలం 3 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా…10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి సమరశంఖం పూరించారు. రాష్ట్రవ్యాప్తంగా 160 నియోజకవర్గాలకు తగ్గకుండా పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు… దానికనుగుణంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, మితిమీరిన అప్పులు, అభివృద్ధి కుంటుపడిన పరిస్థితులను చంద్రబాబు ప్రజలకు తెలియజేయడంతో పాటు టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విధ్వంసం, అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన తీరు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం, ప్రత్యేక హోదా సహా విభజన అంశాలు ఏమీ అమలు చేయలేకపోవడం వంటి విషయాలు వివరిస్తూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే వైసీపీని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి… ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సుయాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఇటీవల ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహించిన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్‌ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్‌ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. ఈ బస్సు యాత్ర ద్వారా…గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ… ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు, నాన్‌ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని 87 శాతం కుటుంబాలకు చేకూర్చామని, విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టామని, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్న తీరును వివరించనున్నారు. వైనాట్‌ 175 లక్ష్యంగా ఆయన పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న విడుదల కానున్న నేపథ్యంలో ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని, ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఇక ఈ నెల 26 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో చంద్రబాబు స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టు సందర్భంగా మనస్థాపానికి గురై మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 26న పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో, 27న పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గన్నవరం నియోజకవర్గాల్లో, 28న నూజివీడు, గుడివాడ, పెనమలూరు, 29న మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఈనెల 27 నుంచి వారాహి ఎన్నికల రథంపై తాను పోటీ చేసే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల సమరశంఖాన్ని పూరించేందుకు సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, బీజేపీలతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నామని, యువత భవిష్యత్తు కోసం సీట్లు తక్కువైనా సర్దుకుని జనసేన త్యాగాలకు సిద్ధపడిరదని, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుని ఎన్డీఏ కూటమి ఘన విజయానికి సహకరించాలని పవన్‌ కల్యాణ్‌ కోరనున్నారు. ఇలా మొత్తానికి ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు సన్నద్ధం కాగా, ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్లపై కసరత్తు నిర్వహిస్తూ… ఎన్డీఏ కూటమిని ఓడిరచేందుకు అవసరమైన ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img