Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కంటైనర్‌ కథ కంచికేనా?

. ఫర్నీచర్‌, వంటపాత్రలంటూ వైసీపీ భిన్న వాదనలు
. ప్రతిపక్షపార్టీల విమర్శలు పట్టించుకోని ప్రభుత్వం
. డిమాండ్‌ చేసినా వివరణ ఇవ్వని డీజీపీ
. ఈసీ జోక్యానికి విపక్షాల డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :విశాఖ డ్రగ్‌ కంటెయినర్‌ అంశాన్ని మరువకముందే తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో మరో కంటైనర్‌ అనుమానాస్పద స్థితిలో కనిపించటం రాష్ట్రంలో పెద్ద వివాదాస్పద అంశమైంది. దీనిపై ప్రతిపక్ష పార్టీలన్నీ విచారణ కోరినప్పటికీ అధికారయంత్రాంగం కనీసం వివరణ ఇవ్వకపోవడం, వైసీపీ నేతలు భిన్న వ్యాఖ్యానాలు చేయడం అనేక అనుమానాలకు దారితీసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పరిసరాల్లోకి వెళ్లాలంటే అనుమతి లేకుండా కాలు మోపడం కూడా అసాధ్యమన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది ఎన్నికల సమయంలో ఒక భారీ కంటైనర్‌ సీఎం బంగ్లా సమీపంలోకి వెళ్లి బైటకు రావడం, అది ఎందుకు వచ్చిందో పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వకుండా గోప్యత పాటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీల నేతల వాహనాలను రోజూ తనిఖీ చేస్తున్న ఎన్నికల సంఘం సైతం దీనిపై నోరుమెదకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రేణిగుంటలో కుక్కర్లు, మిక్సీలు, వాచీలు వంటి తాయిళాలతో ఉన్న అధికార పార్టీకి చెందిన డంప్‌ బయటపడిన 24 గంటల్లోనే సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కంటైనర్‌ వ్యవహారం బయటకు పొక్కడంతో కచ్చితంగా ఇది కరెన్సీ నోట్ల కట్టలకు సంబంధించిన కంటైనర్‌ అయి ఉంటుందని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే దీనిపై వైసీపీ నేతలు చేసిన భిన్న వ్యాఖ్యానాలు ప్రజల్లో ఉన్న అనుమానాలను మరింత పెంచాయి. సీఎం జగన్‌ బస్సు యాత్రకు సంబంధించి వంట పాత్రలు, ఇతర సామగ్రి కంటైనర్‌లో వచ్చినట్లు కొందరు వ్యాఖ్యానించగా, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి ఆ కంటైనర్‌లో ఫర్నీచర్‌ వచ్చిందని మరో కథ వినిపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కంటైనర్‌ క్యాంపు కార్యాలయానికి వచ్చి గంట తర్వాత వెళ్లాల్సిన మార్గంలో కాకుండా మరో రూటులో వెళ్లడం, రెండో చెక్‌ పోస్టు వద్ద ఉండే ఆటోమేటిక్‌ స్కానర్‌ నుంచి కాకుండా వేరే రూటులో కంటైనర్‌ను పంపడం, భద్రతా సిబ్బంది రికార్డుల్లో వాహన వివరాలు నమోదు చేయకపోవడం, పోలీస్‌ సిబ్బంది సైతం వాహనాన్ని తనిఖీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. దీనిపై డీజీపీ తక్షణమే వివరణ ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. తన కాన్వాయ్‌ను రోజూ తనిఖీ చేస్తున్న పోలీసులు ఈ కంటైనర్‌ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. అసలు ఈ కంటైనర్‌లో ఏముందో, సీఎం క్యాంపు కార్యాలయానికి ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మాట్లాడుతూ జగన్‌ రెడ్డి ఐదేళ్ల పాటు ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్రచందనంలో బొక్కిన వేల కోట్ల సొమ్మంతా ఏపీ 16 జెడ్‌ 0363 నెంబరు వాహనంతో ఉన్న కంటెయినర్‌లో తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసు నుంచి బయటకి వెళ్లిందని ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి వెళ్లిన ఈ కంటైనర్‌ విజయవాడ బస్టాండ్‌ ఎన్టీఆర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ ముందు ఆగింది. దానిలో నుంచి కరెన్సీ కట్టలతో నిండిన అట్టపెట్టెలు దింపి డిపో క్లర్క్‌ ఎర్నింగ్‌ అనే అధికారి చాంబర్‌లోకి తీసుకెళ్లారు. పోలీసులు, ఈసీ ఆ సీసీ ఫుటేజీలు పరిశీలించాలని, ఈ డబ్బంతా ఆర్టీసీ కార్గో వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు తరలించి ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారంటూ ఆరోపించారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తినా అధికారయంత్రాంగం దీనిపై సమాధానం చెప్పడానికి వెనుకాడడాన్ని చూస్తుంటే కంటైనర్‌ కథ కంచికేనన్న విషయం స్పష్టమవుతోంది. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలపై తీవ్ర ప్రభాశం చూపే ఈ కంటెయినర్‌ వ్యవహారంపై ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలని, విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img