Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

కేజ్రీవాల్‌ అరెస్టు అప్రజాస్వామికం

. దేశవ్యాప్తంగా ఆప్‌ ఆందోళనలు
. దిల్లీలో అతిశి, భరద్వాజ్‌ సహా అనేకమంది అరెస్టు
. మంత్రులను ఈడ్చుకెళ్లి బస్సులెక్కించిన వైనం
. హర్యానా సీఎం ఇంటి ముట్టడి ` ఉద్రిక్తత
. నిరసనకారులపై విరిగిన లాఠీలు
. జలఫిరంగుల దాడుల్లో కొందరికి గాయాలు

న్యూదిల్లీ/తిరువనంతపురం/పనాజీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు అప్రజాస్వామికమని ఆప్‌ సహా ప్రతిపక్షాలు విమర్శించాయి. భారత ప్రజాస్వామ్యం, ఫెడరలిజంపై దాడిగా వర్ణించాయి. ప్రతిపక్షమే లేని దేశాన్ని బీజేపీ కోరుకుంటోందని, అందుకే వరుస పెట్టి విపక్ష నేతలను అరెస్టు చేయిస్తోందని ఆరోపించాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయించడం మోదీ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ఠగా ఆప్‌ నాయకులు అన్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఒక కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే కొన్ని లక్షల కేజ్రీవాల్‌లు రోడ్లపైకొచ్చి తమ గళాన్ని వినిపిస్తారని హెచ్చరించారు. మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్త ఆందోళనకు ఆప్‌ పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం దిల్లీతో పాటు పంజాబ్‌, హర్యానా, కేరళ, గోవా, తమిళనాడు, జమ్మూకశ్మీర్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, అరెస్టులు జరిగాయి. భారీ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిరసనకారులపై లాఠీచార్జీలు చేశారు. జల ఫిరంగులు ప్రయోగించారు. దీంతో దిల్లీ, పంజాబ్‌`హర్యానాలో ఉద్రిక్తత నెలకొంది. దిల్లీలో ఆప్‌ మంత్రులు అతిశి, సౌరభ్‌ భరద్వాజ్‌ అధ్వర్యంలో నిరసన జరిగింది. వారిపై జల ఫిరంగులు, లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు. మంత్రులతో పాటు అనేకమంది నిరసనకారులను అరెస్టు చేశారు. ఐటీవో వద్ద మంత్రి అతిశిని ఈడ్చుకెళ్లి బస్సు ఎక్కించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల య్యాయి. బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లే మార్గం (డీడీయూ రోడ్డు) లో పారా మిలటరీని మోహరించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఐటీఓ మెట్రో స్టేషన్‌ను పోలీసులు మూసివేశారు. అటు పంజాబ్‌, హర్యానాలోనూ ఆందోళనలు జరిగాయి. బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు అనేక నగరాల్లో మార్మోగాయి. కేజ్రీవాల్‌కు పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక ఆయన అరెస్టుకు కుట్ర చేసిందని ఆప్‌ నాయకులు ఆరోపించారు. హర్యానాలోని కురక్షేత్రలో ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ సైనీ నివాసం వద్ద ధర్నా జరిగింది. ఆయన ఇంటిని ముట్టడికి నిరసనకారులు యత్నించారు. బారికేడ్లు దాటుకొని వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులపై లాఠీలు రaుళిపించారు. జల ఫిరంగులతో దాడి చేశారు. మోహాలీలో జరిగిన జలఫిరంగుల దాడిలో కొందరికి గాయాలయ్యాయి. తారన్‌ తర్న్‌ జిల్లాలో పోలీసుల దాడిలో ఆప్‌ కార్యకర్త సుఖ్‌జిందర్‌ సింగ్‌ ఎడమ కన్నుకు గాయమైంది. ‘చండీగఢ్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా, వాటిని దాటేందుకు ప్రయత్నించిన మాపై జల ఫిరంగులతో దాడి చేశారు. దీంతో నా కన్ను దెబ్బతిన్నది. పోలీసుల దాడిలో భౌతిక గాయాలయ్యాయి’ అని సింగ్‌ చప్పారు. మనిషిని జైల్లో పెట్టగలరు కానీ ఆయన ఆలోచనలను కాదని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అన్నారు. కేజ్రీవాల్‌కు ఆప్‌ వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. దిల్లీ, పంజాబ్‌లో చేసిన మంచి పనులను ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి చేయకుండా కట్టడి చేసేందుకే బీజేపీ ఆయనను అరెస్టు చేయించిందని పంజాబ్‌ మంత్రులు అమన్‌ అరోరా, మాన్‌, చేతన్‌ సింగ్‌ ఆరోపించారు.
గోవాలో ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్‌ పాలేకర్‌, ఎమ్మెల్యేలు వెన్‌జి వేగస్‌, క్రజ్‌ సిల్వాతో పాటు అనేక మంది కార్యకర్తలు కలిసి మార్గో బస్టాండ్‌ వద్ద మార్చ్‌ నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దక్షిణ గోవాలోని బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కేజ్రీవాల్‌ను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే అరెస్టు చేయించిందన్నారు. ‘ఈసారి 400కుపైగా స్థానాల్లో గెలవాలన్న కల సాకారం కాబోదని బీజేపీ గ్రహించింది కాబట్టి ప్రతిపక్షం లేకుండా చేయాలని యత్నిస్తోంది, విపక్ష గళాలను నొక్కే చర్యల్లో నిమగ్నమైంది’ అని పాలేకర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ అంతం దగ్గరల్లో ఉన్నదన్నారు. ఆందో ళనలను విరమించవద్దని ఆప్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఘోరంగా ఓటమి పాలు కాకుండా ఉండేందుకు అపవిత్ర కూటములపై బీజేపీ ఆధారపడుతోందని విమర్శించారు. బీజేపీ ‘కల్ట్‌’గా మారిందని, గుడ్డిగా ఒకరి వెనుక ఒకరు వెళుతున్నట్లుగా ఆ పార్టీ నేతల పద్ధతి ఉన్నదని పాలేకర్‌ ఎద్దేవా చేశారు. కేరళలోనూ కాంగ్రెస, సీపీఎం, ఆప్‌ వేర్వేరుగా నిరసనలు, ప్రదర్శనలు చేపట్టాయి. కేజ్రీవాల్‌ అరెస్టు, కాంగ్రెస్‌ ఎన్నికల నిధి జప్తు భారత ప్రజాస్వామ్యం, ఫెడరలిజంపై దాడిగా ఎంపీ శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్‌కు కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆప్‌ కార్యకర్తలు కొచ్చిలో ఈడీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శనను నిర్వహించారు. తిరువనంతపురంలో రాజభవన్‌ వద్ద ధర్నా చేశారు. కన్నూర్‌లో సీపీఎం అధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మల దహనం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవిందన్‌ మాట్లాడుతూ కేజ్రీవాల్‌ అరెస్టు మునుపటి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసిందన్నారు. కేజ్రీవాల్‌ మరింత శక్తిమంతమైన నాయకుడిగా వస్తారని అన్నారు. కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు సుధాకరన్‌ మాట్లాడుతూ ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు, అసమ్మతి గళాల అణచివేతకు బీజేపీ దుర్వినియోగిస్తోందని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img