Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

జగన్‌వి శవరాజకీయాలు

కొవ్వూరు సభలో చంద్రబాబు

విశాలాంధ్ర`కొవ్వూరు:
శవ రాజకీయాలకు పెట్టింది పేరు సైకో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం పేరిట రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు గురువారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం విజయ విహార్‌ సెంటర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. 2014 ఎన్నికలలో తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకొని సానుభూతి పొందాలని చూశారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో బాబాయ్‌ శవాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో కూడా శవ రాజకీయాలను చేస్తున్నారని దుయ్యబట్టారు. తన తండ్రిని రిలయన్స్‌ సంస్థ చంపించినదని చెప్పే ఈ పెద్దమనిషి అదే సంస్థకు ఎంపీ పదవి కట్టబెట్టిన ఘనుడు చంద్రబాబు విమర్శించారు. ఈ ఎన్నికలలో మరో శవం కోసం వెతుకుతున్నాడని పేర్కొన్నారు. వైసీపీ డీఎన్‌ఏ లోనే రక్త చరిత్ర ఉందని ఈ విషయాన్ని ఇప్పుడు జగన్‌ చెల్లెళ్లే బయట పెట్టారని చెప్పారు. వలంటీర్ల వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని… కాకపోతే వారు ఏ రాజకీయ పార్టీకి వత్తాసుగా ఉండరాదన్నది తన అభిమతం అన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం జగన్‌ను గద్దె దింపడానికి తాను ఎండనక వాననక సభలు నిర్వహిస్తున్నానన్నారు. జగన్‌ పాలలో ఇసుక, మద్యం, మట్టి మాఫియా చెలరేగి పోయిందన్నారు. నాణ్యతలేని మద్యం వల్ల ఎందరో ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోయాయని… ఆ ఉసురు జగన్‌ ఊరికే వదలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకంతో ఎన్డీఏ కూటమి ముందుకు వెళుతుందని… రాబోయే రోజుల్లో దళితులకు, పేదలు, మైనార్టీ వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. మాట్లాడితే జగన్‌ తాను పేదనని… ప్రతిపక్షాలను పెత్తందారులనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌ కేసుల్లో సీబీఐ, ఈడీ కలిసి రూ.43 వేల కోట్లకు చార్జిషీటు దాఖలు చేశాయన్నారు. దీన్నిబట్టి పేదలు ఎవరో పెత్తందారులు ఎవరు తెలుస్తుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో యువతకు 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా సంపద సృష్టిస్తామన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 55 ఏళ్లకే పెన్షన్‌, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 15000 చొప్పున తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన నెల నుంచే రూ.4,000 ఫించను అందజేస్తామన్నారు. జగన్‌ సింబల్‌ ఫ్యాన్‌ ముక్కలైందని ఇప్పుడు గొడ్డలిని అతని పార్టీ సింబల్‌ గా పెట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు. గోదావరి పై ఉన్న వంతెనల దగ్గర ఇసుకను తవ్వేయండంతో గ్రామన్‌ ఇండియా బ్రిడ్జి కుంగిపోయిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. అంతకుముందు కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానిక సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్‌ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆచంట అభ్యర్థి సత్యనారాయణ, టీడీపీ సీనియర్‌ నాయకులు పెండ్యాల అచ్చి బాబు, కొవ్వూరు ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ చౌదరి రామకృష్ణ, కొవ్వూరు జనసేన ఇన్‌ఛార్జి టీవీ రామారావు, బీజేపీ రాజమండ్రి పార్లమెంట్‌ అధ్యక్షుడు పరిమి రాధ, కొవ్వూరు పట్టణ జనసేన అధ్యక్షుడు డేగల రాము, టీడీపీ పరిశీలకుడు గొర్రెల శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img