Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

దేశాన్ని కాపాడుకుందాం

విజయవాడ సభలో ఇండియా కూటమి నేతల పిలుపు

. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖడ్గే
. మోదీ దుశ్శాసన పాలన: డి.రాజా
. పదేళ్లలో అన్ని రంగాలు లూటీ: ఏచూరి

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేసిన నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించి...దేశాన్ని కాపాడుకుందామని ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్‌, పశ్చిమ, సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు జి.కోటేశ్వరరావు, సీహెచ్‌ బాబురావు విజయాన్ని కాంక్షిస్తూ జింఖానా గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఇండియా కూటమి బహిరంగసభకు ముఖ్యఅతిథిలుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, సీపీఐ, సీపీఎం ప్రధానకార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం మోదీ ప్రభత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా 28 పార్టీలతో ఏర్పాటైన ఇండియా కూటమి ఐక్యంగా పోరాడుతోందని ఉద్ఘాటించారు. మోదీ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని, అబద్ధాల కోరులకు ఆయన ఒక సర్దార్‌ అని ఖడ్గే విమర్శించారు. 2014లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని, అసలు ఏ ఒక్క హామీని ఆయన నెరవేర్చలేదన్నారు. పదేళ్లలో దేశంలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాలు, మతాల మధ్య విభజన తీసుకొచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే ఆయన నైజమని విమర్శించారు. మోదీ, బీజేపీలను ఓడిరచడం ద్వారా వారికి ఇండియా కూటమి గుణపాఠం చెప్పనుందని హెచ్చరించారు. అభివృద్ధి అంశంపై ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నదన్నారు. దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, గడచిన 10 ఏళ్ల పాలనలో మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చినట్లయితే ప్రజల సంపద దోచుకుంటారని, మహిళల మెడల్లో మంగళసూత్రాలను సైతం లాగేసుకుంటారని, మోదీ తన ఎన్నికల సభల్లో నీచమైన ఆరోపణలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. మోదీ, అమిత్‌షా ఇచ్చేవారైతే దేశ సంపదను దోచుకునేవారు అదానీ, అంబానీ అని, వారి ప్రయోజనాలు నెరవేర్చడమే మోదీ ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకి ఉన్న దార్శనికత, మోదీకి ఇసుమంతైనా లేదని ఖడ్గే విమర్శించారు. మోదీది దుశ్శాసన పాలన జగన్‌ది సింహాసన పాలన: డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు చాలా క్లిష్టతరమైనవని, వీటిపై దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందన్నారు. బీజేపీ కూటమి అభ్యర్థులను ఓడిరచి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదేళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్న మోదీ అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని విమర్శించారు. ప్రతి సభలో మోదీ గ్యారెంటీ అని డాంబికాలు పలుకుతున్న ప్రధాని… ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏమి అమలు చేశారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఏటా 2 కోట్లు ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన మోదీ… గత పదేళ్లలో ఇవ్వాల్సిన 20 కోట్ల ఉద్యోగాల్లో ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రగల్భాలు పలికిన మోదీ… కనీస మద్దతు ధర కోసం ఉద్యమిస్తున్న రైతులపై దమనకాండకు పాల్పడ్డారని, వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారని మండిపడ్డారు. వ్యవసాయరంగం కోలుకోలేని పరిస్థితుల్లో తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని, పెట్రోలు, డీజీల్‌, గ్యాస్‌ ధరలు పదేళ్లలో అనేక రెట్లు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. విద్య, వైద్యం,ఆహార భద్రత లాంటి కీలక అంశాల్లో ప్రపంచంలో భారత్‌ 111వ స్థానంలో ఉండడమే ఆయన అధ్వాన, అసమర్థ పాలనకు నిదర్శనంగా పేర్కొన్నారు. మోదీ పచ్చి అబద్ధాల కోరు, మోసకారి అని తీవ్రంగా దుయ్యబట్టారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి… ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ… దేశాన్ని నియంతృత్వ హిందూ రాజ్యంగా మార్చాలని చూస్తున్న మోదీని తరిమికొట్టి దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక తరగతి హోదా అమలు చేయలేదని, కడప స్టీల్‌ప్లాంట్‌, పోలవరం ప్రాజెక్టు తదితర విభజన అంశాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అటువంటి మోదీతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారన్నారు. మోదీది దుశ్శాసన పాలనైతే, జగన్‌ది సింహాసన పాలన అని విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాజా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మోదీని గద్దెదింపడం అనివార్యం: ఏచూరి
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ నరేంద్ర మోదీని గద్దెదింపితేనే వికసిత్‌ భారత్‌ అని అన్నారు. దేశ భవిష్యత్‌కు కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. దేశంలో మోదీ దుశ్శాసన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా రాజ్యాంగ మూలస్తంభాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయానికి తూట్లు పొడిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను ధ్వంసం చేయడంతో పాటు ఆర్థిక వినాశకర విధానాలను ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని ఏళ్ల తరబడి జైల్లో పెడుతున్నారనీ, ఇతర పార్టీలలో ఉన్నప్పుడు అవినీతిపరులు…అదే తమ పార్టీలో చేరితే పునీతులు అయిపోతారనీ, వారిపై ఎటువంటి కేసులు ఉండవని చెప్పారు. మోదీ అనాలోచిత విధానాల పర్యవసానంగా దేశంలో ఆర్థికలోటు విపరీతంగా పెరిగిపోయిందనీ, నిరుద్యోగం పెచ్చరిల్లిపోయిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయేకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామనీ, రిజర్వేషన్లు రద్దుచేస్తామని బహిరంగంగా ప్రకటించడం దారుణమన్నారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ప్రతిపక్ష నేతలపై బెదిరింపులకు మోదీ ప్రభుత్వం వినియోగిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు అమలుచేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ అదానీ, అంబానీలకు అప్పగిస్తోందనీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ను నష్టాల ఊబిలోకి నెట్టివేసి జియోకు చేయూత అందిస్తున్నారన్నారు. రిలయెన్స్‌ జియోను ప్రారంభించినప్పుడు అభినందిస్తూ మోదీ అన్ని భాషల దినపత్రికలలో పేజీ ప్రకటనలు ఇచ్చారన్నారు. అప్పుడు రాజ్యసభలో తాను ఈ చర్యను తీవ్రంగా ఎండగట్టానని ఏచూరి తెలిపారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మోదీకి గులాంగా మారాయన్నారు. మోదీ దేశంలో దుశ్శాసన పాలన చేస్తున్నారనీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సింహాసనం రాజకీయాలు చేస్తుండగా… చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ బుర్రకథకులుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో వైసీపీ, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేనను ఓడిరచి తీరాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే మోదీని ఓడిరచడం అనివార్యమన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశానికి అమృతకాలం అని ఏచూరి చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా సీపీఐ, సీపీఎం నాయకులు దోనేపూడి శంకర్‌, కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జల్లి విల్సన్‌, కేంద్ర కార్యవర్గసభ్యులు అక్కినేని వనజ, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, సీపీఐ పశ్చిమ అభ్యర్థి జి.కోటేశ్వరరావు, సెంట్రల్‌ సీపీఎం అభ్యర్థి సీహెచ్‌ బాబురావు, కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, సీపీఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు, గఫూర్‌, ఉమామహేశ్వరరావు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు శీలం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు చంద్రనాయక్‌, ఆర్‌.పిచ్చయ్య, నజీర్‌, జగన్‌ తదితరుల బృందం విప్లవగేయాలు ఆలపించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img