Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిరసన వెల్లువ

ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్‌ యత్నం

. అడ్డుకున్న పోలీసులు
. అరెస్టులు…నిర్బంధాలు
. దిల్లీ పోలీసు రాజ్యామా అంటూ నేతల ఆగ్రహం
. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ దిల్లీ, హర్యానాలో ఆందోళనలు

న్యూదిల్లీ : దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్‌ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రోడ్డెక్కారు. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’, ‘కేజ్రీవాల్‌ జిందాబాద్‌’ నినాదాలతో లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసం వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారు. అయితే పటేల్‌ చౌక్‌ వద్ద ఆప్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నిర్బంధించారు. బలప్రయోగానికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. పోలీసుల తీరుపై ఆప్‌ శ్రేణులు మండిపడ్డాయి. దిల్లీ పోలీసులు దేశ రాజధానిని ‘కోట’గా మార్చారని పార్టీ నాయకులు ఆరోపించారు. పార్టీ దిల్లీ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సెక్షన్‌ 144 కింద నగరమంతటా ఆంక్షలు విధించిందన్నారు. దిల్లీ ‘పోలీసు రాజ్యం’గా మారినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ ఇంటిని ఘెరావ్‌ చేయాలని ఆప్‌ శ్రేణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి నివాసం, సెంట్రల్‌ దిల్లీ సహా దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు తమ సిబ్బందిని, సాయుధ బలగాలను మోహరించడం ద్వారా భద్రతను కట్టదిట్టం చేశారు. లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు పటేల్‌ చౌక్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణను పరిమితం చేశారు. కాగా ఆప్‌ ఆందోళన కార్యక్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఆప్‌ సీనియర్‌ నేత సోమనాథ్‌ భారతి, దిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రాఖీ బిర్లా, పంజాబ్‌ మంత్రి హర్జోత్‌ సింగ్‌ బెయిన్స్‌ ఉన్నారు. ‘పోలీసు బలగాలతో ఈ ఉద్యమం ఆగదని నేను కేంద్రాన్ని హెచ్చరించాలనుకుంటున్నాను’ అని రాయ్‌ పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చినందున ఆప్‌ కార్యకర్తలు, నాయకులు ఉదయం నుంచి గుంపులుగా పటేల్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌కు చేరుకోవడం ప్రారంభించారు. పటేల్‌ చౌక్‌ ప్రాంతంలో నేర శిక్షాస్మృతికి చెందిన సెక్షన్‌ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. పోలీసులు ఎవరినీ గుమికూడేందుకు అనుమతించలేదు. ఇక్కడ ఎవరినీ గుమికూడనివ్వబోమని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చౌక్‌ వద్ద ప్రదర్శనకు వచ్చేవారిని వెంటనే అదుపులోకి తీసుకుంటామని పోలీసు డిప్యూటీ కమిషనర్‌ (న్యూదిల్లీ) దేవేశ్‌ కుమార్‌ గతంలో హెచ్చరించారు. దేశంలోని ‘నియంతృత్వానికి’ వ్యతిరేకంగా జరిగే పోరాటమే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమించేవారి పోరాటమని, మార్చి 31న రాంలీలా మైదానంలో మహార్యాలీకి సన్నాహాలు జరుగుతున్నాయని రాయ్‌ ప్రకటించారు. ఇందులో లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని, కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమికి చెందిన ప్రముఖ నేతలు తమ గళం వినిపిస్తారని రాయ్‌ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఆప్‌, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ద్రవిడ మున్నేట్ర కజగం, సమాజ్‌ వాదీ పార్టీ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తదనంతరం దిల్లీ కోర్టు ద్వారా మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపారు. నిర్దిష్ట వ్యక్తులకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించడానికి సంబంధించిన కుట్రలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు దిల్లీ సీఎం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవినీతిపరులను కాపాడేందుకు నిజాయతీపరులందరినీ లక్ష్యంగా చేసుకుంటోందని ఆందోళనకారుల్లో ఒకరైన సోమ్‌నాథ్‌ భారతి అన్నారు. రాఖీ బిర్లాతో పాటు తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని భారతి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘డిప్యూటీ స్పీకర్‌ రాఖీ బిర్లా, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన అనేక మంది వలంటీర్లు, కేజ్రీవాల్‌ జీ మద్దతుదారులతో పాటు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆప్‌ మద్దతుదారులను దిల్లీ పోలీసులు అకారణంగా అరెస్టు చేశారు’ అని ఆమె పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినందుకు దిల్లీ ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని ఆప్‌ నేత దుర్గేష్‌ పాఠక్‌ అన్నారు. ‘దిల్లీ, దేశ ప్రజలు బీజేపీపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఏకైక లక్ష్యంగా ఉన్న నాయకుడిని (అరవింద్‌ కేజ్రీవాల్‌) మోదీ జైలులో పెట్టారు. కేజ్రీవాల్‌ను మోదీ ద్వేషిస్తాడు. కేజ్రీవాల్‌కు భయపడుతున్నాడు’ అని అన్నారు.
హర్యానాలో ఆప్‌ శ్రేణుల నిరసనలు
అంబాలా: కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా హర్యానాకు చెందిన అనేక ప్రాంతాల్లో ఆప్‌ కార్యకర్తలు నిరసన ధర్నాలు నిర్వహించారు. అంబాలా సిటీలోని బీజేపీ కార్యాలయం వద్ద ఆప్‌ కార్యకర్తలు గుమిగూడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నాల్‌, రోప్‌ాతక్‌, ఫరీదాబాద్‌ సహా హర్యానాలోని ఇతర ప్రాంతాలలో కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నిరసనలు జరిగాయి. కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని ఆప్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుశీల్‌ గుప్తా అన్నారు. ‘నియంతృత్వ మోదీ ప్రభుత్వం ఆమ్‌ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని చూస్తోందని, అయితే నేడు దేశం మొత్తం నిజాయితీ గల నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీకి అండగా నిలుస్తుంది’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img