Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ప్రలోభాల జాతర

రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పంపిణీ
మద్యం పరవళ్లు… సున్నం కట్టల్లో డబ్బు పెట్టెలు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికలకు కొన్ని గంటలే సమయం ఉండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. గెలుపే లక్ష్యంగా అడ్డదారులకు దిగాయి. ఓటుకు నోట్లు భారీగా పంపిణీ చేస్తున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి ఇంటింటా డబ్బు పంపిణీ కొనసాగుతుండగా, శనివారం దానిని వేగవంతం చేశారు.
చాలా నియోజకవర్గాల్లో దాదాపు 80 శాతం పంపిణీ జరిగింది. ఎన్నికలకు 12 గంటల ముందునాటికి ఓటర్లు అందరికీ డబ్బు చేరవేసేలా రాజకీయ పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు. డబ్బు పంపిణీ చేస్తున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసినప్పటికీ ఎక్కడా ఆగలేదు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది. అభ్యర్థులకు గెలుపుపై నమ్మకం ఉన్నప్పటికీ, ముందస్తు జాగ్రత్తతో పోటీపడి పంచేశారు. 2019తో పోలిస్తే, 2024 ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. ఈ దుస్థితికి ధనబలం గల నేతలను ఎన్‌డీఏ, వైసీపీ పోటీకి దించడమేనన్న విమర్శలున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలో వ్యాపార వేత్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక కుంభకోణాలకు పాల్పడిన వారు నిలిచారు. మరికొందరిపై కేసులూ ఉన్నాయి. వారి నామినేషన్ల సమయంలో వెల్లడిరచిన ఆస్తులు కోట్లకు పడగలెత్తాయి. ప్రజాసేవ ముసుగులో తమ వ్యాపారాల విస్తరణ కోసమే కొందరు రాజకీయ ప్రవేశం చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్‌ అభ్యర్థికి ఉన్న స్థాయిలో పోటీ నెలకొంది. దీంతో ఎన్నికల కమిషన్‌ విధించిన ఖర్చుకు మించి ప్రచారం చేశారు. రాజకీయ పార్టీల నేతలు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ, ఎన్‌డీఏ కూటమి (బీజేపీ, టీడీపీ, జనసేన) అభ్యర్థులు డబ్బును విచ్చలవిడిగా పంచుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కోట్లాది రూపాయలు ఓట్ల చెంతకు చేరింది. వారం రోజుల ముందుగానే నియోజకవర్గాలకు డబ్బు చేరినట్లుగా తెలిసింది. ప్రతి అసెంబ్లీలో ఓటుకు రూ.1500, రూ.2 వేలు, రూ.3 వేలు చొప్పున ఓటర్లకు తమ ఏజెంట్లు, కార్యకర్తల ద్వారా అందజేస్తున్నారు. ప్రధాన అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ఓటుకు రూ.4 వేలకు పైగా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తూ డబ్బును విరజిమ్మేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఉపకరణాలు అందజేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి డబ్బు కట్టలు, మద్యం సంచులు రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. అట్ట పెట్టెలు, సున్నం బాక్సులు, పీవీసీ పైపుల మధ్యలో డబ్బులు పెట్టెలు దాచి… లారీల ద్వారా తరలిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల తనిఖీల్లో డబ్బు భారీగా పట్టుబడిరది. వీరవల్లి టోల్‌ ప్లాజ్‌ వద్ద జరిగిన లారీ రోడ్డు ప్రమాదంలో రూ.7 కోట్ల డబ్బు కట్టలు వెలుగు చూశాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారాయి. జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురం, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గాల్లో జనసేన, వైసీపీ భారీగా డబ్బు, మద్యం పంపిణీకి తెరదీశాయి. ఆయా నియోజకవర్గాల్లో ఓటుకు రూ.4 వేల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. వాటితో పాటు మహిళలకు అదనంగా గృహోపకరణ వస్తువులను బహుమతులుగా అందజేస్తున్నారు. ఎన్‌డీఏ పార్టీలు తొలుత పార్టీ సానుభూతి పరులున్న ప్రాంతాల్లో డబ్బులు పంపిణీ చేశాయి. వైసీపీ కూడా అదే విధానాన్ని పాటించింది. తుదకు ఓటర్ల నుంచి తిరుగుబాటు రావడంతో నియోజకవర్గం అంతా డబ్బు పంపిణీపై అభ్యర్థులు దృష్టి పెట్టాయి. డబ్బు పంపిణీ చేసే పార్టీ శ్రేణులపైనా నిఘా ఉంచి, అందరికీ చేరిందా?, లేదా? అనేదీ ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img