Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

మూగబోయిన మైకులు

. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచార ఘట్టం
. పోటాపోటీగా నేతల ప్రసంగాలు
. నిశ్మబ్ద కాలం ప్రారంభం
. రేపు పోలింగ్‌కు సర్వం సిద్ధం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
తెలుగు రాష్ట్రాల్లో శనివారం సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు అమలులోకి రావడంతో ఎక్కడి మైకులు అక్కడే మూగబోయాయి. రాజకీయ నేతల ప్రసంగాలు నిలిచిపోయాయి. చివరి రోజు నేతలు తమ సభల్లో ప్రసంగాలతో హోరెత్తించారు. ప్రజలకు అనేక హామీల జల్లులు కురిపించారు. అంతకుముందు భారీగా పార్లమెంట్‌, అసెంబ్లీల పరిధిలో అభ్యర్థులు ర్యాలీలు, సభలు నిర్వహించారు. తమ అనుచరగణంతో బల ప్రదర్శనలు చేశారు. ఏప్రిల్‌ 18వ తేదీన రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అటు తెలంగాణ రాష్ట్రంలోను 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక (కంటోన్మెంట్‌) కు హోరెత్తిన రాజకీయ పార్టీల మైకులు ఒక్కసారిగా మౌనం దాల్చాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో మునుపెన్నడూ లేనంతగా రాజకీయం వేడెక్కింది. అటు ఈనెల 13న పోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధమైంది. 13వ తేదీన జరిగే పోలింగ్‌కు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం లేకుండా నిశ్మబ్ద కాలం అమలులోకి వచ్చింది. జూన్‌ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎలాంటి సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడిరచడం, ప్రసారం చేయకూడదు. ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 46,389 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం నాటికి ఈవీఎంలు పోలింగ్‌ కేంద్రాలకు చేరతాయి. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా అధ్వర్యంలో పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడా రీ పోలింగ్‌కు తావులేకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకుగాను కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీజేశారు. పోలింగ్‌ ప్రక్రియ దగ్గర పడటంతో రాబోయే 72 గంటల్లో అధికార యంత్రాంగం చేపట్టబోయే చర్యలపై ముఖేశ్‌ కుమార్‌ మీనా దిశా నిర్దేశం చేశారు.
పోటాపోటీగా ప్రచారం
ఇండియా కూటమి, వైసీపీ, ఎన్‌డీఏ కూటమి పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలతో ప్రజల ముందుకు వెళ్లాయి. ఎన్నికల బరిలో ఇండియా కూటమి (కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం) ప్రచారం ముగిసింది. కేంద్ర, రాష్ట్ర నేతలు రాష్ట్రానికి తరలివచ్చి ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేపట్టారు. విజయవాడ జింఖానా గ్రౌండ్‌ వేదికగా జరిగిన ఉమ్మడి సభకు సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు డి.రాజా, సీతారాం ఏచూరి, ఏఐసీసీ అధ్యక్షుడు ఖడ్గే, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించారు. కేంద్రం, రాష్ట్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధ్యమని, రాజ్యాంగ పరిరక్షణ ఉంటుందన్న నినాదాలు తీసుకెళ్లాయి. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఒక వైపు బస్సు యాత్రలు, మరో వైపు బహిరంగ సభలు నిర్వహించారు. కడప ఎన్నికల సభకు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఇండియా కూటమి నేతల ప్రచారంలో… కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ తొత్తులుగా మారాయంటూ ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్‌ జనవరి 26న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పులివెందులలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, పిఠాపురం నియోజకవర్గంలో ముగించారు. ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ ప్రాంతాలను కవర్‌ చేస్తూ నాలుగు ‘సిద్ధం’ సభలను నిర్వహించారు. వాటికి కొనసాగింపులో ‘మేమంతా సిద్ధం’ సభలతో బస్సు యాత్రలు నిర్వహించారు. తుది దశలో హెలికాఫ్టర్‌ ద్వారా కొన్ని కీలక నియోజకవర్గాల్లో రోజుకు మూడు చొప్పున ప్రచారం నిర్వహించారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో 106 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగింది. 34 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, 14 నియోజకవర్గాల్లో రోడ్‌ షోలను సీఎం జగన్‌ నిర్వహించారు. తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబు వస్తే అవి రద్దవుతాయంటూ జగన్‌ సభల్లో ప్రత్యేకంగా ప్రకటించారు. మరోవైపు, ఎన్‌డీఏ కూటమి నుంచి మోదీ, అమిత్‌ షా, జనగళం పేరుతో చంద్రబాబు, పవన్‌ విస్తృతంగా ప్రచారం చేపట్టి, బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి మూడు విడతలుగా విచ్చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఒకసారి వచ్చారు. విజయవాడ పీవీపీ నుంచి బెంజిసర్కిల్‌ వరకు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ రోడ్‌ షో చేపట్టి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టారు. ఈ సభల ద్వారా సీఎం జగన్‌ ప్రభుత్వ అవినీతితో పాటు ఆయనపై వ్యక్తిగతంగా మాటల దాడిని పెంచేశారు. ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తామన్న ప్రచారాన్ని విస్తృతంగా తీసుకెళ్లారు. జగన్‌ అధికారంలోకి వస్తే మీ భూమి మాయమవుతుందంటూ యాడ్‌ల రూపంలో ఓటర్లకు సమాచారమిచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న అనేక మంది అభ్యర్థులకు సినీ నటులు, రాజకీయ ప్రముఖులు, కుటుంబీకులు మద్దతు ప్రకటిస్తున్నారు. కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మ మద్దతిస్తూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి మద్దతుగా సినీ నటుడు అల్లు అర్జున్‌, ఆయన భార్య స్నేహ నేరుగా ప్రచారం నిర్వహించారు. వేల సంఖ్యలో అక్కడి అభిమానులు, వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. అల్లు అర్జున్‌ రాకతో అక్కడ జోష్‌ నెలకొంది. గత ఎన్నికల్లోనూ శిల్పా రవిచంద్రకు మద్దతుగా అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేసిన విషయం విదితమే. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, వారి కుటుంబీకులు ప్రచారం నిర్వహించారు.
మద్యం దుకాణాల బంద్‌
సార్వత్రిక ఎన్నికలతో మద్యం విక్రయాలు బంద్‌ అయ్యాయి. 48 గంటల పాటు మద్యం డ్రై డేను ప్రకటించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈనెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి, ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img