Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

రాజకీయ ఒత్తిళ్లు…న్యాయ వ్యవస్థకు ముప్పు

. కోర్టులను అవమానిస్తుంటే మౌనంగా ఉండటం సరికాదు
. సీజేఐకి 600 మందికిపైగా న్యాయవాదుల లేఖ

న్యూదిల్లీ : రాజకీయ ఒత్తిళ్లతో న్యాయ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోందని, అవినీతిపరులను కాపాడేందుకు కోర్టుల పరువు తీస్తున్న పరిస్థితులు ప్రమాదకరమని సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, బార్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ మన్నన్‌ కుమార్‌ మిశ్రా సహా 600 మందికిపైగా న్యాయవాదులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ‘న్యాయవ్యవస్థకు ముప్పురాజకీయవృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడాలి’ అనే శీర్షికతో ఆదిశ్‌ అగర్వాల, చేతన్‌ మిట్టల్‌, పింకీ ఆనంద్‌, హితేశ్‌ జైన్‌, ఉజ్వల పవార్‌, ఉదయ్‌ హోళ్ల, స్వరూపమ చతుర్వేది తదితరులు సీజేఐకి లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకులపై అవినీతి ఆరోపణల వస్తున్న వేళ…హైప్రొఫైల్‌ కేసులు కోర్టుల విచారణలో ఉన్న సమయంలో ఈ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. రాజకీయ, వ్యక్తిగత కారణాలతో కోర్టులను అమానించే, కించపరిచేందుకు జరిగే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని న్యాయవాదులు కోరారు. ఇలాంటి పరిస్థితులకు మౌనం పరిష్కారం కాబోదని హితవు పలికారు. అలా చేస్తే హాని తలపెట్టే వారికి మరింత బలాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నారు. కష్టకాలంలో సీజేఐ నాయకత్వం కీలకమని నొక్కిచెప్పారు. న్యాయస్థానాల కోసం బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సుప్రీంకోర్టు పూనుకోవాలని న్యాయవాదులు కోరారు. దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజకీయ నేతలపై కేసుల్లో తీర్పులను ప్రభావితం చేసేందుకు ‘స్వార్థ ప్రయోజాలు ఆశించే సంఘాలు’ ఒత్తిడి తెస్తున్నాయని న్యాయవాదులు ఆరోపించారు. ఈ వ్యూహాలు కోర్టులకే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్థికి ముప్పు వాటిల్లజేస్తున్నాయన్నారు.
‘స్వార్థ ప్రయోజనాలు ఆశించే కొన్ని సంఘాలు తమ రాజకీయ అజెండాతో న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసి, కోర్టు ప్రతిష్ఠను దిగజార్చాలని చూస్తున్నాయి. ఇందుకోసం అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తగ్గించేందుకుగాను కీలక తీర్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కొందరు న్యాయవాదులు పగలు నేతలను సమర్థిస్తారు… రాత్రి మీడియాతో కలిసి జడ్జిలను ప్రభావితం చేయాలని చూస్తారు. కేవలం రాజకీయ ప్రయోజనాల ఆపేక్షతో ఇలా చేయడం బాధాకరం. రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయడం.., ఆ తర్వాత వారినే కోర్టుల్లో సమర్థించడం వింతగా ఉంది. కోర్టు నిర్ణయాలు అనుకూలంగా రాకపోతే బహిరంగ విమర్శలకు దిగుతుండటం ఆమోదయోగ్యం కాదు. సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ ప్రచారం జరుగుతోంది. దీనితో జడ్జిలను, కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను అనుమతించరాదు. చట్టాలు లేని దేశాలతో మన న్యాయస్థానాలను పోల్చే స్థాయికి కొందరు దిగజారుతున్నారు. అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు కోర్టులను ఆరోపిస్తున్నారు. ఇవి విమర్శలు మాత్రమే కాదు…న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసంపై ప్రత్యక్ష దాడి. చట్టాలను నీరుగార్చే ప్రయత్నం. ‘నా దారే రహదారి’ అన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారు’ అని లేఖ పేర్కొంది. కాగా, 2018`19లో ‘హిట్‌ అండ్‌ రన్‌’ కార్యకలాపాలు, తప్పుడు కథనాలను, 2019 ఎన్నికలప్పుడు రఫేల్‌ కేసును ప్రస్తావించింది. అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్‌ రాగా 2018 నవంబరులో దాఖలైన ఫిర్యాదులపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిందని గుర్తుచేసింది. రఫేల్‌ ఒప్పందంలో అనుమానాస్పదంగా ఏమీ లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నట్లు లేఖ గుర్తు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img