Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

రాజధాని లేని దుస్థితి

చీరాల ప్రజాగళం సభలో చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరోబాపట్ల : మీ రాజధాని ఏదీ అని అడిగితే చెప్పుకోలేని దుస్థితి రాష్ట్ర ప్రజలకు దాపురించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధవారం బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మరో కొన్ని రోజులు ఓపిక పడితే అధికారం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. 10 రూపాయలు ఇచ్చి రూ.100 దోచేస్తుంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్‌డీఏ కూటమి నుంచి అదిరిపోయే మేనిఫెస్టో ఇచ్చామని, అభివృద్ధిసంక్షేమం ఇచ్చేది తమ కూటమేనని చంద్రబాబు చెప్పారు. అమరావతిని జగన్‌ కూల్చేశారని, చీరాల నుంచి గంటన్నరలో రాజధాని అమరావతికి వెళ్లవచ్చన్నారు. చీరాల ప్రాంతం ఆదాయ వనరులకు కేంద్రంగా ఉండేదని, అయితే ఇక్కడ ప్రస్తుతం పనులు లేకపోవటం వల్ల హైదరాబాద్‌, చైన్నై వంటి నగరాలకు వలస వెళ్లే పరిస్థితి ఉందన్నారు. రైతులకు సకాలంలో నీళ్లు ఇచ్చామన్నారు. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించామన్నారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలు పెట్టింది టీడీపీ అని, పసుపు`కుంకుమ కింద రూ.10 వేల కోట్లు ఇచ్చామన్నారు. జగన్‌కు ఓటు వేస్తే మీ ఆస్తులు గోవిందా అని, రికార్డులు మొత్తం ఆయన చేతుల్లో ఉంటాయని చంద్రబాబు అన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ఎందుకో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. సీఎంగా నా తొలి సంతకం మెగా డీఎస్సీపై అని, రెండవ సంతకం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై పెడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యాన్ని నియంత్రించి, 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ రాష్ట్రంలో లేకుండా చేస్తానన్నారు. చీరాల నియోజకవర్గంలో ఆ పెద్ద మనిషి ఎక్కడున్నాడు… పనులు కోసం కక్కుర్తి పడే వాళ్లు మనకు అవసరమా అని కరణం బలరాంను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. మరొకాయన ఉన్నాడు ఎమ్మెల్యేగా వచ్చి పార్టీలో చేరాడు అన్నీ పనులు చేయించుకుని ఎన్నికలకు ముందే వెళ్లిపోయాడని ఆమంచికి చురకలు అంటించారు. మే 13న మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత రాష్ట్ర ప్రజలు తీసుకోవాలని కోరారు. చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎం.కొండయ్యను అత్యధిక ఓట్లతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, బాపట్ల, రేపల్లె, వేమూరు టీడీపీ అభ్యర్థులు బీఎన్‌ విజయ్‌కుమార్‌, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్రవర్మ, అనగాని సత్యప్రసాద్‌, నక్కా ఆనందబాబు, జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్‌బాబు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img