Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

రాయలసీమనుకోనసీమ చేస్తా

. ప్రాజెక్టులు పూర్తి చేసి సస్యశ్యామలంగా మారుస్తా
. ఎన్డీయే కూటమితో జగన్‌లో ఓటమి భయం
. ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి సభలలో చంద్రబాబు

విశాలాంధ్ర`ప్రొద్దుటూరు: అధికారంలోకి వచ్చాక రాయలసీమను కోనసీమ చేస్తామని, సస్యశ్యామలంగా మారుస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. సీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. చంద్రబాబు శనివారం ప్రజాగళం యాత్రలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన సభలలో మాట్లాడారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాయలసీమకు జరిగిన మేలు ఏమిటి? రాయలసీమకు కేటాయించిన నీటి వాటాను తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. వనరులు దోచుకోవడం తప్ప ప్రాజెక్టుల పురోగతిని పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్టీయే కూటమితో జగన్‌కు ఓటమి భయం పెట్టుకున్నదన్నారు. ఒకప్పుడు వ్యాపార పరంగా ప్రొద్దుటూరు పేరుగాంచితే వైకాపా పాలనలో అసాంఫీుక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు. ప్రొద్దుటూరులో పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత కల్పిస్తానని అన్నారు. వైసీపీ అరాచక పాలనకు విసిగి వేసారి వలసల బాట పట్టారన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం రాయలసీమను సస్యశ్యామలంగా మార్చేందుకు రూ.12వేల కోట్లు చేస్తే జగన్‌ ప్రభుత్వం కేవలం రూ.2వేల కోట్లు వెచ్చించించడాన్ని బట్టి ఈ ప్రాంత రైలులు, ప్రజల సంక్షేమం ముఖ్యమంత్రికి పట్టడం లేదని అర్థమవుతోందన్నారు. గుండ్లకమ్మ, ఓర్వకల్లు, హంద్రినీవా, గాలేరు, నగరి, గండికోట ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత టీడీపీదేనన్నారు. గండికోట ప్రాజెక్టు ద్వారా పులివెందుల రైతులకు సాగు`తాగునీరు అందించామన్నారు. కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావాలన్న ఎన్‌టీ రామారావు ఆశయమని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నదే తన అభిమతమని చంద్రబాబు తెలిపారు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తానని హామీనిచ్చారు. క్విట్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అంటూ పిలుపునిచ్చారు. ఆంధ్రపదేష్‌ను గంజాయి, మాదక ద్రవ్యాల కేంద్రంగా తయారు చేశారని, మద్యం నిషేధాన్ని గాలికొదిలేసి జగన్‌ బ్రాండ్లు అమ్ముతూ పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. 25వేల కేజీల డ్రగ్స్‌ విశాఖలో పట్టుబడితే సరఫరా చేసేవారిని, వారికి మద్దతిచ్చేవారిని జైలుకు పంపాల్సిన జగన్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తెలుగుజాతికి సిగ్గుచేటన్నారు. బాబాయిని చంపిన వ్యక్తికే వైసీపీ ఎంపీ సీటు ఇచ్చారని, ముద్దాయి పక్కననుంటే ఓట్లు ఎలా వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో 8వ ముద్దాయిగా ఉన్న ఎంపీకి సీట్లు అడిగే అర్హత ఉందా అని నిలదీశారు. తనది విజన్‌… జగన్‌ది పాయిజన్‌ అని ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరు సభలో జగన్‌ ప్రసంగిస్తుండగానే ప్రజలు పారిపోయారన్నారు. బిర్యాని ప్యాకెట్లు, మందు బాటిల్లు ఇచ్చి 10 జిల్లా లనుంచి జనాన్ని తెచ్చుకున్నారని జగన్‌ను చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు వేచివుండటం ద్వారా వారికి తనపై ఎంత అభిమానమో తెలస్తుందన్నారు. రానున్నది రామరాజ్యం అని, జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు నినాదమిచ్చారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ పరిశ్రమ తేలేకపోయారని, ఉన్న పరిశ్రమలను సైతం ఇతర రాష్ట్రాలకు తరలేలా చేశారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు చెప్పారు. జగన్‌ ఓటమే లక్ష్యంగా పొత్తుకు సిద్ధమయ్యారని తెలిపారు. టీడీపీలోకి కొనిరెడ్డి శివచంద్ద్రారెడ్డి చేరడం ఆనందకరమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి, సురేశ్‌ నాయుడు, పుట్టా సుధాకర్‌ యాదవ్‌, భూపేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img