Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

వచ్చేది ‘ఇండియా’ సర్కారే

. దేశ పరిరక్షణకు అవిశ్రాంత కృషి
. బీజేపీ మళ్లీ గెలిస్తే… ప్రతిపక్ష నేతలంతా జైలుకే
. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌

న్యూదిల్లీ : ఇండియా కూటమి జూన్‌ 4 తర్వాత కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మోదీ కాదని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే… మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ థాకరే, తేజస్వి యాదవ్‌తో సహా అనేక మంది విపక్ష నేతలు జైలు పాలవుతారని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. తీహార్‌ జైలు నుంచి విడుదలయిన తర్వాత శనివారం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ‘మోదీ జీ ఆమ్‌ ఆద్మీ పార్టీని (ఆప్‌) అణిచివేయాలనుకుంటున్నారు. అతనికి ఒక దేశం, ఒకే నాయకుడు అనే ప్రమాదకరమైన మిషన్‌ ఉంది’ అని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, జూన్‌ 4 తర్వాత అధికారాన్ని చేపట్టేందుకు ఇండియా కూటమి సిద్ధంగా ఉన్నందున బీజేపీ పాలన ముగుస్తుందని నొక్కి చెప్పారు. ‘నేను కస్టడీ నుంచి విడుదలైన తర్వాత గత 20 గంటల్లో రాజకీయ విశ్లేషకులు, ప్రజలతో సంప్రదింపులు జరిపాను. బీజేపీ తిరిగి అధికారంలోకి రాదని స్పష్టంగా తెలుస్తుంది’ అని కేజ్రీవాల్‌ ప్రకటించారు. తదుపరి ఇండియా కూటమి ప్రభుత్వంలో ఆప్‌ భాగస్వామ్యాన్ని ధ్రువీకరిస్తూ, దిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. శనివారం ఉదయం కన్నాట్‌ ప్లేస్‌లోని హనుమాన్‌ ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘మా పార్టీకి ఆ హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయి. అద్భుతం జరిగి నేను మళ్లీ మీ మధ్యకు రాగలిగాను. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) చాలా చిన్న పార్టీ. కేవలం రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. అలాంటి మమ్మల్ని అణచివేసేందుకు ప్రధాని మోదీ ఏ ప్రయత్నాన్నీ వదల్లేదు. నలుగురు నాయకులను జైలుకు పంపించారు. ఒక పార్టీ నుంచి నలుగురు అగ్ర నేతలు జైలుకు వెళితే… దాని మనుగడ కొనసాగగలదా? ఆప్‌ను మట్టికరిపించాలని ప్రధాని భావిస్తున్నారు. ఆప్‌ ఒక్కటే దేశానికి అద్భుతమైన భవిష్యత్తును అందించగలదని ఆయన కూడా నమ్ముతున్నారు. ఆమ్‌ ఆద్మీ ఒక పార్టీ కాదు. సిద్ధాంతం. మీరెంత అణగదొక్కితే మేం అంత పైకి లేస్తాం’ అని కేజ్రీవాల్‌ అన్నారు. ‘నేను త్వరలో తిరిగి వస్తానని నేను మీకు చెప్పలేదా? నేను తిరిగి వచ్చాను. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ఇప్పుడు మనలో 140 కోట్ల మంది ఆ పని చేయవలసి ఉంది’ అని ఆయన అన్నారు.
మోదీ తర్వాత మీ ప్రధాని అభ్యర్థి ఎవరు?
‘విపక్ష ఇండియా కూటమికి నాయకుడు ఎవరు? అని బీజేపీ తరచూ అడుగుతోంది. మరి వారి ప్రధాని అభ్యర్థి ఎవరు? వచ్చే సెప్టెంబరు 17 నాటికి మోదీకి 75 ఏళ్లు వస్తాయి. బీజేపీలో ఆ వయసు వారు రిటైర్మెంట్‌ తీసుకోవాలని ప్రధానే నిబంధన పెట్టారు. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, సుమిత్రా మహజన్‌ లాంటి వారిని అలాగే పక్కనబెట్టారు. మరి మోదీ కూడా రిటైర్‌ అవుతారా? అలాగైతే ప్రధానిగా వారిలో ఎవరిని ఎన్నుకొంటారు?’ అని సీఎం కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత రెండు నెలల్లో ఉత్తర ప్రదేశ్‌ సీఎం కూడా మారతారని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్‌ను పక్కనబెడతారని అన్నారు. అమిత్‌ షా కోసమే ప్రధాని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని, మరి మోదీ గ్యారంటీని షా నెరవేరుస్తారా? అని దుయ్యబట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని జైలులో పెడితే… అక్కడి నుంచే ప్రజాస్వామ్య పాలన సాగుతుందని చెప్పేందుకు నేను రాజీనామా చేయలేదు. జైలు నుంచే నియంతపై పోరాటం చేశా. బీజేపీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశమంతా ప్రచారం చేస్తా’ అని వెల్లడిరచారు. అవినీతిపై పోరాటం చేస్తున్నామని ప్రధాని చెబుతున్నారని, కానీ వారి పార్టీలోనే అవినీతి నేతలంతా ఉన్నారని దుయ్యబట్టారు. ‘అవినీతిపై పోరాటం ఎలా చేయాలో కేజ్రీవాల్‌ను చూసి నేర్చుకోండి. తప్పు చేస్తే సొంత పార్టీ నేతనే మేం జైలుకు పంపించాం’ అని గుర్తు చేశారు.
నేడు ఆప్‌ నేతలతో కేజ్రీవాల్‌ కీలక సమావేశం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ఆప్‌ ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సివిల్‌ లైన్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరుగుతుందని వారు తెలిపారు. ‘ఇది కీలక సమావేశం. మే 25న దిల్లీలో లోక్‌సభ ఎన్నికలపై చర్చ కూడా జరుగుతుంది’ అని పార్టీ వర్గాలు తెలిపాయి.
‘ఇండియా’ ప్రభుత్వంలో ఆప్‌ భాగం : పంజాబ్‌ సీఎం మాన్‌
జూన్‌ 4న కేంద్రంలో ఏర్పాటయ్యే ఇండియా కూటమి ప్రభుత్వంలో ఆప్‌ భాగస్వామ్యమని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు దాటదని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ శనివారం అన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఒక రోజు తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కార్యకర్తలను ఉద్దేశించి మాన్‌ ప్రసంగిస్తూ, ఆయన ‘నియంతృత్వ శత్రువని’ అభివర్ణించారు. ‘నేను ప్రతిచోటా చెప్పాను. కేజ్రీవాల్‌ ఒక వ్యక్తి కాదు ఒక ఆలోచన. మీరు ఒక వ్యక్తిని అరెస్టు చేయవచ్చు కానీ ఆలోచనను కాదు. నియంతృత్వ శత్రువే కేజ్రీవాల్‌’ అని ఆయన అన్నారు. కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచిన దిల్లీ విప్లవకారులకు మాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. దేశ రాజకీయాల పరిస్థితి, దిశా నిర్దేశం గురించి కేజ్రీవాల్‌ ఏం చెబుతారో ప్రజలు వినాలనుకుంటున్నారని తెలిపారు. సంక్షోభ సమయంలో తమ పార్టీకి అండగా నిలిచినందుకు దిల్లీ ప్రజలను మాన్‌ ప్రశంసించారు. ఎన్నికలకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ‘కష్టపడి పని’ చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img