విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : గ్రూప్-1 మెయిన్స్ (2018) పరీక్షలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను చేతితో రెండు సార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను పక్కనపెట్టి, రెండోసారి దిద్దించి, వాటి ఆధారంగా ఏపీపీఎస్సీ ఫలితాలను ప్రకటించిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. గ్రూప్-1 మెయిన్స్‌కు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను ఆరు వారాల్లోగా పూర్తి చేయాలని తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. మెయిన్స్ జవాబు పత్రాలను అనేక సార్లు మూల్యాంకనం చేయడం చట్ట విరుద్దమని అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.