Monday, October 28, 2024
Monday, October 28, 2024

‘నీట్‌’పై జ్యుడీషియల్‌ విచారణసీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్ర – విజయవాడ : వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మే 5న దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ పరీక్షను దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాశారని తెలిపారు. జూన్‌ 4న విడుదలైన నీట్‌ ఫలితాల్లో ఎన్నడూ లేని విధంగా దాదాపు 67 మందికి 720/720 మార్కులు వచ్చాయన్నారు. టాప్‌ స్కోర్‌ సాధించిన 67 మందిలో ఆరుగురు హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష వ్రాయడంతో పాటు ఆ తరువాత వచ్చిన రెండు ర్యాంకులు కూడా ఆ పరీక్షా కేంద్రం విద్యార్థులకే రావడంతో అనేక అనుమానాలు తలెత్తి, విద్యార్థులు ఆందోళన చేపట్టారని పేర్కొన్నారు. పరీక్షకు ఒకరోజు ముందే మే 4న పక్కా ప్లాన్‌ ప్రకారం పేపర్‌ లీక్‌ చేయడం, ఇందుకోసం బీహార్‌కు చెందిన ముఠా 35 మంది విద్యార్థుల నుంచి రూ.30 లక్షల చొప్పున భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేలిందన్నారు. పేపర్‌ లీకేజీ వ్యవహారం వైద్య విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు విద్యార్థులకు 718, 719 మార్కులు వచ్చినట్లు తేలడంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ అవకతవకలు వెలుగుచూశాయన్నారు. నీట్‌ అవకతవకల వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లగా, 1,563 మందికి ఇచ్చిన గ్రేస్‌ మార్కులను కేంద్రం రద్దు చేసిందన్నారు. ఏదేమైనా నీట్‌ విద్యార్థుల జీవితాలతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ చెలగాటమాడాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత, అధికారుల అలసత్వం కారణంగా లక్షలాది మంది నీట్‌ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా నీట్‌ అవకతవకల వ్యవహారం కుదిపేస్తున్నప్పటికీ ప్రధాని మోదీ స్పందించకపోవడం విచారకరమని, నీట్‌ అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలు బాధ్యత వహించాలన్నారు. నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img