Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

బెల్టు తీస్తాం

మద్యం షాపు యజమానులకు చంద్రబాబు హెచ్చరిక

. ఇసుక, మద్యం పాలసీ ఫలాలు ప్రజలకు అందాలి
. పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్‌పీ ధరలకు మించి ఒక్క రూపాయి అధికంగా తీసుకున్నా ఉపేక్షించవద్దని, బెల్టు షాపులపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మద్యం, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త మద్యం పాలసీ అమలవుతున్న తీరును ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మద్యం ధరల విషయంలో అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంఆర్‌పీకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటిసారి అయితే రూ.5 లక్షలు జరిమానా వేయాలని, తరువాత కూడా తప్పు చేస్తే ఆ షాపు లైసెన్స్‌ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బెల్ట్‌ షాపులను అనుమతించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. లిక్కర్‌ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్‌ షాపులను ప్రోత్సహిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపైనా కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి షాపులో సీసీి కెమెరాలు ఉండేలా చూడాలని, ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక, మద్యం… ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్‌ మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి షాపు వద్ద మద్యం ధరల పట్టిక తప్పకుండా ఉండేలా చూడాలని, మద్యం షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు, మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలని సూచించారు. అనంతరం ఇసుక లభ్యత, సరఫరా అంశాలపై తాజా పరిస్థితిని అధికారులు వివరించగా… ఇసుక లభ్యత పెంచాలని, అన్ని రీచ్‌ల నుంచి ఇసుక సులభంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా తరలిపోవడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే మొదటగా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మద్యం పాలసీ, ఇసుక విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని, దాన్ని క్షేత్రస్థాయి వరకు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ప్రజల జేబులు గుల్ల చేసేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
పేద విద్యార్ధిని జ్ఞాపికతో పొంగిపోయిన చంద్రబాబు
తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తన స్వహస్తాలతో గీసిన బాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు. ‘సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చిత్రంపై రాసింది. ఇది చూసి ముగ్ధుడైన చంద్రబాబు లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని దీవించారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి వృద్ధురాలి స్థల వితరణ
పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలం వితరణ చేసేందుకు సత్తెనపల్లికి చెందిన ఓ వృద్ధురాలు ముందుకొచ్చారు. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తే అందుకు తాను తన సొంత స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కమ్మవారిపాలేనికి చెందిన నరిశెట్టి రాజమ్మ సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి వరద బాధితుల సహాయార్ధం చెక్కు అందించేందుకు వచ్చారు. తమ గ్రామంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు ఉన్నాయని, వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు మంజూరు చేస్తే అందుకు అవసరమైన 2 లేదా 3 సెంట్ల చొప్పున స్థలం సమకూర్చుతానని తెలిపింది. త్వరలో గృహ నిర్మాణ పథకం ప్రారంభం అవుతుందని, ఆ సమయంలో అధికారులు సంప్రదిస్తారని సీఎం చంద్రబాబు ఆమెతో అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం స్థలం ఇచ్చేందుకు ఉదారంగా ముందుకొచ్చిన రాజమ్మను సీఎం చంద్రబాబు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img