Monday, May 20, 2024
Monday, May 20, 2024

మిగిలింది మూడేరోజులు

. పోటాపోటీగా పార్టీల ప్రచారం
. వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం
. పరస్పర దాడులకు వెరవని వైనం

విశాలాంధ్రబ్యూరో – అమరావతి : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులే సమయం మిగిలుండగా… రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఎన్డీఏ కూటమి పార్టీలు, వైసీపీ…ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అడ్డదారులు తొక్కుతున్నాయి. అక్కడక్కడా దాడులకు పాల్పడటానికి వెనుకాడటం లేదు. తాజాగా రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కార్యాలయంపై ప్రత్యర్థి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ప్రచారంలో రాళ్లదాడి ఘటనలతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతులతో ప్రధాన పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేపడుతున్నారు. ఇప్పటివరకు రూ.450 కోట్ల విలువైన నగదు, మద్యం, విలువైన పరికరాలను చెక్‌పోస్టుల వద్ద తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక అభ్యర్థులు పోటాపోటీగా రోడ్‌షోలు, సభలు, సమావేశాలతో దూసుకుపోతున్నారు. ఇండియా కూటమి పార్టీల నుంచి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు కె.నారాయణ, సీతారామ్‌ ఏచూరి, రాష్ట్ర నేతలు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు రోడ్‌షోలు నిర్వహించారు. బీజేపీతో జతకట్టిన టీడీపీ, జనసేన, రహస్య అవగాహన కుదుర్చుకున్న వైసీపీలను ఈ ఎన్నికల్లో సాగనంపాలని ఓటర్లకు పిలుపునిస్తున్నారు. ఇండియా కూటమితోనే కేంద్ర, రాష్ట్ర అభివృద్ధికి సాధ్యడుతుందని, లౌకిక ప్రజాతంత్ర, రాజ్యాంగ పరిరక్షణ ఉంటుందని చెబుతున్నారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్‌ తన ప్రచారాన్ని దశల వారీగా కొనసాగిస్తున్నారు. రోజుకు మూడు సభలతో సుడిగాలిలా పర్యటిస్తున్నారు. మధ్యమధ్యలో ప్రచారానికి విరామం ఇస్తూ… తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం పరిమితమవుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలతో ఎన్నికల సరళిపై వ్యూహరచన చేస్తున్నారు. వైసీపీకి ప్రతికూలత ఉండి, ఓడిపోతామని సర్వేల సంకేతాలున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో రెండు, మూడు సార్లు జగన్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుస్తామనే ధీమాతో ఉన్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక సారి ప్రచారంతోనే సరిపెడుతున్నారు. ప్రతిరోజూ ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై లెక్కలు తెప్పించుకుని, వాటిని సమీక్షించుకుంటూ ముందుకు పోతున్నారు. ఎన్డీఏ కూటమి పార్టీలూ అందుకు దీటుగానే రంగంలోకి దిగాయి. సామాజిక మాధ్యమాల ద్వారా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాయి. ప్రధాని మోదీ మూడు విడతలుగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి అభ్యర్థులకు ప్రచారం నిర్వహించారు. మోదీ తన ప్రచారంలో తొలి సారిగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగడంతో, ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. దాంతో సీఎం జగన్‌ కూడా మోదీపై విమర్శలు ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో జరిగిన ప్రచార సభల్లో టీడీపీకి చెందిన సైకిల్‌ను రిపేర్‌ చేసేందుకుగాను దిల్లీ నుంచి మెకానిక్‌లు వచ్చారంటూ జగన్‌ ఎద్దేవా చేశారు. తాను లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నాని పేర్కొన్నారు. జనసేన అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీలో ఉండటంతో ఆయనకు మద్దతుగా సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. పవన్‌ సోదరుడు చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా సందేశమిచ్చారు. బుల్లితెర నటులు పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకుగాను 13వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో భాగంగా హోం ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లను నిర్వహించింది. పోస్టల్‌ బ్యాలెట్‌కు మొత్తం 4.30లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 3.03లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొందరు ఉద్యోగులు సాంకేతిక సమస్యలతో ఓటుకు దూరమవ్వగా, మళ్లీ వారికి ఓటు హక్కు కల్పించేందుకు ఈసీ చర్యలు తీసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img