Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందే

. ఎంతవరకైనా పోరాడతా
. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై ముస్లింలకు అండగా నిలిచాం
. వ్యతిరేకిస్తున్న బీజేపీతో చంద్రబాబు దోస్తీనా?
. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ గొప్ప సంస్కరణ
. ఎన్నికల సభల్లో సీఎం వైఎస్‌ జగన్‌

విశాలాంధ్ర-నెల్లూరు/హిందూపురం/పలమనేరు : ముస్లిం రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం వైఎస్‌ జగన్‌ సవాలు విసిరారు. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారని అన్నారు. ఒకవైపు ఎన్డీయేలో కొనసాగుతూనే… మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టారని ఆరోపించారు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? అని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్‌ నెల్లూరు నగరంలో నిర్వహించిన సిద్ధం సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
తాము ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జగన్‌ స్పష్టం చేశారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లపై మోదీ సభలో చంద్రబాబు మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల కోసం ఎన్డీయే నుంచి బయటకు రాగలరా అని నిలదీశారు. తాము ముస్లింలకు మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేదని చెప్పారు. పేదరికం, వెనుకబాటు తనం అధారంగానే 4శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ అంశాల్లో కూడా ముస్లిం సామాజిక వర్గానికి మద్దతుగా నిలిచామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన సభలో జగన్‌ మాట్లాడుతూ… చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ముగిసిపోతాయని పేర్కొన్నారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది… ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకే కాదు… రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా… ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కి వారి బ్యాంకు ఖాతాలలో వేయడం అన్నది గతంలో ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసి… మళ్లీ ప్రజల ఆశీస్సులు కోరుతున్నామన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై మాట్లాడుతూ… ఈ చట్టంపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుందని చెప్పారు. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని జగన్‌ గుర్తు చేశారు. ప్రజలు ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు బహిరంగసభలో మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆసరా, వైఎస్సార్‌ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు.. అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్‌ కానుక, రైతు భరోసా, ఉచిత బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పగటి పూట 9గం. ఉచిత కరెంట్‌.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడిగారు. వాహన మిత్ర, నేతన్నలకు నేస్తం, చేదోడు, లాయర్లకు లా నేస్తం, ఫ్యామిలీ క్లినిక్‌, విలేజ్‌ డాక్టర్‌, ఇంటికే సురక్ష, వలంటీర్‌ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్‌, మహిళా పోలీస్‌ ఇలాంటి ఎప్పుడైనా చూశారా అన్నారు. కేవలం 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ 99 శాతం అమలు చేసి ఎన్నికల ప్రచారంలో మరోసారి ఆశీర్వదించమని కోరుతున్నానన్నారు. తన పాలనలో సంక్షేమ పథకం ద్వారా ఏ కుటుంబానికైనా లబ్ధి చేకూరింటే తిరిగి మరోసారి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని విజప్తి చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ సభలకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img